నక్కపల్లిలో స్టీల్ ఫ్యాక్టరీ
ABN, Publish Date - Nov 03 , 2024 | 01:23 AM
నక్కపల్లి ఎస్‌ఈజెడ్‌లో రూ.70 వేల కోట్ల పెట్టుబడులు పెట్టి స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు మిట్టల్ సంస్థ ముందుకొచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. పరిశ్రమ ఏర్పాటు జరిగితే నక్కపల్లి పారిశ్రామిక ప్రాంతంగానే కాకుండా ఒక నగరంగా అభివృద్ధి చెందుతుందన్నారు. పరవాడ సినిమా హాల్ జంక్షన్‌లో శనివారం జరిగిన మిషన్ ఫర్ పాట్ హోల్‌ఫ్రీ రోడ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
- రూ.70 వేలకోట్లతో ఏర్పాటుకు సంసిద్ధం
- కరువు రహిత జిల్లాగా అనకాపల్లి
- రెండేళ్లలో అనకాపల్లి, విశాఖ జిల్లాలకు గోదావరి జలాలు
- విశాఖ స్టీల్‌ప్లాంట్ లాభాల బాట పట్టేలా చర్యలు
- ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
అనకాపల్లి/ పరవాడ, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): నక్కపల్లి ఎస్‌ఈజెడ్‌లో రూ.70 వేల కోట్ల పెట్టుబడులు పెట్టి స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు మిట్టల్ సంస్థ ముందుకొచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. పరిశ్రమ ఏర్పాటు జరిగితే నక్కపల్లి పారిశ్రామిక ప్రాంతంగానే కాకుండా ఒక నగరంగా అభివృద్ధి చెందుతుందన్నారు. పరవాడ సినిమా హాల్ జంక్షన్‌లో శనివారం జరిగిన మిషన్ ఫర్ పాట్ హోల్‌ఫ్రీ రోడ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పరవాడ సినిమా హాల్ జంక్షన్ నుంచి అచ్యుతాపురం వెళ్లే రోడ్డుపై పడిన గోతులు పూడ్చే పనులకు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన స్వయంగా రోడ్డు రోలర్ నడిపి గుంతలు పూడ్చే పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనకాపల్లి జిల్లా సర్వతోముఖాభివృద్ధికి, అన్ని రంగాల్లో ప్రగతి పథంలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి ద్వారా కరువు రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ఎన్‌డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రానున్న రెండేళ్లలో పోలవరం పూర్తిచేసి ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను అనకాపల్లి, విశాఖ జిల్లాలకు అందిస్తామని సీఎం ప్రకటించారు. ఇప్పటికే పోలవరం ఎడమ కాలువ పనులు జరుగుతున్నాయన్నారు. అనకాపల్లి ప్రజలు నీతికి, నిజాయితీకి మారుపేరని నిరూపించారని, మూడు రాజధానులు అనే పేరుతో గత ప్రభుత్వం మోసం చేయాలని చూసినా మూడు రాజధానులు మాకొద్దని, అభివృద్ధి ముద్దని తీర్పు ఇచ్చారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల మనోభావాలకు సంబంధించిన ప్రాజెక్టు అని వ్యాఖ్యానించారు. దీన్ని లాభాల బాటలో నడిపించేలా అవసరమైన చర్యలు చేపట్టేందుకు కేంద్రంతో చర్చిస్తామన్నారు.
టీ చేయడం నేర్చుకున్నా..
దీపం-2 పథకంలో మహిళలకు ఉచితంగా వంట గ్యాస్ సిలిండర్లను అందించే కార్యక్రమం ద్వారా తాను కూడా టీ చేయడం నేర్చుకున్నట్టు చంద్రబాబు చెప్పారు. మగవారంతా ఉద్యోగానికి వెళ్లి ఇంటికి వచ్చిన తమ భార్యలకు టీ చేసి ఇవ్వడం ద్వారా వారిని తమతో సమానంగా గౌరవించవచ్చని వ్యాఖ్యానించారు.
తాడి, స్వయంభూవరం గ్రామాలను తరలించాలని వినతి
సమావేశానికి అధ్యక్షత వహించిన పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు మాట్లాడుతూ పరవాడ మండలంలో తీవ్రమైన కాలుష్యంతో దీర్ఘకాలంగా బాధపడుతున్న తాడి, స్వయంభూవరం గ్రామాలను సురక్షత ప్రాంతాలకు తరలించాలని కోరారు. స్థానికులకు ఉపాధి కల్పనకు చర్యలు చేపట్టాలన్నారు.
Updated Date - Nov 03 , 2024 | 01:23 AM