వరి రైతు పాట్లు
ABN, Publish Date - Jan 29 , 2024 | 12:44 AM
ధాన్యం సేకరణ, రైస్ మిల్లులకు తరలింపు, రవాణా చార్జీల చెల్లింపు వంటి విషయాల్లో పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్న మాటలు, క్షేత్రస్థాయిలో అమలు కావడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు. తమ గ్రామాలకు దగ్గరలో వున్న రైస్ మిల్లుకు కాకుండా సుదూరంలో వున్న ఇతర మండలాల్లోని రైస్ మిల్లులకు ధాన్యం తరలించాలి రావడం చాలా ఇబ్బందిగా వుందని, పైగా ధాన్యం తీసుకెళ్లడానికి అధికారులు వాహనాలు ఏర్పాటు చేయకపోవడంతో అధిక రవాణా చార్జీలు చెల్లించి తామే వాహనాలను సమకూర్చు కోవాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక అధికారులు చెప్పిన ప్రకారం ధాన్యం అమ్మిన 15 రోజుల్లో బ్యాంకు ఖాతాల్లో జమ కావడంలేదని చెబుతున్నారు.
ధాన్యం అమ్ముకోవడానికి నానాఇక్కట్లు
సుదూరంలో వున్న వేరే మండలాల రైస్ మిల్లులను కేటాయిస్తున్న అధికారులు
వాహనం సమకూర్చుకుని, మిల్లుకు తరలించే బాధ్యత కూడా రైతుదే!
వాస్తవ రవాణా చార్జీలతో పోలిస్తే ప్రభుత్వం ఇచ్చేది చాలా తక్కువ
చేతి చమురు వదులుతున్నదని అన్నదాతలు ఆవేదన
నాతవరం, జనవరి 28: ధాన్యం సేకరణ, రైస్ మిల్లులకు తరలింపు, రవాణా చార్జీల చెల్లింపు వంటి విషయాల్లో పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్న మాటలు, క్షేత్రస్థాయిలో అమలు కావడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు. తమ గ్రామాలకు దగ్గరలో వున్న రైస్ మిల్లుకు కాకుండా సుదూరంలో వున్న ఇతర మండలాల్లోని రైస్ మిల్లులకు ధాన్యం తరలించాలి రావడం చాలా ఇబ్బందిగా వుందని, పైగా ధాన్యం తీసుకెళ్లడానికి అధికారులు వాహనాలు ఏర్పాటు చేయకపోవడంతో అధిక రవాణా చార్జీలు చెల్లించి తామే వాహనాలను సమకూర్చు కోవాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక అధికారులు చెప్పిన ప్రకారం ధాన్యం అమ్మిన 15 రోజుల్లో బ్యాంకు ఖాతాల్లో జమ కావడంలేదని చెబుతున్నారు.
ప్రభుత్వానికి ధాన్యం అమ్ముకోవాలంటే అధికారులు చుక్కలు చూపిస్తున్నారని మండలంలోని పలు గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యాన్ని తూకం వేసే దగ్గర నుంచి రైస్ మిల్లుకు తరలించే వరకు బాధ్యత మొత్తం తమపైనే మోపుతుతన్నారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన నిబంధనల ప్రకారం ఈ-క్రాప్‌లో పేర్లు నమోదు చేసుకున్న రైతుల నుంచి మాత్రమే ధాన్యం కొనుగోలు చేస్తారు. ధాన్యాన్ని ప్రభుత్వానికి విక్రయించాలనుకునే రైతులు వరి కుప్పలను నూర్చే రోజున లేదా మరుసటి రోజున రైతు భరోసా కేంద్రంలో వుండే వ్యవసాయ సహాయకులకు (ఏఏవో) సమాచారం ఇవ్వాలి. ఏఏవో, పౌరసరఫరాల సిబ్బంది కలిసి రైతు కల్లం వద్దకు వెళ్లి ధాన్యంలో తేమ శాతాన్ని పరీక్షిస్తారు. నిబంధనలకు అనుగుణంగా తేమ శాతం వుంటే ధాన్యం సేకరిస్తున్నట్టు రైతుకు చెబుతారు. గోనె సంచుల్లో ధాన్యం నింపిస్తారు. ఏ రైస్ మిల్లుకు ధాన్యం తరలించాలో ఆన్‌లైన్‌లో చూసి చెబుతున్నారు. అనంతరం జీపీఎస్‌లో వివరాలు నమోదైన వాహనాన్ని వే బ్రిడ్జికు పంపి కాటా పెట్టిస్తారు. అనంతరం కల్లం వద్దకు రప్పించి ధాన్యం ఎక్కించి మళ్లీ తుకం వేస్తారు. తరువాత రైతు వివరాలతోపాటు ఎంత ధాన్యం విక్రయించిందీ ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. అనంతరం ధాన్యాన్ని ఫ్యాక్టరీకి తరలిస్తారు. రవాణా చార్జీలను ప్రభుత్వమే భరిస్తుంది.
కానీ మండలంలో ధాన్యం సేకరణ వరకు బాగానే వున్నప్పటికీ రవాణా విషయంలో మాత్రం అధికారులు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. వేరే మండలాల్లో వున్న రైస్ మిల్లుకు ధాన్యాన్ని తరలించడానికి అవసరమైన వాహనాలను రైతులే సమకూర్చుకోవాలని, ప్రభుత్వ నిబంధనల మేరకు రవాణా చార్జీలు బ్యాంకు ఖాతాలకు జమ అవుతాయని చెబుతున్నారు. కానీ వాస్తవ రవాణా చార్జీలకు, ప్రభుత్వం చెల్లించే రవాణా చార్జీలకు పొంతన వుండడంలేదని రైతులు వాపోతున్నారు. ఉదాహరణకు నాతవరం మండలం నుంచి పాయకరావుపేటలోని రైస్ మిల్లుకు ట్రాక్టర్‌లో (సుమారు ఆరు టన్నులు) ధాన్యం తరలించడానికి ట్రాక్టర్ యజమానులు రూ.4 వేలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం రూ.1,600 చెల్లిస్తున్నది. వాహనాలను అధికారులు సమకూర్చకపోవడంతో తామే ట్రాక్టర్లను మాట్లాడుకుని పాయకరావుపేట రైస్ మిల్లుకు ధాన్యం తరలిస్తున్నామని, దీనివల్ల తమకు చేతిచమురు వదులుతున్నదని రైతులు వాపోతున్నారు. నాతవరం మండలంలో నాలుగు రైస్ మిల్లులు వుండగా, అధికారులు 40 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాయకరావుపేట రైస్ మిల్లులకు ధాన్యం ఎందుకు పంపుతున్నారో అర్థం కావడంలేదని అంటున్నారు. అంతేకాకుండా ధాన్యం విక్రయించిన రెండు వారాల్లో డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ అవుతాయన్న అధికారులు మాటాలు కూడా అమలు కావడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యల వల్ల మద్దతు ధరకన్నా తక్కువకు ప్రైవేటు వ్యాపారులకు ధాన్యం అమ్ముకుంటున్నామని పలువురు రైతులు చెబుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి నాతవరం మండలంలో ఉన్న రైస్ మిల్లులకే ధాన్యం సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాల కోరుతున్నారు.
Updated Date - Jan 29 , 2024 | 12:44 AM