ఇసుక అక్రమ వ్యాపారులపై కఠిన చర్యలు
ABN, Publish Date - Oct 27 , 2024 | 12:39 AM
వ్యక్తిగత అవసరాల పేరుతో ఇసుక అక్రమ వ్యాపారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ విజయకృష్ణన్ హెచ్చరించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం ఆమె జిల్లా స్థాయి ఇసుక కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు.
కలెక్టర్ విజయకృష్ణన్
అనకాపల్లి, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): వ్యక్తిగత అవసరాల పేరుతో ఇసుక అక్రమ వ్యాపారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ విజయకృష్ణన్ హెచ్చరించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం ఆమె జిల్లా స్థాయి ఇసుక కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండలాధికారులతో కలెక్టర్ మాట్లాడారు. వ్యక్తిగత అవసరాల పేరుతో ఇసుక తవ్వకాలు చేపట్టే ప్రాంతాల్లో వాల్టా చట్టాన్ని అమలు చేయాలని, చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు తక్కువ ధరకు ఇసుక ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇసుకపై సీనరేజ్, జీఎస్‌టీ రద్దు చేసిందన్నారు. స్థానిక అవసరాలకు ఉచితంగా ఇసుక తీసుకు వెళ్లేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. స్థానిక అవసరాలకు నదుల్లో ఇసుక సేకరించేవారు స్థానిక అధికారులకు సమాచారం అందించిన తరువాత మాత్రమే తవ్వకాలు జరపాల్సి ఉంటుందని సూచించారు. జేసీ జాహ్నవి మాట్లాడుతూ ఇసుక తీసుకెళ్లే వాహనాలపై ఉచిత ఇసుక పథకం బ్యానర్ ఉండాలన్నారు. బల్క్ బుకింగ్ ద్వారా ఇసుక కావాల్సిన వారు దరఖాస్తు చేసుకుంటే అనుమతులు మంజూరు చేస్తామన్నారు. ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు. కేసులు పెట్టడమే కాకుండా పీడీ యాక్టును ప్రయోగిస్తామన్నారు. ఇసుక రవాణాకు ఈ-ట్రాన్సిట్ ఫారం తప్పనిసరిగా ఉండాలన్నారు. ఇసుక రవాణా చేసే ప్రతి వాహనానికి జీపీఎస్, ఉచిత ఇసుక బ్యానర్ ఉండాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్‌వో దయానిధి, గనుల శాఖాధికారి ఎం.శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Oct 27 , 2024 | 12:39 AM