నారాయణ వనం అసలుందా?
ABN, Publish Date - Dec 10 , 2024 | 12:30 AM
బొబ్బిలి పట్టణానికి కూతవేటు దూరంలో ఎన్నో తరాల గ్రామీణులతో ఉన్న అనుబంధం నారాయణ వనం. చెట్టు.. పుట్ట..అనేక రకాల జీవులతో అచ్చంగా అడవిలా ఉండేది. అటవీశాఖ పరిధిలో ఉన్న ఆ భూముల్లో ఎక్కడి నుంచో సమూహాలుగా వచ్చి భూములను ఆక్రమించి తిష్ట వేశారు.
నారాయణ వనం అసలుందా?
ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ తిష్ఠ
పెద్దల అండతో యథేచ్ఛగా ఆక్రమణ
ఏకంగా వాణిజ్య పంటల సాగు
బొబ్బిలి రూరల్, డిసెంబరు9(ఆంధ్రజ్యోతి): బొబ్బిలి పట్టణానికి కూతవేటు దూరంలో ఎన్నో తరాల గ్రామీణులతో ఉన్న అనుబంధం నారాయణ వనం. చెట్టు.. పుట్ట..అనేక రకాల జీవులతో అచ్చంగా అడవిలా ఉండేది. అటవీశాఖ పరిధిలో ఉన్న ఆ భూముల్లో ఎక్కడి నుంచో సమూహాలుగా వచ్చి భూములను ఆక్రమించి తిష్ట వేశారు. వాణిజ్య పంటలను సైతం సాగు చేస్తున్నారు. వారి వెనుక బడాబాబులు ఉన్నట్లు సమాచారం. అక్కడి పరిస్థితిపై గిరిజనులు అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా స్పందన ఉండడం లేదు. వలసదారుల ఆక్రమణలో ఉన్న నారాయణవనం నేడు రికార్డులకే పరిమితమైంది.
బొబ్బిలి మండలంలోని మల్లంపేట, గోపాలరాయుడుపేట, బొడ్డవలస గ్రామీణ ప్రాంతాల ప్రజలతో చిరకాల అనుబంధం ఉండే నారాయణవనంలో వేలాది జీవజాతులు మనుగడ సాగించేవి. అక్కడి చింపికొండ, సూదికొండ, అడ్డుకొండల మధ్య ప్రాంతాన్ని నారాయణ వనం అని పిలుచుకుంటూ నాడు కర్ర పొయ్యిల కోసం అడవిలో ఎండిపోయిన చెట్లకొమ్మలను అతికష్టం మీద తెచ్చుకొనేవారు. ఎలుగుబంట్లు, బౌరుపిల్లులు, నక్కలు వంటి ఎన్నో రకాల జీవజాతులు నివాసం ఉండేవి. నేడు ఏవీ కనిపించడం లేదు. వందలాది ఎకరాల్లో అడవిలోని చెట్లను నరికి పూర్తిగా స్వాఽధీనం చేసుకున్నారు. ఈ పర్వం ఆగడం లేదు. ఎక్కడినుంచో వచ్చిన వలసదారుల కబ్జాలకు అడవి కుచించుకుపోతోంది. దాదాపు 450 హెక్టార్లలోని అటవీ సంపద ఆవిరైపోయింది. వలసదారుల ఆక్రమణలో దాదాపు 200 ఎకరాలకు పైబడి ఆక్రమణకు గురైంది. ఇంత జరుగుతున్నా అటవీశాఖ అధికారులు నోటీసులతో సరిపుచ్చుకుంటున్నారు. ఉన్నతాధికారులు, బీట్ అధికారులు, వాచర్లు ఏమి చేస్తున్నారన్న ప్రశ్న ఆయా గ్రామాల ప్రజల నుంచి వినిపిస్తోంది.
Updated Date - Dec 10 , 2024 | 12:30 AM