బలిఘట్టం ఆలయానికి మహర్దశ
ABN, Publish Date - Dec 06 , 2024 | 12:53 AM
బలిఘట్టం ఆలయానికి మహర్దశ
అన్నవరం దేవస్థానం దత్తత
నేడు స్పీకర్ అయ్యన్నపాత్రుడు సమక్షంలో కార్యక్రమం
నర్సీపట్నం, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): స్థానిక మునిసిపాలిటీ పరిధిలోని బలిఘట్టంలో వున్న సత్యనారాయణస్వామి ఆలయాన్ని అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణస్వామి దేవస్థానం శుక్రవారం నుంచి దత్తత తీసుకోనున్నది. శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సమక్షంలో అన్నవరంలో ఆలయ అధికారులు దత్తత కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. బలిఘట్టంలో శతాబ్దాల క్రితం వెలసిన సత్యనారాయణస్వామి ఆలయం వరహా నది గట్టుకి అవతల వైపు ఉండేది. 1990 మే నెలలో సంభవించిన తుఫాన్‌కు వరహా నదికి భారీగా వరద పోటెత్తడంతో ఆలయం తీవ్రంగా దెబ్బతిన్నది. చాలా ఏళ్ల తరువాత 2016లో అప్పటి టీడీపీ ప్రభుత్వంలో రూ.45 లక్షలతో ఆలయ జీర్ణోద్ధరణ పనులు చేపట్టింది. సుమారు రూ.75 లక్షలతో ఆలయాన్ని ఆనుకొని కల్యాణ మండపం నిర్మించడానికి కృషి చేశారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో కల్యాణ మండపం నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉండి పోయాయి. ఇదిలావుండగా స్వామివారి ఆలయానికి బలిఘట్టం, గుండుపాలలో సుమారు 30 ఎకరాల వ్యవసాయ భూములు వున్నాయి. వీటి ద్వారా వచ్చే ఆదాయంతోపాటు హుండీల కానుకలతో ఆలయంలో ధూప, దీప, నైవేద్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆలయానికి అంతంత మాత్రంగానే ఆదాయం ఉండడంతో ధార్మిక కార్యక్రమాల నిర్వహణకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో బలిఘట్టం సత్యనారాయణస్వామి ఆలయాన్ని అన్నవరం దేవస్థానం దత్తత తీసుకుంటే అభివృద్ధి జరుగుతుందన్న ఉద్దేశంతో స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఈ విషయాన్ని దేవదాయ శాఖ కమిషనర్ దృష్టికి తీసకువెళ్లారు. ఆయన సానుకూలంగా స్పందించడంతో శుక్రవారం అన్నవరంలో జరిగే బలిఘట్టం శీసత్యనారాయణస్వామి ఆలయ దత్తత స్వీకార కార్యక్రమంలో అయ్యన్నపాత్రుడు పాల్గొంటారు. దత్తత అనంతరం బలిఘట్టం ఆలయానికి మహర్దశ కలుగుతుందని భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - Dec 06 , 2024 | 12:53 AM