15న పీఎం జన్‌మన్ పథకం ప్రారంభం
ABN, Publish Date - Jan 11 , 2024 | 10:59 PM
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పీఎం జన్‌మన్) పథకాన్ని ఈ నెల 15వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారని ఐటీడీఏ పీవో వి.అభిషేక్ తెలిపారు.
వర్చువల్‌గా ప్రారంభించనున్న నరేంద్ర మోదీ
ఆ రోజు పలువురు పీవీటీజీలతో సంభాషించనున్న ప్రధాని
కొత్తబల్లుగుడ పాఠశాల ఆవరణలో ఏర్పాట్లపై పీవో సమీక్ష
అరకులోయ, జనవరి 11 : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పీఎం జన్‌మన్) పథకాన్ని ఈ నెల 15వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారని ఐటీడీఏ పీవో వి.అభిషేక్ తెలిపారు. ఇందులో భాగంగా ఆయన ఆదిమ జాతి గిరిజనులు (పీవీటీజీ)లతో వర్చువల్‌గా సంభాషిస్తారన్నారు. కొత్తభల్లుగుడ ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో గురువారం అధికారులతో ఈ పథకం నిర్వహణపై ఏర్పాటైన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారులకు కేటాయించిన పనులను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. పీవీటీజీ గిరిజనులందరికీ ఆయుష్మాన్ భారత్ కార్డులు, ఆధార్‌కార్డులు, ప్రధానమంత్రి జన్‌మన్ గృహాల మంజూరు, అక్కడ కల్పించే సౌకర్యాలు తదితరాలపై అధికారులు నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ఈ నెల 15వ తేదీ నాటికి కొత్తభల్లుగుడ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఏర్పాటు కానున్న సభాస్థలిలో ప్రత్యేకంగా ఆధార్, ప్రధానమంత్రి ఉజ్వలయోజన గృహ నిర్మాణ, జన్‌ధన్ బ్యాంకు ఖాతాలకు సంబంధించిన స్టాల్స్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. ఏర్పాట్లలో అలక్ష్యం చూపితే సహించేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఐటీడీఏ ఏపీవోలు వి.ఎస్.ప్రభా కర్‌రావు, ఎం.వెంటేశ్వరరావు, టీడబ్ల్యూ డీడీ కొండలరావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jan 11 , 2024 | 10:59 PM