ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గంజాయి రవాణాకు అడ్డుకట్ట

ABN, Publish Date - Sep 21 , 2024 | 10:59 PM

జిల్లా పరిధిలో ఎక్కడా గంజాయి సాగు జరగకపోయినా ఇతర ప్రాంతాల నుంచి జిల్లా మీదుగానే రవాణా జరుగుతోందని గుర్తించాం. నిషేధిత గంజాయి రవాణాను అడ్డుకొనేందుకు ప్రత్యేక నిఘా పెట్టాం. గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతాం. మహిళల రక్షణ కోసం ఇప్పటికే ఉమెన్‌ సేఫ్టీ సెల్‌ను ఏర్పాటు చేశాం. చోరీలు, రోడ్డు ప్రమాదాలను అదుపు చేయడానికి పటిష్ట చర్యలు చేపడుతున్నాం’ అని ఎస్పీ ఎం.దీపిక తెలిపారు.

ఎం.దీపిక, అనకాపల్లి జిల్లా ఎస్పీ

నిరంతరాయంగా తనిఖీలు

డ్రగ్స్‌ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహనకు గ్రామస్థాయిలో కమిటీలు

మహిళల రక్షణకు ఉమెన్‌ సేఫ్టీ సెల్‌ ఏర్పాటు

సైబర్‌ నేరాలపై లఘు చిత్రాలతో అవగాహన

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు

‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఎస్పీ ఎం.దీపిక

(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)

‘జిల్లా పరిధిలో ఎక్కడా గంజాయి సాగు జరగకపోయినా ఇతర ప్రాంతాల నుంచి జిల్లా మీదుగానే రవాణా జరుగుతోందని గుర్తించాం. నిషేధిత గంజాయి రవాణాను అడ్డుకొనేందుకు ప్రత్యేక నిఘా పెట్టాం. గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతాం. మహిళల రక్షణ కోసం ఇప్పటికే ఉమెన్‌ సేఫ్టీ సెల్‌ను ఏర్పాటు చేశాం. చోరీలు, రోడ్డు ప్రమాదాలను అదుపు చేయడానికి పటిష్ట చర్యలు చేపడుతున్నాం’ అని ఎస్పీ ఎం.దీపిక తెలిపారు. శనివారం ‘ఆంధ్రజ్యోతి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె పలు అంశాలను వెల్లడించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...

గంజాయి రవాణాకు చెక్‌ పెడతాం

జిల్లాను అడ్డాగా చేసుకొని కొందరు గత కొన్నేళ్లుగా గంజాయి రవాణా చేస్తున్నట్టు గుర్తించాం. రవాణాదారులకు చెక్‌ పెట్టేందుకు జిల్లా పోలీస్‌ యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. కృష్ణాదేవిపేట, గొలుగొండ, వి.మాడుగుల, దేవరాపల్లి మండలాల్లో 24 గంటలూ నిరంతరాయంగా తనిఖీలు జరిగేలా నాలుగు చెక్‌ పోస్టులను ఏర్పాటు చేశాం. వీటితో పాటు 22 డైనమిక్‌ చెకింగ్‌ పాయింట్లను ఏర్పాటు చేశాం. పోలీస్‌ స్టేషన్ల పరిధిలో సీఐ, ఎస్‌ఐల నేతృత్వంలో ఈ డైనమిక్‌ చెకింగ్‌ బృందాలు గంజాయి రవాణా జరుగుతున్నట్టు అనుమానం ఉంటే ఆకస్మిక తనిఖీలు చేస్తాయి. నార్కోటిక్‌ డ్రగ్స్‌, గంజాయి వంటివి కొన్ని పార్సిల్‌, కొరియర్‌ సర్వీసు సంస్థల ద్వారా జరగుతున్నట్టు సమాచారం ఉంది. ఈ మేరకు ట్రాన్స్‌పోర్టు ఆఫీసుల్లో తనిఖీలు చేస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి, డ్రగ్స్‌ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించేందుకు గ్రామ స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కమిటీల నియామకాలు జరిగాయి. కమిటీల ద్వారా గంజాయి, నార్కోటిక్‌ డ్రగ్స్‌ వినియోగం వల్ల ఎదురయ్యే నష్టాలపై అవగాహన కల్పిస్తాం. జిల్లాలో గతంలో గంజాయి రవాణా కేసులతో సంబంధాలున్న పాత నేరస్థులు 400 మందికి పైగా ఉన్నారు. వారందరి కదలికలపై నిఘా పెట్టాం. వారిపై కొత్తగా షీట్‌లు ఓపెన్‌ చేసి విచారణ జరుపుతున్నాం. గంజాయి కేసుల్లో పట్టుబడుతున్న చిన్న ట్రాన్స్‌పోర్టు యాజమాన్యాలపై కేసులు పెట్టడమే కాకుండా రవాణాతో సంబంధాలున్న మూలాలను వెతికి తీసేందుకు వివరాలు సేకరిస్తున్నాం. ఇప్పటికే గంజాయి రవాణా కేసులతో సంబంధాలు ఉండి తప్పించు కొని తిరుగుతున్న వారిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలిస్తున్నాం.

ఉమెన్‌ సేఫ్టీ సెల్‌ ఏర్పాటు

మహిళల రక్షణకు అనకాపల్లి మహిళా పోలీస్‌ స్టేషన్‌కు అనుసంధానంగా ఉమెన్‌ సేఫ్టీ సెల్‌ను ఏర్పాటు చేశాం. స్కూళ్లు, కళాశాలలు, మహిళలు పనిచేసే ప్రదేశాల్లో పోక్సో యాక్టు, గుడ్‌ టచ్‌ బ్యాడ్‌ టచ్‌, ర్యాగింగ్‌, ఈవ్‌టీజింగ్‌, గృహహింస తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నాం.

సైబర్‌ నేరాలపై దృష్టి

జిల్లాలో సైబర్‌ నేరాలపై ఎక్కువగా ఫిర్యాదులు అందుతున్నాయి. సైబర్‌ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు త్వరలో లఘు చిత్రాలను రూపొందించి విడుదల చేస్తాం. వాట్సాప్‌ గ్రూపుల్లో వీటిని పోస్టు చేస్తాం. జిల్లాలో సైబర్‌ నేరాల కారణంగా ఇప్పటికే రూ.2 కోట్ల వరకు వేర్వేరు కేసుల్లో బాధితులు నష్టపోయారు. సైబర్‌ మోసం జరిగిన వెంటనే బాధితులు 1930 నంబరుకు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలి.

పోలీస్‌ స్టేషన్లలో ఫ్రంట్‌ ఆఫీసులు

ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో వివిధ సమస్యలపై వచ్చే వారి నుంచి ఫిర్యాదుల స్వీకరణకు ఫ్రంట్‌ ఆఫీసులు నిర్వహించాలని ఆదేశించాం. స్టేషన్‌కు అందుతున్న ప్రతి ఫిర్యాదుకు జవాబుదారీ తనం ఉండేలా చర్యలు చేపట్టాం. సివిల్‌ కేసుల్లో పోలీసులు తలదూర్చకుండా ఫిర్యాదులను చట్ట పరిధిలో మాత్రమే పరిశీలించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. ప్రతి స్టేషన్‌ పరిఽధిలో రెండు నైట్‌ బీట్‌ బృందాలు పని చేస్తున్నాయి. గ్రామాల్లో మద్యం బెల్ట్‌ దుకాణాలు, దాబాలు, ఆరుబయట మద్యం విక్రయాలపై ప్రత్యేక నిఽఘా కొనసాగుతోంది.

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు

జిల్లాలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాం. 24 బ్లాక్‌ స్పాట్‌లను గుర్తించాం. ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, బ్లింకింగ్‌ లైట్‌లను ఏర్పాటు చేయాలని హైవే అథారిటీ అధికారులను కోరాం. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు బుక్‌ చేయడం ద్వారా ప్రమాదాల నివారణకు అవకాశం ఉంటుంది. ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్ట్‌లు నిర్వహిస్తున్నాం.

Updated Date - Sep 21 , 2024 | 10:59 PM