కళ్లు తేలేస్తున్న కోళ్లు
ABN, Publish Date - Mar 21 , 2024 | 11:26 PM
వాతావరణంలో కలిగిన మార్పు వల్ల గిరిజన ప్రాంతంలో ఆదివాసీలు పెంచుకుంటున్న పెరటి కోళ్లు కొక్కెర తెగులు(రానికెట్)తో మృత్యువాత పడుతున్నాయి. సాధారణంగా శీతాకాలం నుంచి వేసవిలోకి ప్రవేశించే సమయంలో వైరస్ కారణంగా కోళ్లు ఈ వ్యాధి బారిన పడుతుంటాయి. ఈ తెగులును ఈ ప్రాంతవాసులు కునుకుడు వ్యాధి అని పిలుస్తారు.
మన్యంలో కొక్కెర తెగులుతో మృత్యువాత
వ్యాధి సోకిన కోళ్ల నుంచి విస్తృతంగా వ్యాప్తి
మరణించిన వాటిని తినకూడదు
లక్షణాల ఆధారంగా నివారణ చర్యలు చేపట్టాలి
కేవీకే పశువైద్య శాస్త్రవేత్త విజయ రాజ్ఞి
చింతపల్లి, మార్చి 21: వాతావరణంలో కలిగిన మార్పు వల్ల గిరిజన ప్రాంతంలో ఆదివాసీలు పెంచుకుంటున్న పెరటి కోళ్లు కొక్కెర తెగులు(రానికెట్)తో మృత్యువాత పడుతున్నాయి. సాధారణంగా శీతాకాలం నుంచి వేసవిలోకి ప్రవేశించే సమయంలో వైరస్ కారణంగా కోళ్లు ఈ వ్యాధి బారిన పడుతుంటాయి. ఈ తెగులును ఈ ప్రాంతవాసులు కునుకుడు వ్యాధి అని పిలుస్తారు.
ప్రస్తుతం చింతపల్లి, జీకేవీధి పరిధిలోని గిరిజన గ్రామాల్లో వారం రోజులుగా పెరటి కోళ్లు కొక్కెర తెగులుతో మృతి చెందుతున్నాయి. దీంతో ఆదివాసీ రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా కొక్కెర తెగులు లక్షణాలు, నివారణకు తీసుకోవలసిన చర్యలపై హరిపురం కృషి విజ్ఞాన కేంద్రం పశువైద్య శాస్త్రవేత్త డాక్టర్ విజయ రాజ్ఞి పలు వివరాలు వెల్లడించారు.
కొక్కెర తెగులు
పెరటి కోళ్లలో ప్రధానంగా కొక్కెర తెగులు అధికంగా కనిపిస్తుంది. ఈ వ్యాధి పారామిక్సో వైరస్ వల్ల వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి కోళ్లకు వ్యాప్తి చెందే తెగుళ్లలో ప్రమాదకరమైనది. ఒక కోడికి ఈ వ్యాధి సోకితే ఇతర కోళ్లకు సులభంగా వ్యాప్తి చెందుతుంది. ఒకేసారి అధిక కోళ్లకు ప్రాణ నష్టం కలిగిస్తుంది. వ్యాధి సోకిన కోళ్ల రెట్టలు, ముక్కు, నోటి నుంచి కారే స్రవాల వల్ల ఆరోగ్యవంతమైన కోళ్లకు కూడా ఈ వ్యాధి సోకుతుంది.
వ్యాధి లక్షణాలు
కొక్కెర తెగులు వ్యాప్తి చెందిన కోళ్లు ముడుచుకుని రెక్కలు వేలాడిపోతాయి. ముఖం ఉబ్బి నీలి రంగులోకి మారుతుంది. ముక్క నుంచి నీరు కారుతుంది. కోళ్లు గుడ్లు పెట్టడం మానేస్తాయి. మెడ వాలిపోవడం, కాళ్లు, రెక్కలు పడిపోవడం జరుగుతుంది. ఈ వ్యాధికి గురైన కోళ్లు పల్చగా తెలుపు, ఆకుపచ్చ రంగులో రెట్ట వేస్తుంది. కోడి బాగా నీరసపడి మృతి చెందుతుంది. ఈ వ్యాధితో మరణించిన కోళ్లను ఎవరూ ఆహారంగా తీసుకోకూడదు. మరణించిన కోళ్లను ఇతర కోళ్లకు దూరంగా శివారు ప్రాంతాల్లో పాతిపెట్టాలి. ఈ వ్యాధి సోకిన కోళ్లను దూరంగా పెట్టడంతోపాటు ఆరోగ్యవంతమైన కోళ్లు కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
టీకాలతో నివారణ
కోళ్లలో కొక్కెర తెగులు వ్యాప్తి చెందకుండా టీకాల ద్వారా నివారించుకోవచ్చు. కోడి పిల్ల దశలోనే మొదటి విడత లసోట(ఎఫ్1) కళ్లలో వేయాలి. ఏడు రోజుల తరువాత బూస్టర్ డోస్, 28 రోజులకు కంటి ద్వారా గాని, ముక్కు ద్వారా గాని టీకా వేయాలి. 70 రోజులకు ఆర్2బి టీకాను కండకు ఇవ్వాలి. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ టీకా ఇవ్వడం వల్ల కొక్కెర తెగులు వ్యాప్తి చెందదు.
హోమియో, ఆయుర్వేద చికిత్స
కొక్కెర తెగులుకు హోమియో, ఆయుర్వేద చికిత్స అందుబాటులో వున్నది. ఆర్సెనిక్ ఆల్బమ్-200 హోమియో మందు చిన్న కోళ్లకు రెండు చుక్కలు, పెద్ద కోళ్లకు ఐదు చుక్కల మందు చొప్పున రెండు పూటలు మూడు రోజుల పాటు పట్టడం ద్వారా వ్యాధిని నివారించవచ్చు. కోళ్లకు కునుకుడు వ్యాధి సోకకుండా ఆయుర్వేద వైద్యంలో చికిత్స ఉన్నది. ఒక కలబంద ఆకు గుజ్జు, 20 మిరియాలు, రెండు టేబుల్ స్పూన్ పసుపు, 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక పెద్ద ఉల్లిపాయ కలిపి పేస్ట్‌గా తయారు చేసి వడగట్టుకుని వచ్చిన రసం, మజ్జి, నీళ్లలో కలిపి ఇవ్వడం వల్ల కోళ్లకు వ్యాధి వ్యాప్తి చెందదు.
Updated Date - Mar 21 , 2024 | 11:26 PM