ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

రహదారి విస్తరణ పనులు అస్తవ్యస్తం

ABN, Publish Date - Mar 28 , 2024 | 01:17 AM

మెయిన్‌ రోడ్డు విస్తరణతో ట్రాఫిక్‌ కష్టాలు తీరతాయని భావించిన పట్టణ వాసులకు నిరాశే మిగిలింది. ఈ పనులు నత్తనడకన సాగుతుండడంతో ఇబ్బందులు తప్పడం లేదు. కాంట్రాక్టరుకు వైసీపీ ప్రభుత్వం సకాలంలో బిల్లులు మంజూరు చేయకపోవడమే పనుల జాప్యానికి కారణమని తెలుస్తోంది.

నర్సీపట్నం మెయిన్‌ రోడ్డు

- గత ఏడాది జూలైలో పనులు ప్రారంభం

- తొలుత మెయిన్‌రోడ్డు వంద అడుగులకు విస్తరణ చేయాలని నిర్ణయం

- పలువురు అభ్యంతరం తెలపడంతో 90 అడుగులకు కుదింపు

- హైకోర్టును ఆశ్రయించిన సుమారు 90 మంది భవన యజమానులు

- కాంట్రాక్టరుకు బిల్లులు మంజూరుకాకపోవడంతో పనుల్లో జాప్యం

- పట్టణ వాసులకు తప్పని ట్రాఫిక్‌ కష్టాలు

నర్సీపట్నం, మార్చి 27: మెయిన్‌ రోడ్డు విస్తరణతో ట్రాఫిక్‌ కష్టాలు తీరతాయని భావించిన పట్టణ వాసులకు నిరాశే మిగిలింది. ఈ పనులు నత్తనడకన సాగుతుండడంతో ఇబ్బందులు తప్పడం లేదు. కాంట్రాక్టరుకు వైసీపీ ప్రభుత్వం సకాలంలో బిల్లులు మంజూరు చేయకపోవడమే పనుల జాప్యానికి కారణమని తెలుస్తోంది.

మెయిన్‌ రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనులకు 2022 డిసెంబరు 30వ తేదీన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. అబీద్‌ సెంటర్‌ నుంచి పెదబొడ్డేపల్లి మదుం వరకు 1.5 కిలోమీటర్ల మేర 100 అడుగుల మెయిన్‌ రోడ్డు విస్తరణ, అభివృద్ధి, సెంటర్‌ డివైడర్‌, డ్రైనేజీ పనులకు రూ.10.6 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. గత ఏడాది జూలై 21న ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేశ్‌ భూమి పూజ చేసి రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించారు.

ఆది నుంచి ఆటంకాలే..

అబీద్‌ సెంటర్‌ నుంచి పెదబొడ్డేపల్లి మదుం వరకు మెయిన్‌ రోడ్డుకి ఇరువైపులా ప్రైవేటు ఆస్తులు 221, ప్రభుత్వ ఆస్తులు 12 ఉన్నాయి. తొలుత 100 అడుగుల రోడ్డు విస్తరణ, పరిహారంగా టీడీఆర్‌ బాండ్లు ఇవ్వడానికి భవన యజమానులను ఒప్పించే ప్రయత్నం చేశారు. ఈ ప్రతిపాదనకు భవన యజమానులు ససేమిరా అన్నారు. రోడ్డు విస్తరణ 80 అడుగులు చేసి టీడీఆర్‌ కి బదులు భూ సేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారంగా నగదు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీంతో ఎమ్మెల్యే పది అడుగులు తగ్గించి 90 అడుగులు రోడ్డు విస్తరణ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రతిపాదనను 100 మందికి పైగా భవన యజమానులు అంగీకరించారు. మిగిలిన భవన యజమానులు కోర్టును ఆశ్రయించాలని నిర్ణయం తీసుకున్నారు. మునిసిపల్‌ కమిషనర్‌ ఇచ్చిన కూల్చివేత నోటీసులపై సుమారు 90 మంది హైకోర్టును ఆశ్రయించారు. కూల్చివేత నోటీసులపై హైకోర్టు స్టే విధించింది. మిగిలిన రోడ్డు విస్తరణ పనులు చట్ట పరిధిలో చేసుకోవచ్చునని సూచించింది. దీంతో ముందుగా ప్రభుత్వ ఆస్తులు, ఆక్రమణలు కూల్చాలని మునిసిపల్‌, రెవెన్యూ అధికారులు నిర్ణయించారు. గత సంవత్సరం జూలై 21వ తేదీన ఎమ్మెల్యే భూమి పూజ చేసి రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించగా, అబీద్‌ సెంటర్‌ నుంచి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వరకు ఉన్న ప్రభుత్వ ఆస్తులను ఎక్స్‌కవేటర్ల సహాయంతో కూల్చివేశారు. కాగా ప్రభుత్వ ఆస్తులు అధికంగా ఉన్న అబీద్‌ సెంటర్‌ నుంచి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం 100 అడుగులు రోడ్డు విస్తరణ చేయాలని ఎమ్మెల్యే భావించారు. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరులో జాప్యం కారణంగా నిర్మాణ పనులు అస్తవ్యస్తంగా సాగుతున్నాయి.

కాంట్రాక్టర్‌కు రూ.3 కోట్లు బకాయిలు!

అబీద్‌ సెంటర్‌ నుంచి పెదబొడ్డేపల్లి మదుం వరకు 1800 మీటర్ల రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనులు చేపట్టవలసి ఉండగా, 8 నెలల వ్యవధిలో కేవలం 265 మీటర్ల రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. అబీద్‌ సెంటర్‌ నుంచి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వరకు 265 మీటర్లు వరకు బీటీ రోడ్డు వేయడానికి ఏర్పాట్లు చేశారు. అయితే కాంట్రాక్టరుకు రూ.3 కోట్లు బకాయిలు విడుదల కాకపోవడంతో తారు వేయలేదని సమాచారం. డివైడర్ల నిర్మాణం పూర్తి చేసి సెంటర్‌ లైటింగ్‌ కోసం స్తంభాలు ఏర్పాటు చేశారు. డివైడర్‌ మధ్యలో మొక్కలు వేయడానికి మట్టి వేశారు. డ్రైనేజీ ల నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. స్వామి అయ్యప్ప గుడి కమిటీ, సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదురుగా ప్రైవేటు భవన యజమానులు కోర్టుకు వెళ్లి స్టే తీసుకురావడంతో ఆయా చోట్ల డ్రైనేజీ పనులు నిలిచిపోయాయి. మిగిలిన 500 మీటర్లు డ్రైనేజీ పనులు పూర్తి చేసి కవర్‌ శ్లాబ్‌లు కూడా పూర్తి చేశారు. అదే విధంగా పెదబొడ్డేపల్లి మదుం దగ్గర నుంచి 200 మీటర్లు వరకు డ్రైనేజీ పనులు పూర్తి చేశారు. కోర్టును ఆశ్రయించిన భవన యజమానుల ఆస్తులు ఉన్న చోట డ్రైనేజీ పనులు ఆపేసి, రోడ్డు విస్తరణకు అంగీకరించిన భవన యజమానుల ఆస్తులు ముందు డ్రైనేజీ పనులు చేపడుతున్నారు. దీంతో డ్రైనేజీ పనులు అస్తవ్యస్తంగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు కాంట్రాక్టరు చేపట్టిన పనులకు ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయలేదు. కాంట్రాక్టరుకు బిల్లులు విడుదల చేస్తే గాని బీటీ రోడ్డు పూర్తి చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికైనా ఎమ్మెల్యే, ఉన్నతాధికారులు స్పందించి రోడ్డు విస్తరణ పనులు పూర్తికావడానికి చర్యలు తీసుకోవాలని పట్టణ వాసులు కోరుతున్నారు.

Updated Date - Mar 28 , 2024 | 01:17 AM

Advertising
Advertising