ట్రాఫిక్ పద్మవ్యూహం!
ABN, Publish Date - Jan 29 , 2024 | 12:39 AM
పట్టణంలో పెరుగుతున్న వాహనాల రద్దీకి అనుగుణంగా రహదారులు విస్తరణకు నోచుకోకపోవడం, రోడ్లకు ఇరువైపులా ఆక్రమణలు పెరిగిపోవడంతో నిత్యం ట్రాఫిక్ సమస్య తలెత్తుతున్నది. ఉదయం, సాయంత్రం, రాత్రి సమయాల్లో ట్రాఫిక్ స్తంభిస్తుండడంతో వాహనదారులతోపాటు ప్రజలు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. చోడవరం పట్టణంలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా తయారైంది. నియోజకవర్గ కేంద్రం
చోడవరంలో విస్తరణకు నోచుకోని రహదారులు
రోడ్లను ఆక్రమించిన వ్యాపారులు
చీడికాడ, లక్ష్మీపురం, దేవరాపల్లి వెళ్లే రహదారుల్లో నిత్యం ట్రాఫిక్ జామ్
పట్టించుకోని పోలీసులు, పంచాయతీ అధికారులు
చోడవరం, జనవరి 28: పట్టణంలో పెరుగుతున్న వాహనాల రద్దీకి అనుగుణంగా రహదారులు విస్తరణకు నోచుకోకపోవడం, రోడ్లకు ఇరువైపులా ఆక్రమణలు పెరిగిపోవడంతో నిత్యం ట్రాఫిక్ సమస్య తలెత్తుతున్నది. ఉదయం, సాయంత్రం, రాత్రి సమయాల్లో ట్రాఫిక్ స్తంభిస్తుండడంతో వాహనదారులతోపాటు ప్రజలు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
చోడవరం పట్టణంలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా తయారైంది. నియోజకవర్గ కేంద్రం కావడం, వివిధ ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే వాహనాలతో రద్దీ విపరీతంగా పెరిగింది. ప్రత్యేకించి చోడవరం- చీడికాడ, చోడవరం- లక్ష్మీపురం, చోడవరం- దేవరాపల్లి మార్గాల్లో తరచూ ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ రహదారుల్లో సమస్య చాలా అధికంగా వుంది. దశాబ్దాల నుంచి రోడ్లు విస్తరణకు నోచుకోకపోవడం ఒక సమస్య అయితే.. ఇరువైపులా ఉన్న దుకాణదారులు ఇష్టారాజ్యంగా రోడ్డుపైకి చొచ్చుకుని వచ్చి వ్యాపారాలు సాగిస్తుండడం మరో సమస్య. దీంతో కొనుగోలుదారులు తమ వాహనాలను దుకాణాల ముందు రోడ్డుపై పార్కింగ్ చేయాల్సి వస్తున్నది. అంతేకాక సరకుల అన్‌లోడింగ్ చేసే వాహనాలను సైతం రోడ్డుపైనే వుంచుతున్నారు. ఫలితంగా ఆయా మార్గాల్లో వాహనాల రాకపోలకు తీవ్ర ఆటంకం కలుగుతున్నది. వ్యాన్లు, కార్లు వంటి వాహనాలు ఎదురైతే తప్పుకోవడానికి వీలు కావడంలేదు.
చోడవరం- చీడికాడ రోడ్డులో మెయిన్ రోడ్డు నుంచి పూర్ణా థియేటర్ వరకు, చోడవరం-లక్ష్మీపురం రోడ్డులో మెయిన్ రోడ్డు నుంచి చలపతి స్కూల్ వరకు ట్రాఫిక్ సమస్య నిత్యకృత్యంగా మారింది. లక్ష్మీపురం రోడ్డులో పాఠశాలలు ఎక్కువగా ఉండడంతో విద్యార్థులను ఉదయం స్కూళ్లకు తీసుకురావడానికి, సాయంత్రం తిరిగి ఇళ్లకు తీసుకెళ్లడానికి బస్సులు వస్తుంటాయి. ఈ సమయాల్లో బస్సులను రోడ్డుపైనే వుంచడంతో ఇతర వాహనాల రాకపోకలకు ఇబ్బంది కులుగతున్నది. ఇదే పరిస్థితి కొత్తూరు జంక్షన్ నుంచి దేవరాపల్లి వెళ్లే రోడ్డులో చినబజారు జంక్షన్ వరకు వుంది. ఈ మూడు రహదారుల్లో తరచూ ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతున్నప్పటికీ పోలీసులు స్పందించడంలేదని వాహనదారులు ఆరోపిస్తున్నారు. పోలీసు అధికారులతోపాటు, పంచాయతీ అధికారులు కూడా స్పందించి ప్రధాన రహదారుల్లో ఆక్రమణలను తొలగించాలని, రోడ్డుపై వాహనాల పార్కింగ్‌ను నిరోధించాలని స్థానికులు కోరుతున్నారు.
Updated Date - Jan 29 , 2024 | 12:39 AM