జేసీ విశ్వనాథన్ బదిలీ
ABN, Publish Date - Jan 29 , 2024 | 12:37 AM
జిల్లా జాయింట్ కలెక్టర్ కేఎస్ విశ్వనాథన్‌ను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు విడుదల చేసింది.
జీవీఎంసీ అడిషినల్ కమిషనర్‌గా నియామకం
కొత్త జేసీగా కేఎం అశోక్
విశాఖపట్నం, జనవరి 28 (ఆంధ్రజ్యోతి):
జిల్లా జాయింట్ కలెక్టర్ కేఎస్ విశ్వనాథన్‌ను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు విడుదల చేసింది. మున్సిపల్ అడ్మినిస్ర్టేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌కు విశ్వనాథన్‌ను బదిలీ చేయగా, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్‌లోనే అడిషినల్ కమిషనర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా విశ్వనాథన్ స్థానంలో విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ కేఎం అశోక్‌ను నియమించింది.
ముక్కుసూటి తత్వమే కారణమా?
రాష్ట్ర వ్యాప్తంగా ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగానే జేసీ బదిలీ జరిగినట్టు చెబుతున్నా... దీని వెనుక కేఎస్ విశ్వనాథన్ ముక్కుసూటి తత్వమే కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. 2017 బ్యాచ్‌కు చెందిన ఈ ఐఏఎస్ అధికారి కేవలం ఏడాదిన్నర కిందటే విశాఖ జేసీగా బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఒకేచోట మూడేళ్లకు పైగా పనిచేస్తున్న వారిని బదిలీ చేయాలి. కానీ రెండేళ్లు కూడా పూర్తికాకుండానే విశ్వనాథన్‌ను బదిలీ చేయడం, అదీ ప్రాధాన్యం లేని జీవీఎంసీ అదనపు కమిషనర్ పోస్టులో నియమిస్తూ నగరంలోనే పోస్టింగ్ ఇవ్వడంపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముక్కుసూటిగా, నిజాయితీగా పనిచేసే విశ్వనాథన్ ఎన్నికల సమయంలో వైసీపీ నేతలకు సహకరించే అవకాశం లేదనే భావనతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జాయింట్ కలెక్టర్‌గా ఆయన అనేక భూ వివాదాలకు సంబంధించిన ఫైళ్ల విషయంలో నేతల సిఫార్సులను పరిగణనలోకి తీసుకోలేదని అఽధికారవర్గాల సమాచారం. దీనిపై అధికారపార్టీ నేతలు పలుమార్లు ఉన్నతాధికారులు, పార్టీ ముఖ్య నేతలకు ఫిర్యాదు చేశారని, ఎన్నికలు సమీపిస్తుండడంతో ఇప్పుడు ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించి, అంతగా ప్రాధాన్యం లేని పోస్టులోకి జేసీని బదిలీ చేసి ఉంటుందని కలెక్టరేట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Updated Date - Jan 29 , 2024 | 12:37 AM