ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నోరూరించే బేంబూ చికెన్‌

ABN, Publish Date - Oct 27 , 2024 | 12:45 AM

అరకు అందాలు తిలకించేందుకు వెళుతున్నారా...అయితే కచ్చితంగా మీరు అక్కడి ప్రత్యేక వంటకం ‘బేంబూ చికెన్‌’ రుచి చూడాల్సిందే. ఇప్పుడు అరకులోయను సందర్శించే పర్యాటకులు లొట్టలు వేసుకుని మరీ తింటున్న ఆహార పదార్థం అదే.

అరకు పర్యాటకులకు అదనపు ఆకర్షణ

పర్యాటక ప్రాంతాల్లో జోరుగా వ్యాపారం

తయారీ విధానం ప్రత్యేకం

అరకులోయ, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): అరకు అందాలు తిలకించేందుకు వెళుతున్నారా...అయితే కచ్చితంగా మీరు అక్కడి ప్రత్యేక వంటకం ‘బేంబూ చికెన్‌’ రుచి చూడాల్సిందే. ఇప్పుడు అరకులోయను సందర్శించే పర్యాటకులు లొట్టలు వేసుకుని మరీ తింటున్న ఆహార పదార్థం అదే. ఇంతకీ దాని ప్రత్యేకత ఏమిటంటారా...మనం మామూలుగా వండుకునే కోడి మాంసాన్ని వెదురు బొంగుల్లో ప్రత్యేక పద్ధతుల్లో ఉడికించి మనకు వడ్డిస్తారు. ఓస్‌...ఇంతేనా అని తేలిగ్గా తీసుకోవద్దు. చూడడానికి సులువుగానే కనిపించినా తయారుచేసే పద్ధతిలో అనుసరించే ప్రత్యేక విధానమే ఈ వంటకానికి ప్రత్యేక రుచి తీసుకువస్తుంది.

అరకులోయ, బొర్రాగుహలు, గాలికొండ వ్యూపాయింట్‌, బీసుపురం, సుంకరమెట్ట కాఫీ తోటలు, తాడిగుడ, కటిక, చాపరాయి జలపాతాలు వంటి సందర్శనీయ ప్రాంతాల్లో బేంబూ చికెన్‌ తయారుచేసేవారు వందలాది మంది ఉన్నారు. పర్యాటక ప్రాంతాల్లో బేంబూ చికెన్‌ తయారుచేస్తూ వీరంతా జీవనోపాధి పొందుతున్నారు. కిలో బేంబూ చికెన్‌ రూ.600కు విక్రయిస్తుంటారు.

తయారీ ఇలా..

అడుగు ఎత్తు ఉన్న వెదురు బొంగులను తీసుకుని వాటిని శుభ్రం చేస్తారు. నాటు/బ్రాయిలర్‌ కోడి మాంసం ముక్కలను శుభ్రం చేసి మసాలా దట్టించి అర్ధగంట సేపు నానబెడతారు. ఆ తరువాత ముందుగా సిద్ధం చేసుకున్న వెదురు బొంగుల్లో కోడి మాంసాన్ని దట్టించి అడ్డాకులతో గట్టిగా బిరడాను ఏర్పాటుచేస్తారు. ఆ తరువాత ఆ వెదురు బొంగులను కట్టెలపై 15 నుంచి 20 నిమిషాల పాటు కాలుస్తారు. బిరడా మూతగా పెట్టిన భాగం నుంచి నీరు రావడం ఆగిపోయేంత వరకు కాలుస్తారు. అనంతరం కాసేపు చల్లార్చిన తరువాత అరిటాకు లేదా విస్తరాకు లేదా పళ్లెంలో వడ్డిస్తారు. చికెన్‌లో నీరు కలపకపోవడం, నూనె వినియోగించకపోవడం, పచ్చి వెదురుబొంగులో కాల్చడం వల్ల దీనికి ప్రత్యేక రుచి వస్తుంది. బేంబూ చికెన్‌లో పోషక విలువలు పుష్కలంగా ఉంటాయని అంటారు. పచ్చి వెదురు బొంగులలో నీరుంటుంది కావున ఉడికించడానికి వేరుగా నీరు వాడాల్సిన అవసరం ఉండదు.

జోరుగా వ్యాపారం

ఒకప్పుడు తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి ప్రాంతానికే పరిమితమైన బేంబూ చికెన్‌ ఇప్పుడు అరకులోయ ప్రాంతంలో ఫేమస్‌ వంటకంగా మారిపోయింది. ప్రస్తుతం దీనికి ఉన్నంత గిరాకీ ఏ వంటకానికీ లేదు. అనంతగిరి/అరకు వచ్చిన పర్యాటకులు తప్పనిసరిగా ఈ వంటకాన్ని రుచి చూడడం పరిపాటిగా మారింది. ప్రతీ పర్యాటక ప్రాంతంలో 60 నుంచి వంద మంది వరకు ఈ వ్యాపారంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారంటే ఎంత డిమాండ్‌ ఉందో అర్థం చేసుకోవచ్చు. పర్యాటక సీజన్‌లో ముగ్గురు చొప్పున ఒక జట్టుగా ఏర్పడి రోజుకు రూ.20 వేల వరకు వ్యాపారం చేస్తారు.

Updated Date - Oct 27 , 2024 | 12:45 AM