సినీ ‘మాయ’!
ABN, Publish Date - Apr 01 , 2024 | 01:37 AM
‘తన బ్యాంకు ఖాతా నుంచి రూ.19 వేలు డెబిట్ అయినట్టు మద్దిలపాలేనికి చెందిన యువకుడి సెల్‌ఫోన్‌కు మెసేజ్ వచ్చింది.
కొత్త సినిమా డౌన్‌లోడ్ లింకులతో సైబర్ మోసాలు
ఉచిత డౌన్‌లోడ్‌కు అందుబాటులో పలు వెబ్‌సైట్లు
వాటి వెనుక రహస్యంగా దాగిన మాల్‌వేర్
డౌన్‌లోడ్ చేస్తే సైబర్‌నేరగాళ్ల నియంత్రణలోకి సెల్‌ఫోన్లు
ఇన్‌బిల్డ్ స్పై కెమెరాలతో లావాదేవీల సేకరణ
వాటి ఆధారంగా బ్యాంకు ఖాతాల్లోని నగదు అపహరణ
అలాంటి వెబ్‌సైట్ల జోలికి వెళ్లొదంటున్న పోలీసులు
(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)
‘తన బ్యాంకు ఖాతా నుంచి రూ.19 వేలు డెబిట్ అయినట్టు మద్దిలపాలేనికి చెందిన యువకుడి సెల్‌ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. రెండు రోజులుగా తాను ఎలాంటి బ్యాంకు లావాదేవీలు చేయకపోయినా అకౌంట్ నుంచి డబ్బు ఎందుకు డెబిట్ అయిందని ఆలోచించాడు. వెంటనే బ్యాంక్‌కు వెళ్లి ఆరా తీస్తే వేరొకరి అకౌంట్‌కి ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ అయినట్టు చెప్పడంతో సైబర్‌నేరగాళ్ల పనేనని నిర్ధారించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.’
‘మర్రిపాలేనికి చెందిన ఓ కాంట్రాక్టర్‌కు వారం రోజుల కిందట అతని అకౌంట్ నుంచి రూ.25వేలు ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ అయినట్టు మెసేజ్ రావడంతో సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.’
సగటు మానవుడి బలహీనతను సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఇప్పటివరకు వివిధ పథకాలు, పెట్టుబడి లేకుండా ఆదాయం తదితర అంశాలతో ఎరవేసి బ్యాంకు ఖాతాలను లూటీ చేస్తుండగా... తాజాగా కొత్త సినిమాలను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చంటూ వివిధ రకాల వెబ్‌సైట్లను పంపించి, క్లిక్ చేయగానే ఫోన్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకుని ఖాతాలను ఖాళీ చేసేస్తున్నారు. టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో దాదాపుగా అందరూ ఇంటర్‌నెట్‌ను విరివిగా వినియోగిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌తోనే బ్యాంకు లావాదేవీలు, సినిమాలు, యూట్యూబ్, వివిధ యాప్‌లలో రీల్స్ వీక్షణ ఇలా అన్నీ జరిగిపోతున్నాయి. దీనికి తోడు కొత్తసినిమాలు విడుదలైతే అదే రోజు ఆన్‌లైన్‌లో దానిని చూసేందుకు ఆత్రుత సైబర్ నేరగాళ్లకు అక్కరకొస్తోంది.
ఉచితం పేరుతో దోపిడీ...
కొన్ని వెబ్‌సైట్ల నుంచి ఉచితంగా సినిమాను వీక్షించడంతో పాటు డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తుండడంతో చాలామంది ఆకర్షితులవుతున్నారు. పలు కారణాలతో థియేటర్‌కు వెళ్లి సినిమా చూడలేకపోయిన వారిలో ఎక్కువమంది ఇంట్లో కూర్చొని వెబ్‌సైట్‌ల నుంచి డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. ఈ బలహీనతను సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. సొంతంగా కొన్ని వెబ్‌సైట్లను రూపొందించి వాటిలో కొత్తసినిమాల పేరుతో వీడియోలను అందుబాటులో ఉంచుతున్నారు. ఎవరైనా కొత్తసినిమా కోసం ఆయా వెబ్‌సైట్‌లోకి వెళితే వారికి తెలియకుండానే సైబర్‌నేరగాళ్లు లింక్‌చేసిన మాల్‌వేర్ సెల్‌ఫోన్‌లో చొరబడుతోంది. ఆ తర్వాత ఫోన్ సైబర్‌నేరగాళ్ల నియంత్రణలోకి వెళ్లిపోతుంది. ఫోన్‌తో జరిగే లావాదేవీలలతో మోసాలకు పాల్పడుతున్నారు. ఎవరైనా తమ ఫోన్ నుంచి ఆన్‌లైన్‌లో బ్యాంక్ లావాదేవీలు జరిపినా, యూపీఐ లావాదేవీలకు సంబంధించిన పిన్ ఎంటర్ చేసినా సైబర్‌నేరగాళ్లు వాటిని ప్రత్యక్షంగా చూసి, ఆ వివరాలతో ఖాతాల్లోని నగదుని కొల్లగొట్టేస్తున్నారు. బ్యాంకు నుంచి బాధితులకు ఓటీపీ కూడా రాకుండా నోటిఫికేషన్‌ను మ్యూట్‌లో పెట్టేస్తున్నారు. నగరంలో ఇటీవల ఈతరహా మోసాలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
ఆ వెబ్‌సైట్ల జోలికి వెళ్లొద్దు
ఇంటర్నెట్‌లో ఉచితంగా సినిమాలు డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం ఉన్న వెబ్‌సైట్ల జోలికి వెళ్లపోవడమే మంచిది. ఉచితంగా ఎవరైనా ఎందుకు ఇస్తారు? ఏదో ప్రయోజనం ఉంటేనే ఆ సదుపాయం కల్పిస్తారనే విషయాన్ని గుర్తించాలి. అన్ని వెబ్‌సైట్లు సైబర్‌నేరగాళ్ల నియంత్రణలో ఉండకపోయినా, చాలా వెబ్‌సైట్లు వారే రూపొందించి వారి నియంత్రణలోనే ఉంచుకుంటారు. చాలామంది కొత్తసినిమాలు, పోర్న్ వెబ్‌సైట్లలోకి వెళ్లి తమ బ్యాంక్ ఖాతాల్లోని డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి ఫిర్యాదులు ఇటీవల పెరుగుతున్నాయి. దీనిపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి.
- కె.భవానీప్రసాద్, సైబర్‌క్రైమ్ సీఐ
Updated Date - Apr 01 , 2024 | 01:37 AM