పాడేరుపై వీడని ఉత్కంఠ
ABN, Publish Date - Mar 20 , 2024 | 12:51 AM
పాడేరు అసెంబ్లీ స్థానం కూటమి అభ్యర్థి ఎవరనే దానిపై ఇంకా ఉత్కంఠ వీడలేదు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా ఈ సీటు ఎవరిని వరిస్తుందోనన్న ఉత్సుకత నెలకొంది. బీజేపీకే ఈ సీటు కేటాయిస్తారని ప్రచారం జరుగుతున్నప్పటికీ ఆ పార్టీ అధికారికంగా ప్రకటన చేయకపోవడంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
- కూటమి అభ్యర్థి ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తి
- వైసీపీలోనూ చర్చ
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
పాడేరు అసెంబ్లీ స్థానం కూటమి అభ్యర్థి ఎవరనే దానిపై ఇంకా ఉత్కంఠ వీడలేదు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా ఈ సీటు ఎవరిని వరిస్తుందోనన్న ఉత్సుకత నెలకొంది. బీజేపీకే ఈ సీటు కేటాయిస్తారని ప్రచారం జరుగుతున్నప్పటికీ ఆ పార్టీ అధికారికంగా ప్రకటన చేయకపోవడంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
జిల్లా కేంద్రం పాడేరు అసెంబ్లీ స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా ఎవరు బరిలో దిగుతారోనని అందరూ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. పొత్తులో భాగంగా ఈ సీటు బీజేపీకి కేటాయిస్తారని జోరుగా ప్రచారం జరుగుతున్నా ఇప్పటికీ దీనిపై స్పష్టత రాకపోవడంతో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ రోజు రోజుకు పెరుగుతున్నది. పాడేరు స్థానం తమకే దక్కుతుందని స్థానిక టీడీపీ నేతలు భావిస్తున్నప్పటికీ, తమకు కేటాయించారని బీజేపీ ప్రకటించినట్టుగా ప్రచారం జరుగుతుండడంతో ఈ వ్యవహారం ప్రస్తుతం జిల్లాలో హాట్ పొలిటికల్ టాపిక్‌గా మారింది. వాస్తవానికి అటు టీడీపీ గాని, ఇటు బీజేపీ గాని తమకే పాడేరు అసెంబ్లీ స్థానం కేటాయించారని అధికారికంగా ప్రకటించిన దాఖలాలు లేవు. కానీ జరుగుతున్న ప్రచారం, కొన్ని ఊహాగానాల నేపథ్యంలోనే పాడేరు బీజేపీకి ఇస్తారట అని కొందరంటే... కాదు టీడీపీకే ఇస్తారని మరికొందరు అంటున్నారు. దీంతో పాడేరు దక్కెదెవరికి.? అనేది చర్చనీయాంశమైంది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో అచీతూచి అడుగులు వేయాలనే లక్ష్యంతోనే ఉమ్మడి అభ్యర్థి ప్రకటనపై మూడు పార్టీలు సంయమనం పాటిస్తున్నాయని తెలుస్తున్నది.
ఉమ్మడి అభ్యర్థిపై వైసీపీలోనే తీవ్ర చర్చ
పాడేరు అసెంబ్లీ టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి ఎవరనేది ఆయా పార్టీల నేతల కంటే, అధికార వైసీపీలోనే తీవ్రమైన చర్చ జరుగుతున్నది. మత్స్యరాస విశ్వేశ్వరరాజును తమ అభ్యర్థిగా ప్రకటించిన వైసీపీ... ఉమ్మడి అభ్యర్థిని బట్టి తమ ఎన్నికల వ్యూహాలకు పదును పెట్టాలని భావిస్తున్నది. దీంతో ఎవరైతే తమకు గట్టి పోటీ ఇస్తారు?, ఎవరైతే తమ గెలుపు సులభంగా ఉంటుందనే అంశాలపై బేరీజు వేసుకుంటూ ఉమ్మడి అభ్యర్థి ప్రకటన కోసం వైసీపీ నేతలు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. దీంతో ఎన్నికల్లో తమ భవితవ్యం ఉమ్మడి అభ్యర్థి ప్రకటనతోనే ముడిపడి ఉందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. దీనిపై అటు వైసీపీ, ఇటు టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులు సైతం ఉమ్మడి అభ్యర్థి అంశంపైనే మెయిన్‌గా పోకస్ పెట్టాయి.
Updated Date - Mar 20 , 2024 | 12:51 AM