ఆరోగ్యశాఖలో ఎఫ్‌ఆర్‌ఎస్
ABN, Publish Date - Nov 04 , 2024 | 01:00 AM
వైద్య, ఆరోగ్యశాఖలో ఫేషియల్ రికగ్నేషన్ సిస్టమ్ (ఎఫ్‌ఆర్‌ఎస్)ను ఇకపై పక్కాగా అమలుచేయనున్నారు.
ఉద్యోగులు సమయపాలన పాటించేలా కీలక ఆదేశాలు
తొలుత నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులకు అమలు
ఆ తరువాత మిగిలిన ఉద్యోగులకు వర్తింపు
రెండు రోజులు ఆలస్యమైతే సీఎల్‌లో కోత
మూడు రోజులు దాటితే వేతనాలు కట్
విశాఖపట్నం, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి):
వైద్య, ఆరోగ్యశాఖలో ఫేషియల్ రికగ్నేషన్ సిస్టమ్ (ఎఫ్‌ఆర్‌ఎస్)ను ఇకపై పక్కాగా అమలుచేయనున్నారు. ముఖ్యంగా నేషనల్ హెల్త్ మిషన్‌లో పనిచేసే ఉద్యోగులకు ఈ విధానాన్ని తొలుత అమలుచేసేలా ఆదేశాలందాయి. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే ఉద్దేశంతో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు.
నేషనల్ హెల్త్ మిషన్‌లో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యసేవలు అందించడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. నగర పరిధిలోని అర్బ న్ హెల్త్ సెంటర్స్, రక్త నిధి కేంద్రాలు, సాక్స్ సెంటర్స్‌లో పనిచేసే వారు ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులే. వీరందరి జీతాలకు ఎఫ్‌ఆర్‌ఎస్‌కు ముడిపెడుతూ ఆదేశాలిచ్చారు. నేషనల్ హెల్త్ మిషన్‌లో పనిచేసే ఉద్యోగులు వారికి కేటాయించిన విభాగాల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉండాలి. అందుకు అనుగుణంగా ఎఫ్‌ఆర్‌ఎస్ యాప్‌లో ముఖహాజరు నమోదు చేసుకోవాలి. రెండు రోజులు ఆలస్యమైతే ఒక సీఎల్, మూడు రోజులు ఆలస్యమైతే వేతనాల్లో కోతవిధిస్తారు. రాష్ట్ర స్థాయి ఉద్యోగులు హాజరును పర్యవేక్షించనున్నారు. ఈ మేరకు ఉద్యోగులకు స్పష్టమైన ఆదేశాలు అందించినట్టు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పి.జగదీశ్వరరావు తెలిపారు. జిల్లాలో నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలో సుమారు 1,500 మంది పనిచేస్తున్నారు.
విధుల్లో నిర్లక్ష్యం
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, హెల్త్ అండ్‌వెల్‌నెస్ సెంట ర్లు, అర్బన్‌హెల్త్ సెంటర్స్‌లో ఉద్యోగులు తీరుబడిగా రావడం, మధ్యాహ్నం వేగంగా వెళ్లిపోవడంతో మెరుగైన వైద్యసేవలు అందడం లేదన్న ఫిర్యాదులున్నాయి. వీటిపై దృష్టిసారించిన ఉన్నతాధికారులు ఎఫ్‌ఆర్‌ఎస్ విధానాన్ని పటిష్టంగా అమలు చేయడం ద్వారా మాత్రమే చెక్ చెప్పేందుకు అవకాశం ఉంటుందని భావించారు. ఇందుకోసం ప్రత్యేకంగా నోడల్ అధికారిని నియమించారు.
కొత్త ఏడాదిలో మిగిలిన ఉద్యోగులకు..
ఆరోగ్యశాఖలోని మిగిలిన ఉద్యోగులకు దీనిని వచ్చే సంవత్సరం నుంచి వర్తింప జేయనున్నారు. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలందాయి. ఎఫ్‌ఆర్‌ఎస్ యాప్ డౌన్లోడ్ చేసుకుని పనిచేసే కేంద్రానికి వచ్చినప్పుడు లాగిన్ కావాలి. సాయంత్రం వెళ్లినప్పుడు ముఖ హాజరు ద్వారా లాగ్ అవుట్ చేయాలి.
Updated Date - Nov 04 , 2024 | 01:00 AM