గిరి చేరని సంక్షేమం
ABN, Publish Date - Nov 25 , 2024 | 11:44 PM
శృంగవరపుకోట మండలం దారపర్తి పంచాయతీలో ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లాలంటే ఒకటి నుంచి రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది. పేరుకే దారపర్తి పంచాయతీ. ఏ పని పడినా సుమారు పది కిలోమీటర్లు దూరం ఉన్న మూలబొడ్డవర పంచాయతీ అమ్మపాలెం రావాల్సిందే. దారపర్తి గ్రామ సచివాలయాన్ని కూడా ఈ గ్రామంలోనే నిర్వహిస్తున్నారు. ఇక్కడకు రావాలంటే కొండలు, గుట్టలు దాటాలి.
గిరి చేరని సంక్షేమం
చట్టాలున్నా అమలు అంతంతే
నేటికీ విద్య, వైద్యం, రక్షిత నీరు కరువు
రహదారులు దర్భరం
గ్రామ సచివాలయ సేవలు దూరం
నేడు రాజ్యాంగ దినోత్సవం
- శృంగవరపుకోట మండలం దారపర్తి పంచాయతీలో ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లాలంటే ఒకటి నుంచి రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది. పేరుకే దారపర్తి పంచాయతీ. ఏ పని పడినా సుమారు పది కిలోమీటర్లు దూరం ఉన్న మూలబొడ్డవర పంచాయతీ అమ్మపాలెం రావాల్సిందే. దారపర్తి గ్రామ సచివాలయాన్ని కూడా ఈ గ్రామంలోనే నిర్వహిస్తున్నారు. ఇక్కడకు రావాలంటే కొండలు, గుట్టలు దాటాలి. తమ గ్రామాలకు అందుబాటులో ఉండేలా పల్లపు దుంగాడలో సచివాలయం ఏర్పాటు చేయాలని గిరిజనులు కోరినా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు.
- దారపర్తి పంచాయతీ పరిధిలోని గ్రామాల విద్యార్థులు చదువుకొనేందుకు పల్లపు దుంగాడ, గూనపాడు గ్రామాల పాఠశాలలకు వెళ్లాలి. అక్కడ ఉపాధ్యాయులు కనిపించరు. వారి స్థానంలో ఆయా గ్రామాల్లో చదువుకుని ఖాళీగా వున్న యువతకు ఎంతోకొంత ముట్టజెప్పి చదువు చెప్పిస్తున్నారు. గిరిజనులకు ఆరోగ్యం క్షిణిస్తే డోలీ కట్టుకుని ఆసుపత్రులకు రావాలి.
- మూలబొడ్డవర పంచాయతీ దంపగుంట గ్రామ చిన్నారులు చదువుకోవాలంటే మూడు కిలోమీటర్ల దూరంలో వున్న కాపుసోంపురం పాఠశాలకు వెళ్లాలి. అది కూడా రాళ్లు, పొదలు దాటుకుని వెళ్లాలి. లేకుండా బాలకార్మికునిగా ఉండాల్సిందే.
- శృంగవరపుకోట ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో 3వ తరగతి నుంచి 10వతరగతి వరకు 191 మంది గిరిజన విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ ఆశ్రమ పాఠశాల భవనం చూస్తే విద్యార్థులకు అందుతున్న సంక్షేమం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఐదేళ్ల తరువాత ఇటీవల దుప్పట్లు అందించారు. కంచాలు, గ్లాసులు, పెట్టెలు వంటివి ఐదేళ్లుగా ఇవ్వలేదు. కిటికీలు పాడయ్యాయి. దోమలు రాకుండా బిగించిన మెస్‌లు ఊడిపోయాయి.
- గంట్యాడ మండలం దిగువ కొండపర్తిగ్రామ సమీపంలో వున్న బీమవరం గిరిజన గ్రామం తాటిపూడి జలాశయానికి ఆనుకుని ఉంది. తాగేందుకు నీరు లేదు. రహదారి సదుపాయం లేదు. ప్రభుత్వ పాఠశాల శిథిలావస్థకు చేరింది.
గిరిజన గ్రామాల్లో నివశిస్తున్న ప్రజలకు రాజ్యాంగపరంగా దక్కాల్సిన సదుపాయాలు ఏ స్థాయిలో అందుతున్నాయో చెప్పేందుకు ఇవే ఉదాహరణలు. రహదారి ఉన్న గిరిజన గ్రామాలకు కూడా సక్రమంగా విద్య, వైద్యం, రక్షిత నీటి సరఫరా లేదు.
శృంగవరపుకోట, నవంబరు 25(ఆంధ్రజ్యోతి):
రహదారులు, రక్షిత తాగునీరు, విద్య, వైద్యం వంటి మౌలిక వసతులు పొందడం ప్రతి ఒక్కరికీ రాజ్యాంగం కల్పించిన హక్కు. గిరిజనుల కోసమైతే ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. ఇన్ని ఉన్నా గిరిజనులు ఇప్పటికీ రాజ్యాంగ పరంగా అందాల్సిన హక్కులకు దూరంగానే బతుకుతున్నారు. కూటమి ప్రభుత్వం రాజ్యాంగపరంగా అందాల్సిన హక్కులు, స్వేచ్ఛను కల్పిస్తుందన్న ఆశతో ఉన్నారు. భారత రాజ్యాంగ పితామహుడిగా పిలిచే బీఆర్ అంబేడ్కర్ 125వ జయంతి రోజున రాజ్యాంగ దినోత్సవంగా నవంబరు 26ను జరపాలని ప్రధాని మోదీ ప్రకటించారు. ఎనిమిదేళ్ల నుంచి దినోత్సవం జరుపుతున్నా అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా గిరిజనుల బతుకులు మాత్రం మారడం లేదు.
ఉమ్మడి జిల్లాలో విజయనగరం మండలం తప్ప మిగిలిన అన్ని మండలాల్లోను గిరిజన జనాభా ఉంది. 1,09,934 మంది పురుషులు, 1,15,622 మంది మహిళలు (మొత్తం 2,25,556 మంది గిరిజనులు) ఉన్నారు. వీరిలో అత్యధిక శాతం అడవులనే నివాసంగా చేసుకొని జీవనం సాగిస్తున్నారు. ఇతరవర్గ ప్రజలతో పోలిస్తే వీరు అనేక రంగాల్లో వెనక బడి ఉన్నారు. మరికొంత మంది మైదాన ప్రాంతాల్లో ఉన్నా మెరుగైన జీవనాన్ని గడిపే పరిస్థితి లేదు. చట్టాలెన్నివున్నప్పటికీ ఇప్పటికీ రహదారి సదుపాయాలు లేని గ్రామాలకు కొదవలేదు. దీంతో విద్య, వైద్యమే కాదు రక్షిత తాగునీరు సరఫరా చేయలేకపోతున్నారు. మంచి నీరు అందించేందుకు బోర్లు తవ్వాలి. లేదంటే నీటి వనరులున్న ప్రాంతాల నుంచి ప్రత్యేక క్లోరినేషన్ ద్వారా పైపులైను వేయలి. అంతచొరవ తీసుకోవడం లేదు. రహదారులు లేకపోవడంతో వైద్యులు ఈ గ్రామాలకు వెళ్లడం లేదు. ఒకరిద్దరు పారామెడికల్ సిబ్బంది అప్పుడప్పుడు నడిచి వెళ్తున్నారు. గిరిజనులు ప్రాణాల మీదకు వస్తున్నప్పుడు డోలీ కట్టుకొని ఆసుపత్రులకు వస్తున్నారు. అప్పటికే కొందరి పరిస్థితి చాయి దాటిపోతోంది.
మొక్కుబడి చదువులే...
కొండపైన వున్న పాఠశాలలకు ఉపాధ్యాయులు వెళ్లడం లేదు. రోజూ రాకపోకలు సాగించేందుకు రహదారి లేదు. పదుల కిలోమీటర్ల దూరం రోజూ నడచి వెళ్లలేక నెలకు ఒకట్రెండు రోజులు వెళ్లి ముఖం చూపిస్తున్నారు. చదవుకున్న స్థానిక యువతకు నెలకు కొంత మొత్తం చెల్లించి వాలంటీర్లుగా పెట్టుకుంటున్నారు. మూడు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వ పాఠశాలలు ఉంటున్నాయి. అక్కడకు గిరిజన బాలలందరూ వెళ్లలేని దుస్థితి. విష సర్పాలు, ప్రమాద కీటకాల బారిన పడతారేమోనని తల్లిదండ్రులు భయపడుతున్నారు. గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు 2014 -2019 లో టీడీపీ సబ్‌ప్లాన్ నిధులను అందించింది. ఆ తరువాత వచ్చిన వైసీపీ ఈ నిధులను వేరే విధంగా మళ్లించింది. దీంతో గ్రామాల అభివృద్ధి అటకెక్కింది. గిరిజనులు మేకలు, గొర్రెల కొనుగోలుకు రూ.10వేల వరకు అందించిన సహాయాన్ని సైతం వైసీపీ ఆపేసింది.
గిరిజనుల చట్టాలు
2006 అటవీ హక్కుల చట్టం, పంచాయతీ నిబంధనల విస్తరణ చట్టం (పీసా), రుణ వ్యాపార నిబంధనలు, అత్యాచార నిరోధక చట్టం, గిరిజనుల భూములను వేరొకరు కొనుగోలు చేయకుండా 1/70 యాక్టు, కోర్టు ఫీజు, దావాల్లో మినహాయింపు చట్టంతో పాటు ఎస్టీ జాతీయ కమిషన్, సమగ్ర గిరిజనాభివృద్థి సంస్థ (ఐటీడీఏ)లు ఉన్నాయి.
చెలమల నీటిని తాగుతున్నాం
కొండల మధ్య నుంచి వస్తున్న చెలమల నీరు, నేల బావి నీటిని తాగుతున్నాం. ఇంటింటి కుళాయిలను నిర్మిస్తామని చెప్పారు. పైపులు తెచ్చారు. బోరు తవ్వించలేదు. మంచి నీరు లేకపోవడంతో తరచూ రోగాల బారిన పడుతున్నాం.
జన్ని లచ్చయ్య, పల్లపు దుంగాడ, దారపర్తి గిరిజన పంచాయతీ, ఎస్.కోట
విద్య, వైద్యం అందడం లేదు
రక్షిత తాగునీటి సరఫరా అంతంతమాత్రమే. క్లోరినేషన్ ఉండదు. ఏటా మలేరియా జ్వరాల బారిన పడుతున్నారు. అప్పుడప్పుడు గ్రామానికి వైద్య సిబ్బంది వస్తున్నారు. రహదారులు లేకపోవడంతో మా గిరిజన గ్రామాలకు ఎవరూ వచ్చేందుకు ఇష్టపడడం లేదు.
జె.గౌరిష్, గిరిజన సంఘ నాయకుడు
అభివృద్ధికి కట్టుబడి ఉంది
కూటమి ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి కట్టుబడి ఉంది. నాతోపాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలంతా శాసన సభలో వీరి సమస్యలను ప్రస్తావించాం. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కూడా హామీ ఇచ్చారు. కొత్తగా ఫీడర్ అంబులెన్స్‌లను ఇస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 50.37 కిలోమీటర్ల పరిధిలో రహదారుల నిర్మాణానికి రూ.52.03 కోట్లు మంజూరయ్యాయి.
కోళ్ల లలితకుమారి, శాసన సభ్యురాలు, ఎస్.కోట
Updated Date - Nov 25 , 2024 | 11:44 PM