గిరిజనం.. అభివృద్ధికి దూరం
ABN, Publish Date - Nov 25 , 2024 | 11:40 PM
ప్రభుత్వాలు మారుతున్నా.. ప్రజాప్రతినిధులు మారుతున్నా.. గిరిజనుల తలరాతలు మారడం లేదు. గిరిజన ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. నేటికీ కనీస మౌలిక వసతులకు నోచుకోవడం లేదు.
మౌలిక వసతులకు నోచని గ్రామాలు
ఏళ్లు గడుస్తున్నా మారని తలరాతలు
అవగాహన లోపంతో వెనుకబాటు
నేడు రాజ్యాంగ దినోత్సవం
సీతంపేట రూరల్/మెళియాపుట్టి, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వాలు మారుతున్నా.. ప్రజాప్రతినిధులు మారుతున్నా.. గిరిజనుల తలరాతలు మారడం లేదు. గిరిజన ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. నేటికీ కనీస మౌలిక వసతులకు నోచుకోవడం లేదు. వారి ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా చట్టాలు రూపొందించినా.. నిరక్షరాస్యత, అవగాహన లోపంతో అవి సక్రమంగా అమలు కావడం లేదు. భారత రాజ్యాంగం ప్రకారం వెనుకబడిన ప్రాంతాలతోపాటు కులాలను 342(1) కింద ఎస్టీలుగా గుర్తించి.. వారికి విద్య, రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలి. గిరిజనుల్లో మరింత వెనుకబడిన తెగలును ప్రత్యేక సమస్యాత్మక గిరిజన తెగలు(పీవీటీజీ)గా గుర్తించాలి. ఈ మేరకు జిల్లాలో సవర, కొండ సవర, గదబ, జాతాపు, కాపు సవర తదితర కొండ తెగలను వెనుకబడిన కూలాలుగా గుర్తించారు. కానీ వారికి విద్య, రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు మాత్రం అంతంతమాత్రమే. హక్కుల కోసం పోరాడుతున్నా.. పట్టించుకున్నవారే కరువయ్యారు. నేడు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గిరిజనుల కోసం రూపొందించిన కొన్ని చట్టాలు.. వాటి అమలు తీరును పరిశీలిద్దాం.
ఇదీ పరిస్థితి..
ఉమ్మడి జిల్లాలోని సీతంపేట ఐటీడీఏ ప్రాంతంలో 848 గ్రామాల్లో 1.60 లక్షల మంది గిరిజనులు ఉన్నారు. జిల్లా పునర్విభజన తర్వాత పార్వతీపురం మన్యం జిల్లాకు 378 గ్రామాలు, శ్రీకాకుళం జిల్లాకు 470 గ్రామాలు కేటాయించారు. ఆయా గ్రామాల గిరిజనులకు చట్ట ప్రకారం రావాల్సిన నిధులు మాత్రం కేటాయించకపోవడంతో అభివృద్ధికి దూరమవుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం సబ్‌ప్లాన్ నిధులు సైతం దారి మళ్లించింది. గ్రామాల్లో రహదారులు, తాగునీటి వసతి తదితర కనీస అభివృద్ధి పనులను విస్మరించింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇటీవల బడ్జెట్‌లో గిరిజన సంక్షేమానికి రూ.7,557కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతోనైనా అభివృద్ధి చేపడతారని గిరిజనులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
చట్టాలపై అవగాహన లేక..
- గిరిజనుల ఆర్థికాభివృద్ధి కోసం రూపొందించిన రాజ్యాంగ చట్టాలు కొంతమందికి తెలియక ఇంకా వెనుకబాటుకు గురవుతూనే ఉన్నారు. ఏజెన్సీలో న్యాయపాలన, సివిల్ కోర్టులు, సమీకృత గిరిజనాభివృద్ధి, అటవీహక్కుల గుర్తింపు చట్టం సక్రమంగా అమలుకావడం లేదు. షెడ్యూల్డ్ ప్రాంతంలో స్థానిక సంస్థలు, పెసా చట్టం, కుల ధ్రువీకరణ పత్రాలు జారీ, రుణవడ్డీ, వ్యాపార నిబంధననలు, షెడ్యూల్డ్ కులాలు, తెగలు అత్యాచార నిరోధక చట్టం రూపొందించినా.. అవగాహన లేక అమలుకు దూరమవుతున్నాయి.
- గిరిజన ఉప ప్రణాళిక విధానం సక్రమంగా అమలు కావడం లేదు. గిరిజనుల ఆర్థిక, సామాజిక అభివృద్ధితోపాటు వివిధ రకాల దోపిడీ నుంచి కాపాడుకునేందుకు బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించాలి. కానీ వారి నిధులు వారికి వినియోగించకుండా గత వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించింది.
- గిరిజనులు అప్పు తీసుకున్నా వడ్డీ కింద ఏడాదికి 24శాతం మించి తీసుకుంటే కేసులు నమోదు చేయవచ్చని 1917లో చట్టం చేశారు. కానీ వ్యాపారులు అధికంగా వడ్డీ వసూలు చేస్తున్నారు. గిరిజనుల అభివృద్ధే ధ్యేయంగా 1979లో వారి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. కానీ ఈ కార్పొరేషన్ నిధులు సక్రమంగా అందక.. గిరిజనులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.
- ఉమ్మడి జిల్లాలోని పాలకొండ నియోజకవర్గం సీతంపేటలో 1971-72లో ఐటీడీఏ నెలకొల్పారు. జిల్లా పునర్విభన సమయంలో పాలకొండ నియోజకవర్గం పార్వతీపురం మన్యం జిల్లాలో విలీనమైంది. దీంతో సీతంపేట ఐటీడీఏ కూడా ఆ జిల్లా పరిధిలోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఐటీడీఏ కొనసాగుతున్నా.. నిధులు కేటాయింపు సక్రమంగా లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- ఇప్పటికీ రహదారి సదుపాయాలు లేని గిరిజన గ్రామాలకు విద్య, వైద్యమే కాదు రక్షిత తాగునీరు సరఫరా చేయలేకపోతున్నారు. దీంతో నేటికీ చెలమలు, కొండ వాగుల్లో నీటిపైనే వారు ఆధారపడుతున్నారు. మరోవైపు అత్యవసర వేళల్లో గిరిజనులకు డోలీ మోతలు తప్పడం లేదు. అప్పటికే కొందరి పరిస్థితి చాయి దాటిపోతోంది.
- కొండపైన ఉన్న పాఠశాలలకు ఉపాధ్యాయులు సక్రమంగా వెళ్లడం లేదు. చదవుకున్న స్థానిక యువతకు నెలకు కొంత మొత్తం చెల్లించి వాలంటీర్లుగా పెట్టుకుంటున్నారు. మూడు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వ పాఠశాలలు ఉంటున్నాయి. అక్కడకు గిరిజన బాలలందరూ వెళ్లలేని దుస్థితి.
- గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు 2014 -2019 లో టీడీపీ సబ్‌ప్లాన్ నిధులను అందించింది. ఆ తరువాత వచ్చిన వైసీపీ ఈ నిధులను వేరే విధంగా మళ్లించింది. దీంతో గ్రామాల అభివృద్ధి అటకెక్కింది. గిరిజనులు మేకలు, గొర్రెల కొనుగోలుకు రూ.10వేల వరకు అందించిన సహాయాన్ని సైతం వైసీపీ ఆపేసింది.
Updated Date - Nov 25 , 2024 | 11:40 PM