ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ముందస్తు రబీ పంటగా వలిసెలు

ABN, Publish Date - Sep 21 , 2024 | 10:39 PM

జిల్లాలో ముందస్తు రబీ పంటగా వలిసెల సాగుకు రైతులు సన్నద్ధం కావాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

వలిసెల పంట (ఫైల్‌)

నాట్లుకి ఇదే అదను

నూనె గింజలకు మార్కెట్‌లో డిమాండ్‌

తొలిసారిగా నూతన వంగడాలు సాగు

చింతపల్లి, సెప్టెంబరు 21: జిల్లాలో ముందస్తు రబీ పంటగా వలిసెల సాగుకు రైతులు సన్నద్ధం కావాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నాట్లుకి ఇదే అదను అని, రైతులు పొలాలను సిద్ధం చేసుకోవాలని సూచిస్తున్నారు. పాడేరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో గతంలో 16వేల హెక్టార్లలో వలిసెలను రైతులు సాగుచేసేవారు. ఆకాశ పంది కలుపు ఉధృతి, నాణ్యమైన విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో సాగు విస్తీర్ణం పడిపోయింది. దీంతో ప్రస్తుతం పాడేరు డివిజన్‌లో ఐదు వేల హెక్టార్లలో మాత్రమే వలిసెలను సాగు చేస్తున్నారు. అధిక నూనె శాతం కలిగిన వలిసెల పంట మన్యం ప్రకృతి అందాలకు మరింత శోభను తీసుకొస్తుంది. వలిసెల నూనెను వంట నూనెగా, రుచికరమైన ఆహార పదార్థాల తయారీ, పరిశ్రమల్లో రంగులు, సబ్బుల తయారీలో ఉపయోగిస్తారు. ఈ కారణంగాన వలిసెలకు మార్కెట్‌లో మంచి ధర లభిస్తోంది.

వాతావరణం, విత్తే సమయం

వలిసెల సాగుకు సంవత్సర సరాసరి వర్షపాతం 100 సెంటీమీటర్లు అవసరం. సాగు చేసేందుకు 18-23 డిగ్రీల సెల్సీయస్‌ ఉష్ణోగ్రత అనుకూలం. గిరిజన ప్రాంత వాతావరణం, నేలలు సాగుకు అత్యంత అనుకూలం. సెప్టెంబరు రెండో పక్షం నుంచి అక్టోబరు మొదటి వారం వరకూ వలిసెల నాట్లు వేసుకోవడానికి అనుకూలం.

అనుకూలమైన రకాలు, దిగుబడి

కేజీఎన్‌-2 రకం విలిసెలు 50 రోజుల్లో పూతకు వస్తోంది. 190 సెంటీమీటర్లు ఎత్తు పెరుగుతోంది. 100 నుంచి 110 రోజులకు పంట కోతకు వస్తోంది. హెక్టారుకు 4 నుంచి 5 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. ఉత్కల్‌ నైజర్‌-150 ఎకరాకు 4 నుంచి 6 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. జేఎన్‌ఎస్‌-28, జేఎన్‌ఎస్‌-30 ఎకరాకు 4 నుంచి 5 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది.

విత్తన మోతాదు

ఎకరాకు 4 కిలోలు విత్తనం అవసరం. సాధారణంగా గిరిజన రైతులు వెదజల్లి చెట్టు కొమ్మను నేలపైలాగి విత్తనాన్ని నేలలో కలయబెడతారు. ఈ పద్ధతి సరైంది కాదు. వరుసల మధ్యలో 30 సెంటీమీటర్లు దూరం పాటిస్తూ విత్తుకుంటే అధిక దిగుబడి వస్తోంది.

అంతరకృషి

వలిసెల సాగులో అంతర కృషి అత్యంత కీలకం. వలిసెలు విత్తన 15 రోజుల తరువాత 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు కలుపు తీసుకోవాలి. ప్రధానంగా ఆకాశ పందిరి అనే సంపూర్ణ కాండ పరాన్నజీవి నాటిన నెల రోజుల్లో ఈ పంటను ఆశించి అధిక నష్టం కలిగిస్తుంది. ఇది నేలలో పడిన విత్తనం ద్వారా మాత్రమే వ్యాప్తి చెందుతుంది. అకాశపందిరి కలుపు మొక్క కాండ పరాన్నజీవిగా వలిసెల పంటకు ఆశించి నష్టపరుస్తుంది. ఈ మొక్కకు ఆకులుగాని, క్లోరోఫిలర్‌ గాని లేకపోవడం వల్ల సొంతంగా ఆహారం సమకూర్చుకోలేదు. వలిసెల మొక్కపై హస్టోరియా అనే భాగాలతో అతుక్కొని అతిఽథి మొక్క(వలిసెలు) నుంచి కార్బోహైడ్రేట్స్‌ను గ్రహిస్తుంది. దీనివల్ల వలిసెల దిగుబడి, నాణ్యత, మొక్కల సాంద్రత తగ్గిపోతుంది. విత్తనాలు నేలలో వుంటూ 20 సంవత్సరాలు మొలకెత్తే సామర్థ్యం కలిగి వుంటాయి.

బంగారు తీగ నివారణ

బంగారు తీగ కలుపు నివారణకు వలిసెల విత్తనాలను జల్లెడతో (0.85-1.00ఎంఎం) జల్లించి ఆకాశపందిరి విత్తనాలను వేరు చేసుకోవాలి. లేకుంటే ఎకరాకు అవసరమైన 4 కిలోల విత్తనం 20 లీటర్ల నీటిలో 3 కిలోల ఉప్పు కలిపి ఆ ద్రావణంలో వేసి బాగా కలియబెట్టాలి. ఈవిధంగా చేయడం వల్ల ఆకాశ పందిరి విత్తనాలు అడుగుకు, వలిసెల విత్తనాలు నీటి పైభాగానికి వస్తాయి. ఈవిధంగా ఆకాశ పంది కలుపు విత్తనాలను తొలగించుకోవాలి.

పోషక యాజమాన్యం

వలిసెలు విత్తే సమయంలో ఎకరానికి 4టన్నుల చొప్పున పశువుల ఎరువు గాని, కంపోస్టు ఎరువు గాని వేసుకోవాలి. దీనివల్ల పంట ఎదుగుదలకు పోషకాలు, నీరు భూమిలో నిలుపుదల చేసుకోవడానికి ఉపయోగకపడుతుంది. వలిసెల పంట ఎకరాకు 8కేజీల నత్రజని, 8కేజీల భాస్వరం, 4కేజీల పొటాష్‌, 4-6కేజీల గంధకాన్ని వచ్చే ఎరువులను వేసుకోవాలి. నత్రజని రెండు దఫాలుగా విత్తేటప్పుడు, మొగ్గదశలో వేసుకోవాలి.

రైతులతో నూతన వంగడాలు సాగు

డాక్టర్‌ వాన ప్రసాదరావు, సేద్యవిభాగం శాస్త్రవేత్త, కేవీకే, హరిపురం

విత్తనోత్పత్తి లక్ష్యంగా ఉత్కల్‌ నైజర్‌-150 నూతన వంగడాలను తొలిసారిగా గిరిజన రైతులతో సాగు చేయిస్తున్నాం. జి.మాడుగుల మండలంలోని వెన్నెలకోట, దేవరాపల్లి, కృష్ణాపురం రైతులకు గిరిజన ఉప ప్రణాళిక, ఎఫ్‌ఎల్‌డీ పథకంలో భాగంగా విత్తనం, ఎరువులు ఉచితంగా అందజేసి 75 మంది రైతులతో 75 ఎకరాల్లో సాగు చేయిస్తున్నాం. నాట్లు వేసిన నాటి నుంచి పంట కోసే వరకు సాంకేతిక సహకారం అందిస్తాం. ఎకరాకు 5 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. వచ్చే ఏడాది ఏజెన్సీ వ్యాప్తంగా రైతులకు ఈ వంగడం చిరు సంచుల్లో అందజేస్తాం. ఈ రైతు క్షేత్రాల్లో ఇతర రైతులకు సాగు విధానంపై శిక్షణ ఇస్తాం.

Updated Date - Sep 21 , 2024 | 10:39 PM