తూతూమంత్రంగా కులగణన
ABN, Publish Date - Jan 27 , 2024 | 12:59 AM
జిల్లాలో కులగణన తూతూమంత్రంగా సాగుతోంది.
ఇళ్లకు వెళ్లకుండానే సర్వే
ఫోన్‌లో వివరాల సేకరణ
అదేమంటే సర్వర్ పనిచేయదంటూ బుకాయింపు
పట్టించుకోని అధికారులు
విశాఖపట్నం, జనవరి 26 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో కులగణన తూతూమంత్రంగా సాగుతోంది. సచివాలయ సిబ్బందిలో ఒకరు, వలంటీర్ ఇంటింటికీ వెళ్లి సమగ్రంగా వివరాలను సేకరించి యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. అయితే, ఇళ్లకు వెళ్లకుండానే ఈ ప్రక్రియను పూర్తి చేసేస్తున్నారు. అతికొద్దిచోట్ల మాత్రమే సచివాలయ సిబ్బంది, వలంటీర్లు ఇళ్లకు వెళ్లి వివరాలను సేకరిస్తున్నారు. నగర పరిధిలో అయితే సర్వే సాగుతున్న విషయం కూడా చాలామందికి తెలియదు. అంటే, కుల గణన ఏ విధంగా సాగుతుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. వలంటీర్లు తమ పరిధిలోని 50 ఇళ్ల వారికి ఫోన్ చేసి కుటుంబ సభ్యుల వివరాలను వారే ఎంటర్ చేసి అప్‌లోడ్ చేస్తున్నారు. ఉన్నతాధికారులు కూడా రోజువారీ ఎంత శాతం పూర్తయిందన్న వివరాలను తెలుసుకుంటున్నారే తప్ప..సర్వే ఏ విధంగా సాగుతుందని పట్టించుకోవడం లేదు.
కుల గణన చేయాల్సిందిలా..
కుల గణనకు సంబంధించిన వివరాలను గ్రామ/వార్డు వలంటీర్ యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. సచివాలయ సిబ్బందిలో ఒకరు, వలంటీర్ తప్పకుండా ఇళ్లకు వెళ్లి సమస్త సమాచారాన్ని క్షుణ్ణంగా అందులో అప్‌లోడ్ చేయాలి. యాప్ ఓపెన్ చేయగానే కుల గణన సర్వే ఆప్షన్ కనిపిస్తుంది. ఇందులో తనకు కేటాయించిన హౌస్ హోల్డ్ వివరాలు కనిపిస్తాయి. అందులో ఏ ఇంటిని సందర్శిస్తున్నారో దానిపై క్లిక్ చేయగానే ఆ ఇంటిలోని సభ్యుల పేర్లు కనిపిస్తాయి. ఇంటిలో ఎవరున్నారో సదరు వ్యక్తి పేరుపై క్లిక్ చేయగానే అథెంటికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అథెంటికేషన్ కోసం ఓటీపీ, ఫింగర్ ప్రింట్, ఐరిస్, ఫేస్ రికగ్నేషన్ ద్వారా లాగిన్ అవుతారు. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత కుల గణన ప్రక్రియ ప్రారంభమవుతుంది. అందులో ఉన్న వివరాలను నమోదుచేస్తారు. సదరు కుటుంబ సభ్యుడి వివరాలన్నీ నమోదు చేసిన తరువాత...కింద ఒక ఆప్షన్ కనిపిస్తుంది. పైన తెలిపిన వివరాలన్నీ నా కుటుంబానికి సంబంధించిన సమాచారం, నాకు తెలిసినంత వరకు నిజం అని ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియతో తరువాత కుల గణన పూర్తవుతుంది.
ఏం చేస్తున్నారు?
గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగి/వలంటీర్ ఇళ్లకు వెళ్లకుండా...ఎక్కడో ఒకచోట కూర్చుని ఫోన్‌ల ద్వారా వివరాలు సేకరిస్తున్నారు. వలంటీర్లు తన పరిధిలో ఇళ్ల యజమానులకు ముందురోజు లేదా ఐదారు గంటల ముందు...ఫోన్ చేస్తాం..కుటుంబ సభ్యుల వివరాలతో సిద్ధంగా ఉండండి అంటూ వాట్సాప్ మెసేజ్ చేస్తున్నారు. తరువాత ఫోన్ చేసి వివరాలు సేకరిస్తున్నారు. దీనికి సంబంధించి ఓటీపీ వస్తే చెప్పాలని సూచిస్తున్నారు. సర్వే అంటే ఇంటికి రావాలి కదా ప్రశ్నిస్తే...సర్వర్ పనిచేయడం లేదని పేర్కొంటున్నారు. అంతే తప్ప ఇళ్లకు వెళ్లడం లేదు.
జిల్లా అంతటా ఇదే పరిస్థితి..
నగరంతోపాటు జిల్లాలోని నాలుగు మండలాల్లో సర్వే ఇదే విధంగా కొనసాగుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రతి నెలా ఒకటో తేదీన పింఛన్ పంపిణీ చేసే భవనం, సచివాలయం వద్దే కులగణన సర్వే చేస్తున్నారని పలువురు చెబుతున్నారు. కాగా జిల్లాలో 7,15,260 ఇళ్లలో 21,47,507 మంది జనాభా ఉండగా గురువారం వరకు 4,32,084 (60.41 శాతం) ఇళ్లకు సంబంధించి 10,81,673 (50.37శాతం) మంది నుంచి వివరాలు సేకరించారు. కాగా సర్వే సిబ్బంది ఇంటింటికి వెళుతున్నారా? లేదా ఒకచోట కూర్చుని చేపడుతున్నారా? అనేది పర్యవేక్షించే అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి.
Updated Date - Jan 27 , 2024 | 12:59 AM