భార్యాభర్తలకు పాముకాటు
ABN, Publish Date - Oct 05 , 2024 | 11:48 PM
నిద్రపోతున్న భార్యాభర్తలు పాము కాటుకు గురైన ఘటనలో భార్య మృతి చెందగా.. భర్త కోలుకుంటున్నాడు.
భార్య మృతి
కోలుకుంటున్న భర్త
పాడేరురూరల్, అక్టోబరు 5: నిద్రపోతున్న భార్యాభర్తలు పాము కాటుకు గురైన ఘటనలో భార్య మృతి చెందగా.. భర్త కోలుకుంటున్నాడు. అల్లూరి జిల్లా పెదబయలు మండలం పర్రెడ పంచాయతీ కుర్తాడ గ్రామానికి చెందిన కుర్తాడి రమేశ్ (26), కుర్తాడి రమణమ్మ(24) శుక్రవారం రాత్రి భోజనం అనంతరం నిద్రపోయారు. నిద్రలో ఏదో కుట్టినట్టు అనిపించి లేచి చూసుకున్నారు. ఏమీ కనిపించకపోవడంతో పక్కలను దులుపుకొని మళ్లీ నిద్రించారు. శనివారం ఉదయం నిద్ర లేచిన భర్త రమేశ్.. భార్య రమణమ్మను నిద్ర నుంచి లేపిన ఆమె లేవకపోవడంతో కుటుంబ సభ్యుల సహాయంతో ముంచంగిపుట్టు ఆస్పత్రికి తరలించారు. రమణమ్మ పాము కాటుకు గురైనట్టు అక్కడ వైద్యులు నిర్ధారించి, మెరుగైన వైద్య సేవల కోసం పాడేరు జీజీహెచ్‌కు రిఫర్ చేశారు. రమణమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో పాడేరు వైద్యులు శనివారం మధ్యాహ్నం విశాఖ కేజీహెచ్‌కు తరలిస్తుండగా.. మార్గ మద్యంలో ఆమె మృతి చెందింది. స్థానిక జీజీహెచ్ ఆస్పత్రిలో భర్త రమేశ్ కోలుకుంటున్నాడు. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.
Updated Date - Oct 05 , 2024 | 11:48 PM