‘మహా’ బరితెగింపు
ABN, Publish Date - Jan 29 , 2024 | 12:39 AM
మహావిశాఖ నగర పాలకసంస్థ (జీవీఎంసీ) ఉన్నతాధికారులు అస్మదీయుల సేవలో పరితపిస్తున్నారు.
నగరంలో హోర్డింగ్‌ల ఏర్పాటుకు అడ్డగోలుగా అనుమతులు
టెండరు ద్వారా కేటాయించాలన్న నిబంధన బేఖాతరు
ఏడాది కిందట అస్మదీయులైన ఏజెన్సీలకు 70 హోర్డింగ్‌ల కేటాయింపు
తాజాగా మరిన్ని హోర్డింగ్స్‌కు మరో ఏజెన్సీకి అనుమతి
రూ.పది కోట్ల జీవీఎంసీ ఆదాయానికి గండి
అధికారుల తీరుపై మిగిలిన యాడ్ ఏజెన్సీల అభ్యంతరం
అయినా పట్టించుకోని అధికారులు
(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)
మహావిశాఖ నగర పాలకసంస్థ (జీవీఎంసీ) ఉన్నతాధికారులు అస్మదీయుల సేవలో పరితపిస్తున్నారు. తమను ప్రసన్నం చేసుకుంటే చాలు నిబంధనలను పక్కనపెట్టి మరీ మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలోని ప్రధాన రహదారులపై హోర్డింగ్స్‌ను నామినేషన్ పద్ధతిలో ఏడాది కిందట అస్మదీయులకు కట్టబెట్టిన అధికారులు, తాజాగా మరికొన్ని రహదారులపై హోర్డింగ్స్ ఏర్పాటుకు ఇదే పద్ధతిలో అనుమతులు ఇచ్చేయడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
జీవీఎంసీకి ఆదాయాన్ని సమకూర్చే ప్రధాన వనరుల్లో ప్రకటనల విభాగం ఒకటి. టౌన్‌ప్లానింగ్‌లో అంతర్భాగంగా ఉండే ప్రకటన విభాగం ద్వారా జీవీఎంసీకి ఏటా రూ.25 కోట్లు ఆదాయం సమకూరుతుంది. దీనిలో అత్యధికంగా నగర పరిధిలోని ప్రధాన రహదారులు, కూడళ్లలో ఉండే కాంటీలీవర్ యూనిపోల్ బోర్డులు (హోర్డింగ్‌లు), రోడ్డు మధ్యన డివైడర్, సెంటర్ మీడియన్‌లపైన ఉండే లాలీపాప్ యాడ్ బోర్డుల ద్వారా లభిస్తుంది. హోర్డింగ్‌లు, లాలీపాప్‌యాడ్ బోర్డులను దక్కించుకునేందుకు నగరంతోపాటు రాష్ట్రంలోని వివిధ వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలతోపాటు ప్రైవేటు యాడ్ ఏజెన్సీలు పోటీ పడుతుంటాయి. ఒకటి, రెండు రోడ్లను ఒక స్ర్టెచ్‌గా విభజిస్తూ జీవీఎంసీ ప్రతి ఏటా లేదా రెండుమూడేళ్లకు ఒకసారి వీటిని టెండర్ ద్వారా కేటాయిస్తుంది.
నిబంధనలను కాదని...
నిబంధనల ప్రకారం టెండరు పిలిచేముందు టౌన్‌ప్లానింగ్ అధికారులు రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్‌ఎఫ్‌పీ) పిలుస్తారు. ఆర్‌ఎఫ్‌పీలో యాడ్ ఏజెన్సీలు కోడ్ చేసిన ధరల్లో అత్యధికంగా చెల్లించేందుకు సిద్ధపడిన వారి అంచనాలను బట్టి జీవీఎంసీ అధికారులు టెండర్ పిలుస్తారు. ఆసక్తి ఉన్న సంస్థలు, వ్యాపారులతోపాటు యాడ్ ఏజెన్సీలు టెండరులో పాల్గొంటాయి. ఎవరు ఎక్కువ మొత్తం చెల్లించేందుకు ముందుకువస్తే వారికి టెండర్ కేటాయిస్తుంది. టెండర్ దక్కించుకున్నవారు స్వయంగా ఆయా ప్రాంతాల్లో ప్రకటనలు పెట్టుకోవడం లేదా ఇతరులకు సబ్‌లీజ్‌కు ఇవ్వడం చేసుకోవచ్చు. దీనిప్రకారం ప్రస్తుతం బీచ్‌రోడ్డులో హోర్డింగ్స్, లాలీపాప్ యాడ్స్‌తోపాటు, మరో రెండు ప్రధాన రోడ్లపై లాలీపాప్ యాడ్స్‌కు ఏడాది కిందట టెండర్ గడువు ముగిసింది. తర్వాత వాటిని ఆర్‌ఎఫ్‌పీ పిలిచి, టెండర్ ఆహ్వానించాల్సి ఉన్నప్పటికీ జీవీఎంసీ అధికారులు కొన్ని లాలీపాప్ యాడ్‌బోర్డులకు మాత్రమే టెండర్ పిలిచి, మిగిలిన వాటితో పాటు నగరంలోని ప్రధాన రహదారులపై సుమారు 70 వరకూ కాంటిలీవర్ హోర్డింగ్‌లను నామినేషన్ పద్ధతిలో కేటాయించేయడం అప్పట్లో వివాదాస్పదమైంది. నగరంలోని మిగిలిన యాడ్ ఏజెన్సీల నిర్వాహకులు జీవీఎంసీ కమిషనర్, టౌన్‌ప్లానింగ్ చీఫ్ సిటీప్లానర్‌ను కలిసి అభ్యంతరం తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఎలా అప్పగిస్తారంటూ నిలదీయడంతో వారికి తలాకొన్ని బోర్డులు ఇస్తామంటూ బుజ్జగించారు. తాజాగా మరో యాడ్ ఏజెన్సీకి నగరంలోని పలురహదారులపై కాంటిలీవర్ యూనిపోల్ హోర్డింగ్‌ల ఏర్పాటుకు జీవీఎంసీ అధికారులు నామినేషన్ పద్ధతిలో అనుమతించారంటూ నగరంలోని యాడ్ ఏజెన్సీల ప్రతినిధులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కచ్చితంగా టెండర్ పిలిచిన తర్వాత ఎవరు ఎక్కువకు కోట్‌చేస్తే వారికి కేటాయించాల్సిన హోర్డింగ్‌లను ఏకపక్షంగా ఎలా కేటాయిస్తారని ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు అడిగినా జీవీఎంసీ అధికారులు దాచిపెడుతున్నారని, సమాచార హక్కు చట్టం కింద వివరాలు కోరినా ప్రయోజనం కనిపించడం లేదని వాపోతున్నారు.
రూ. పది కోట్ల ఆదాయానికి గండి:
నగరంలోని ప్రధాన రోడ్లపై హోర్డింగ్‌లు, లాలీపాప్ యాడ్ బోర్డుల ఏర్పాటుకు టెండరు పిలిస్తే జీవీఎంసీకి సుమారు రూ.పది కోట్లు ఆదాయం సమకూరేదని యాడ్ ఏజెన్సీల నిర్వాహకులు చెబుతున్నారు. టెండర్ ప్రస్తావన లేకుండా అస్మదీయులైన యాడ్ ఏజెన్సీకి కట్టబెట్టేస్తుండడంతో ఆదాయం కోల్పోయినట్టేనన్నారు. మరోవైపు జీవీఎంసీ అధికారులు కూడా సంస్థకు ఆదాయం పెంచేందుకు తామంతా కష్టపడి పనిచేస్తుంటే... ఉన్నతాధికారులు ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని అమలుకు సహకరించాలనిఒత్తిడిచేస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు.
భవిష్యత్తులో ప్రమాదాలకు ఆస్కారం
రోడ్డు మధ్యన ఉండే సెంటర్ మీడియన్లపై ఏర్పాటుచేసే కాంటిలీవర్ యూనిపోల్ హోర్డింగ్‌లు భవిష్యత్తులో ప్రమదాలకు కారణమవుతాయని పోలీస్ అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఒక్కో హోర్డింగ్ ఎత్తు సుమారు 34 అడుగులు ఉంటుందని, పోల్‌పైన హోర్డింగ్ ఎత్తు 12 అడుగులు, వెడల్పు 30 అడుగులు ఉంటుందని, భవిష్యత్తులో తుపాన్లు, పెనుగాలులు సంభవించే సమయంలో హోర్డింగ్‌లు ఎగిరిపడితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా అలాంటి బోర్డులు ఏర్పాటుచేసేచోట రోడ్డు వెడల్పు కనీసం వంద అడుగులుండాలని, అప్పుడే రోడ్డుపై వెళ్లే వాహనచోదకులకు దూరంగా ఉండే వాహనాల రాకపోకలు, రోడ్డు పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుందని పేర్కొంటున్నారు. కానీ నగరంలో ఎక్కడా కనీసం కిలోమీటరు పొడవున తిన్నగా ఉన్నరోడ్డుగాని, వంద అడుగులు వెడల్పు ఉన్న రోడ్డుగానీ లేనప్పటికీ సుమారు 90 ప్రాంతాల్లో కాంటిలీవర్ యూనిపోల్ హోర్డింగ్‌ల ఏర్పాటుకు అనుమతి ఇవ్వడం సరికాదంటున్నారు. వీటన్నింటినీ జీవీఎంసీ అధికారులు పట్టించుకోకుండా అస్మదీయుల సేవలో తరిస్తూ జీవీఎంసీ ప్రయోజనాలు, నగరవాసుల భద్రతను గాలికి వదిలేయడం దారుణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Updated Date - Jan 29 , 2024 | 12:39 AM