ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సీతంపేట ఐటీడీఏపై నీలినీడలు

ABN, Publish Date - Nov 07 , 2024 | 11:45 PM

సీతంపేట ఐటీడీఏకు ఇన్‌చార్జి పీవోలే దిక్కు అయ్యారు. సార్వత్రిక ఎన్నికల నుంచి ఇప్పటి వరకు రెగ్యులర్‌ పీవోలు కరువయ్యారు. ఒకవేళ రెగ్యులర్‌ పీవోలను నియమించినా వారం పదిరోజుల్లోనే బదిలీ చేసేస్తున్నారు. గత ఐదు నెలలుగా పూర్తిగా రెగ్యులర్‌ పీవో లేకపోవడంతో పాలన గాడి తప్పింది.

సీతంపేటలోని ఐటీడీఏ కార్యాలయం

- రెగ్యులర్‌ పీవో నియామకంపై తాత్సారం

- ఐదు నెలలుగా ఇన్‌చార్జిలతోనే కాలయాపన

- వేధిస్తున్న నిధుల కొరత

- పరిష్కారం కాని గిరిజనుల సమస్యలు

-కూటమి ప్రభుత్వంపైనే ఆశలు

సీతంపేట ఐటీడీఏకు ఇన్‌చార్జి పీవోలే దిక్కు అయ్యారు. సార్వత్రిక ఎన్నికల నుంచి ఇప్పటి వరకు రెగ్యులర్‌ పీవోలు కరువయ్యారు. ఒకవేళ రెగ్యులర్‌ పీవోలను నియమించినా వారం పదిరోజుల్లోనే బదిలీ చేసేస్తున్నారు. గత ఐదు నెలలుగా పూర్తిగా రెగ్యులర్‌ పీవో లేకపోవడంతో పాలన గాడి తప్పింది. ఇన్‌చార్జితోనే పాలన నెట్టుకొస్తున్నారు. దీంతో సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో గిరిజనులకు తెలియని పరిస్థితి నెలకొంది. ఇతర అధికారులకు సమస్యలు మొరుపెట్టుకుంటున్నా పరిష్కారం కావడం లేదు. నిధులు లేవని ప్రత్నామ్నాయం చూసుకోవాలని ఉచిత సలహా ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వం స్పందించి రెగ్యులర్‌ పీవోను నియమించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

సీతంపేట రూరల్‌, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): సీతంపేట ఐటీడీఏపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు కావస్తున్నా ఇంతవరకు ఐటీడీఏకు రెగ్యులర్‌ పీవోను నియమించలేదు. ప్రభుత్వం ఏర్పడిన రోజుల వ్యవధిలో ఇక్కడి పీవో రాహుల్‌కుమార్‌రెడ్డిని బదిలీ చేశారు. ఆ తరువాత రెగ్యులర్‌ పీవోను నియమించలేదు. దీంతో ఉమ్మడి జిల్లాల్లోని గిరిజనుల సమస్యలు పరిష్కారం కావడం లేదని గిరిజన సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలో 20 సబ్‌ప్లాన్‌ మండలాలు ఉన్నాయి. వీటిలో 16 శ్రీకాకుళం జిల్లాలో, 4 పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్నాయి. వీటి పరిధిలో 2.19 లక్షల ఆదివాసీలు నివసిస్తున్నారు. వీరికి ఏ సమస్య వచ్చినా మొదట గుర్తొచ్చేది సీతంపేట ఐటీడీఏనే. అలాంటి ఐటీడీఏ ఇప్పుడు రెగ్యులర్‌ పీవో(ఐఏఎస్‌) లేక బోసిపోతోంది. పాలకొండ సబ్‌ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఇన్‌చార్జి పీవోగా కొనసాగుతున్నారు. దీంతో ఇటు రెవెన్యూ శాఖకు, అటు గిరిజనులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేక పోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

నిధుల లేమి..

సీతంపేట ఐటీడీఏ నిధుల లేమితో కొట్టుమిట్టాడుతోంది. గత వైసీపీ ప్రభుత్వం ఐటీడీఏకు రెగ్యులర్‌ పీవోలను పూర్తిస్థాయిలో నియమించింది. కానీ, నిధులు కేటాయించడంలో మాత్రం చేతులెత్తేసింది. గిరిజనులకు ఆర్థిక చేయూనిచ్చే పథకాలన్నీ మరుగున పడేసింది. దీంతో గిరిజనులు ఆర్థికంగా వెనుకబడ్డారు. నూతనంగా ఏర్పాటైన కూటమి ప్రభుత్వం పథకాలన్నీ పునరుద్ధరిస్తుందని, దీని ద్వారా తమకు లాభం చేకూరుతుందని మన్యం వాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే, ఐటీడీఏకు రెగ్యులర్‌ పీవో లేకపోవడంతో వారి విశ్వాసం సన్నగిల్లుతోంది. ప్రతీ సోమవారం ఐటీడీఏ నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు గిరిజనుల నుంచి వందల సంఖ్యలో వినతులు వస్తున్నాయి. వీటిలో నిధుల వ్యయంతో కూడిన నిర్మాణ పనులు, మంచినీటి సమస్య, ఆర్థిక చేయూత అందించాలని కోరుతూ వచ్చిన వినతులే ఎక్కువగా ఉంటున్నాయి. అయితే, ఐటీడీఏలో నిధులు లేవని, ప్రత్యామ్నాయం చూసుకోవాలని అధికారులు చెబుతుండడంతో గిరిజనులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రెగ్యులర్‌ పీవో ఉంటే తమకు ఈ పరిస్థితి ఉండేది కాదని వారు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా రెగ్యులర్‌ పీవోను నియమించాలని గిరిజనులు కోరుతున్నారు.

ఏదీ నాటి సహకారం?

గత టీడీసీ ప్రభుత్వ హయాంలో సీతంపేట ఐటీడీఏ ద్వారా గిరిజనులకు వివిధ సంక్షేమ పథకాలు అందాయి. 2014-2019 మధ్య పీవీటీజీలకు సీసీడీపీ(కన్జర్వేటివ్‌ కాంప్రహేన్సివ్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌)నిధులు రూ.12కోట్లను అప్పటి ప్రభుత్వం కేటాయించింది. ఈ నిధులతో 19 మండలాల్లోని సవర, గదబ కులాలకు చెందిన 1.6లక్షల మంది ఆదివాసీలు వివిధ పథకాల ద్వారా లబ్ధిపొందారు. అలాగే ట్రైకార్‌ పథకం కింద ఆ ఐదేళ్లలో రూ.24కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధుల ద్వారా 2,400 మంది గిరిజనులు రుణ సహాయం పొందారు. ఇక ఎన్‌ఎస్‌టీఎఫ్‌డీసీ పథకానికి సంబంధించి రూ.5కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో గిరిజన యువతకు ఇన్నోవా, బొలేరో వంటి పాసింజర్‌ వాహనాలతో పాటు ట్రాక్టర్లు, ఆటోలు, సప్లయర్స్‌, డైరీ ఫాం, ఇటుకల తయారీ వంటి యూనిట్లను కేటాయించారు. అదే విధంగా ఎస్‌సీఏ-టీఎస్‌పీ కింద రూ.7కోట్లు కేటాయించి గిరిజనులకు యూనిట్లను మంజూరు చేశారు. మొత్తంగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆదివాసీలు రూ.53కోట్ల లబ్ధిపొందారు. కానీ, వైసీపీ ప్రభుత్వం గిరిజనుల కోసం ఒక్క పథకం కూడా అమలు చేయలేదు సరికదా, కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను సైతం పక్కదారి పట్టించిందనే విమర్శలు ఉన్నాయి.

ఐటీడీఏ తరలిపోనుందా?

సీతంపేట ఐటీడీఏ ఇక్కడి నుంచి శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి తరలిపోతుందనే పుకార్లు వినిపిస్తున్నాయి. డీడీ కార్యాలయం శ్రీకాకుళం కేంద్రంలో ఉండాలని గతంలోనే ఆదేశాలు అందాయి. అయితే, గిరిజన సంఘాల నాయకులు అభ్యంతరం చెప్పడంతో ఈ ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. ఇటీవల శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో జరిగిన బహిరంగ సభలో మంత్రి కె.అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. పాతపట్నం కేంద్రంగా ఐటీడీఏ రానుందని చెప్పారు. దీంతో ఐటీడీఏ ఇక్కడి నుంచి తరలిపోతుందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సీతంపేట, పార్వతీపురం ఐటీడీఏలకు నేటికీ రెగ్యులర్‌ పీవోలను ప్రభుత్వం నియమించకపోవడంతో ఈ పుకార్లకు బలం చేకూరినట్లు అవుతోంది.

ఎటువంటి సమాచారం లేదు

సీతంపేట ఐటీడీఏను ఇక్కడి నుంచి తరలిస్తున్నట్లు ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి సమాచారం లేదు. నిధుల లేమికి సంబంధించి ఇంకా ఓటు ఆన్‌ బడ్జెట్‌ పెట్టలేదు. బడ్జెట్‌ ఆధారంగా ఐటీడీఏకు నిధులు ఏ మేరకు కేటాయిస్తారనే దానిపై స్పష్టత వస్తుంది.

-జి.చిన్నబాబు, ఐటీడీఏ ఏపీవో

Updated Date - Nov 07 , 2024 | 11:45 PM