ఫార్మా ప్రమాదంపై దాగుడుమూతలు
ABN, Publish Date - Dec 05 , 2024 | 01:24 AM
ఠాగూర్ ఫార్మా కంపెనీలో ప్రమాదంపై అసలు విషయాలు బయటకు రావడం లేదు.
‘ఠాగూర్ లేబొరీటరీస్’ ఘటనపై భిన్నవాదనలు
యాజమాన్యం చెప్పిందే వేదం అన్నట్టుగా వ్యవహరిస్తున్న అధికారులు
సొంత పరిశీలన, విచారణ శూన్యం
వాస్తవాలకు ముసుగు
అసలు అక్కడ విష వాయువులు
ఎలా లీకయ్యోయో నిర్ధారించని వైనం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
ఠాగూర్ ఫార్మా కంపెనీలో ప్రమాదంపై అసలు విషయాలు బయటకు రావడం లేదు. ఆ కంపెనీ అనుమతి లేని మందులు తయారు చేస్తున్నప్పుడు ప్రమాదం జరగ్గా...ఆ ఘటనపై యాజమాన్యం చెప్పిన విషయాలనే అధికారులు వల్లె వేస్తున్నారు. వాస్తవంగా ఏమి జరిగింది అనేది వెల్లడించడం లేదు. అసలు వారు అన్నీ సక్రమంగా పరిశీలించారా?...అనే అనుమానాలు కలుగుతున్నాయి. దీనిపై ‘ప్రజల కోసం శాస్త్రవేత్తల బృందం’ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తోంది. కంపెనీ యాజమాన్యాన్ని కాపాడడానికి అధికారులు సహకరిస్తున్నారని ఆరోపిస్తోంది.
ప్రమాదం జరిగిన తరువాత అక్కడకు ఫ్యాక్టరీస్ విభాగం అధికారులు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు వెళ్లారు. వారు స్వతంత్రంగా విచారణ చేయలేదని, భిన్నమైన సమాచారం ఇచ్చారని శాస్త్రవేత్త బాబూరావు ఆరోపిస్తున్నారు. లామివుడీన్ (హెచ్‌ఐవీ మందు) ఉత్పత్తి మూడో దశలో ఉండగా ప్రమాదం జరిగిందని ఫ్యాక్టరీస్ విభాగం వెల్లడించింది. ఏపీ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు మాత్రం ‘పాంటోప్రజోల్’ మూడో దశ ఉత్పత్తిలో ఉండగా ప్రమాదం జరిగిందని, క్లోరిన్ వాయువు వెలువడిందని నివేదించింది. ఈ రెండు శాఖల అధికారులకూ కంపెనీ యాజమాన్యమే సమాచారం ఇచ్చింది. కానీ వారు వేర్వేరు కారణాలు వెల్లడించారు.
ఫ్యాక్టరీస్ అధికారులు ఫాస్జీన్ గ్యాస్ వెలువడిందని పేర్కొన్నారు. హైడ్రోక్లోరిక్ యాసిడ్‌లో క్లోరిన్ కలుపుతున్నప్పుడు రియాక్టర్‌లో ఒత్తిడి పెరిగిందని, యాసిడ్ బయటకు రాగా దానిపై సోడా జల్లారని, దాంతో ఫాస్జీన్ వాయువు వచ్చిందని, అది విషపూరితం కావడంతో ప్రమాదం జరిగిందని చెబుతున్నారు.
క్లోరిన్ వాయువు వెలువడిందని కాలుష్య నియంత్రణ మండలి చెబుతోంది. వాస్తవానికి క్లోరిన్ వాసన సులువుగానే గుర్తించవచ్చు. 0.002-3.4 పీపీఎం స్థాయిలోనే వాసన తెలుస్తుంది. క్లోరిన్ వాయువు వస్తున్నప్పుడు దానిని పీలుస్తూ కార్మికులు అక్కడే ఎందుకు ఉంటారు?, ఘాటైన వాసన కాబట్టి దూరంగా వెళతారు. అది కనీస జాగ్రత్త. కానీ, బయటకు వచ్చింది క్లోరిన్ వాయువు అని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఎలా నిర్ధారించారో వెల్లడించలేదు.
ఇవీ అనుమానాలు...
- హైడ్రోక్లోరిక్ యాసిడ్, క్లోరోఫామ్ రెండూ కలవవు. అంటే రియాక్షన్ ఏమీ ఉండదు. అటువంటిది విషవాయువు ఎలా వచ్చింది?, ఎక్కడి నుంచి వచ్చింది?
- రియాక్టర్‌లో హైడ్రోక్లోరిక్ యాసిడ్, క్లోరోఫామ్ రియాక్టర్‌లో పోసినప్పుడు రియాక్షన్ ఉండదు. అటువంటపుడు ప్రెషర్ (ఒత్తిడి) ఎక్కడి నుంచి వచ్చింది?
- వెంట్ ఎందుకు తెరుచుకుంది?, అందులో నుంచి లిక్విడ్ ఎలా బయటకు వచ్చింది?
...ఇవన్నీ ప్రమాద స్థలిలో పరిశీలించాల్సిన ప్రాథమిక అంశాలు. కానీ రెండు శాఖల అధికారులు యాజమాన్యం చెప్పిన చిలక పలుకులే పలుకుతున్నారు తప్ప సొంతంగా విచారణ చేసి ఏమీ చెప్పడం లేదు. అనుమతి లేకుండా హెచ్‌ఐవీ మందులు తయారుచేయడం, అనుభవం లేని పనివారితో పనిచేయించడం, తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వంటి అనేక తప్పిదాలు ఉన్నాయి.
తరలింపులో అలసత్వం
ఘటన నవంబరు 26వ తేదీ సాయంత్రం 4.40 గంటలకు జరిగింది. ఆ స్థలంలో ఉన్న కార్మికులు బి-షిఫ్ట్ (మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10గంటలు) ముగిసిన తరువాత యాజమాన్యానికి చెప్పారు. వారిని 27వ తేదీ తెల్లవారుజామున రెండు గంటలకు ఆస్పత్రిలో చేర్చారు. అంటే ఘటన జరిగిన 9 గంటల తరువాత వారిని చికిత్సకు పంపారు. కానీ యాజమాన్యం తక్షణమే పంపించామని చెబుతోంది. విషవాయువును పీల్చిన వెంటనే చికిత్సకు తరలిస్తే ప్రాణాలు దక్కేవి. కానీ 9 గంటలు ఆలస్యం కావడంతో ఇద్దరి ప్రాణాలు పోయాయి. ఇప్పటికి కూడా చనిపోయిన కార్మికులు పీల్చిన వాయువు ఏమిటనేది అధికారులు చెప్పడం లేదు.
‘ఠాగూర్’ ఫార్మాపై కేసు నమోదు
పరవాడ, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఫార్మాసిటీలోని ఠాగూర్ ఫార్మా లేబొరేటరీస్ ప్రైవేటు లిమిటెడ్ యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్టు అనకాపల్లి జిల్లా పరవాడ సీఐ జి.మల్లికార్జునరావు తెలిపారు. ఫ్యాక్టరీలో వారం కిందట విష వాయువు లీకవ్వడంతో ఇద్దరు కార్మికులు మృతిచెందగా, మరో 30 మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలైన సంగతి తెలిసిందే. యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే ప్రమాద తీవ్రత పెరిగిందని అధికారులు తేల్చారు. దీనిని తీవ్రంగా పరిగణించి వివిధ సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు. నిర్లక్ష్యం, మానవ ప్రాణాలకు హాని కలిగించడం, ప్రమాదాన్ని అధికారులకు తెలియకుండా దాచిపెట్టడం, తదితర అభియోగాలపై కేసు నమోదుచేశారు. భారతీయ న్యాయ సహిత సెక్షన్ 106 (1), 125 (ఎ), 125 (బి), 239, 286 రెడ్‌విత్ 3 (5) కింద కేసు నమోదుచేసినట్టు సీఐ వెల్లడించారు. ఇదిలావుంటే అస్వస్థతకు గురైన ఉద్యోగుల్లో ఇంకా 11 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. వారిని రెండు, మూడు రోజుల్లో డిశ్చార్జి చేసే అవకాశం ఉందన్నారు.
Updated Date - Dec 05 , 2024 | 01:24 AM