పర్యాటకంపై నిర్లక్ష్యం
ABN, Publish Date - Sep 27 , 2024 | 01:24 AM
క్రూయిజ్ పర్యాటకం పెంచడానికి, విదేశీ పర్యాటకులను విశాఖపట్నం రప్పించడానికి కేంద్ర పర్యాటక శాఖ, విశాఖపట్నం పోర్టుతో కలిసి రూ.100 కోట్ల వ్యయంతో పోర్టులో క్రూయిజ్ టెర్మినల్ నిర్మించాయి.
ఉమ్మడి జిల్లాలో ఎన్నో ప్రముఖ పర్యాటక ప్రాంతాలు
ప్రచారం పూజ్యం...వసతులు శూన్యం...
నిరుపయోగంగా క్రూయిజ్ టెర్మినల్
ఏడాది కిందట ప్రారంభం...ఇప్పటివరకూ కనీసం ఒక్క క్రూయిజ్‌ను తీసుకురాలేకపోయిన అధికారులు
రెండు శాఖల మధ్య సమన్వయలోపంతో తొట్లకొండపై పర్యాటకులకు అసౌకర్యం
సీజన్ ప్రారంభమవుతున్నా
అందుబాటులోకి రాని యాత్రీ నివాస్
రూ.కోట్ల వ్యయం...అక్కరకు రాని వైనం
నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
ఉమ్మడి విశాఖ జిల్లా పర్యాటక రంగానికి పట్టుగొమ్మ. అందమైన సాగర తీరం, ఆకట్టుకునే అరకు సోయగాలు, విదేశీయులను ఆకర్షించే బౌద్ధ క్షేత్రాలు, అరుదైన ఎర్రమట్టి దిబ్బలు, కేరళను తలపించే కొండకర్ల ఆవ...ఇలా ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. కానీ వసతులు శూన్యం. ప్రచారం పూజ్యం. పర్యాటక రంగం పచ్చగా ఉంటే వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అయితే కొత్త కొత్త ప్రాజెక్టులు ప్రకటించడమే తప్ప అధికారులు వాటిని త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురాలేకపోతున్నారు. పర్యాటక శాఖకు పూర్తిస్థాయి అధికారులు లేరు. ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్‌పై వచ్చినవారు కాలక్షేపం చేసి వెళ్లిపోతున్నారు. అక్కడ కూడా విభేదాలు, విద్వేషాలు. ఇదీ పరిస్థితి. కాంట్రాక్టు పద్ధతిన చిరుద్యోగంలో చేరిన వారికి ఏకంగా జిల్లా అధికారి బాధ్యతలు ఇచ్చేసి వదిలేశారు. ఉన్నత స్థాయి అధికారులు విశాఖ జిల్లాను పట్టించుకోవడం లేదనే చెప్పుకోవాలి.
రూ.100 కోట్ల క్రూయిజ్ టెర్మినల్ వృథా
క్రూయిజ్ పర్యాటకం పెంచడానికి, విదేశీ పర్యాటకులను విశాఖపట్నం రప్పించడానికి కేంద్ర పర్యాటక శాఖ, విశాఖపట్నం పోర్టుతో కలిసి రూ.100 కోట్ల వ్యయంతో పోర్టులో క్రూయిజ్ టెర్మినల్ నిర్మించాయి. దీనిని గత ఏడాది సెప్టెంబరు ఐదో తేదీన కేంద్ర నౌకాయాన శాఖా మంత్రి సోనోవాల్ సర్బానంద్ ప్రారంభించారు. ఏడాది పూర్తయింది. ఒక్కటంటే...ఒక్క క్రూయిజ్‌ను తీసుకురాలేకపోయారు. కేంద్ర పర్యాటక శాఖ నిధులు ఇవ్వడానికి ముందుకురావడం, కొంత వ్యయం పోర్టు భరించడానికి సంసిద్ధత వ్యక్తం చేయడంతో టెర్మినల్ నిర్మించేశారు. అయితే దానిని ఎలా ఆపరేట్ చేయాలి?, క్రూయిజ్‌లను ఎలా రప్పించాలి?...అనే దానిపై ఇటు పోర్టు యాజమాన్యం దృష్టిపెట్టలేదు. జిల్లా యంత్రాంగం పట్టించుకోలేదు. ప్రజా ప్రతినిధులకు ఇలాంటివి పట్టనే పట్టవు. దాంతో రూ.100 కోట్లతో నిర్మించిన భవనం నిరుపయోగంగా ఉంది. ఇటీవలె క్రూయిజ్‌లను ఎలా రప్పించాలనే దానిపై టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఆ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో తెలియదు.
పోర్టు నెత్తిన మౌలిక వసతుల బాధ్యత
జిల్లాలో పర్యాటక కేంద్రాలు అనేకం ఉన్నాయి. కానీ అక్కడ పర్యాటకులకు మౌలిక వసతులు లేవు. ఇన్నాళ్లూ వాటి గురించి అధికారులు పట్టించుకోలేదు. విశాఖపట్నం పోర్టుకు క్రూయిజ్‌లో వచ్చే విదేశీ పర్యాటకులు ఆయా కేంద్రాలను సందర్శిస్తే...మౌలిక వసతులు తప్పనిసరి కాబట్టి అవన్నీ పోర్టు యాజమాన్యమే సమకూర్చాలని జిల్లా అధికారులు ఇటీవల తేల్చి చెప్పారు. క్రూయిజ్‌లు విశాఖ వచ్చేలోపు ఆ పనులన్నీ చేసే బాధ్యత అప్పగించారు.
తొట్లకొండపై తాళం
తొట్లకొండను పురావస్తు శాఖ నిధులతో అభివృద్ధి చేశారు. నిర్వహణను వీఎంఆర్‌డీఏకు అప్పగించారు. అది బౌద్ధ కేంద్రం. దానికి విశిష్టతలు ఉన్నాయి. పర్యాటకులు అక్కడికి వచ్చినప్పుడు ఆ వివరాలన్నీ చెప్పాలనే ఉద్దేశంతో అక్కడ ఇంటర్ ప్రిటేషన్ రూమ్ ఒకటి నిర్మించారు. రెండు సంస్థల మధ్య సరైన అవగాహన లేకపోవడంతో దానికి తాళం వదిలేసి వదిలేశారు. అక్కడికి ఎవరైనా వెళితే బౌద్ధ ఆరామం చూసి రావాలే తప్ప దాని ప్రత్యేకత ఏమిటో తెలుసుకునే అవకాశం లేదు. అధికారుల తీరు ఎలా ఉంటుందనే దానికి ఇదో చిన్న ఉదాహరణ మాత్రమే.
ఇంకెప్పుడు అందుబాటులోకి తెస్తారో..?
పర్యాటక శాఖపై అధికారులకు సరైన అవగాహన లేకపోవడంతో వారికి నచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. అక్టోబరు నుంచి పర్యాటక సీజన్ ప్రారంభమవుతుంది. పశ్చిమ బెంగాల్, ఒడిశాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తారు. వారు తొలుత పర్యాటక శాఖ వసతినే కోరుకుంటారు. గతంలో రుషికొండలో హరిత రిసార్ట్స్ ఉండేవి. వాటిని జగన్ ప్రభుత్వం కూలగొట్టడంతో కేవలం అప్పుఘర్ వద్ద ఉన్న యాత్రీ నివాస్‌లోనే బస చేయాల్సి వస్తోంది. ఇప్పుడు దానిని కూడా ఆధునికీకరణ పేరుతో మూసేశారు. అంచనా వ్యయం రూ.13 కోట్లకు తీసుకువెళ్లారు. ఇంత చేసినా ఇంజనీరింగ్ అధికారులు ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగానైనా దానిని అందుబాటులోకి తెచ్చారా? అంటే ఇంకా లేదు. సీజన్ ముంచుకువస్తున్నా ఆ పనులు పూర్తిచేయడం లేదు. పర్యాటకులు ఆన్‌లైన్‌లో రూమ్ బుక్ చేసుకోవడానికి యత్నిస్తే ‘నాట్ ఎవైలబుల్’ అని చూపిస్తోంది. ఇది ప్రారంభమైతే 44 రూమ్‌లు అందుబాటులోకి వస్తాయి. విశాఖ వచ్చే పర్యాటకులకు కనీసం ఒక గదిని కూడా ఇవ్వలేని దుస్థితిలో ఆ శాఖ ఉందంటే వారి పనితీరు ఏ విధంగా ఉన్నదీ అర్థం చేసుకోవచ్చు.
అంతా ఆంగ్లమే
పర్యాటక దినోత్సవం సందర్బంగా జిల్లా అధికారులు గత మూడు రోజులుగా రకరకాల పోటీలు, ప్రచారాలు నిర్వహిస్తున్నారు. అదంతా ఇంగ్లీష్‌లోనే జరుగుతోంది. తెలుగు మచ్చుకైనా లేదు. ముందస్తుగా గురువారం ‘హెరిటేజ్ వాక్’ నిర్వహించారు. ఆ ప్రచార స్లోగన్లు కూడా ఇంగ్లీష్‌లోనే ఉన్నాయి. ఇవన్నీ ఎవరిని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారో తెలియడం లేదు. అధికారుల తీరు మారితే తప్ప విశాఖలో పర్యాటక రంగం ముందుకువెళ్లే అవకాశం కనిపించడం లేదు.
Updated Date - Sep 27 , 2024 | 01:24 AM