ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఉక్కుపై ద్వంద్వ వైఖరి

ABN, Publish Date - Nov 07 , 2024 | 01:24 AM

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటు కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. కేంద్రంలోని పాలకులు ప్లాంటును ప్రైవేటీకరణ చేయబోమని చెబుతున్నారే తప్ప ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. పూర్తిస్థాయి ఉత్పత్తికి అవసరమైన సహకారం అందించడం లేదు. ఉద్యోగులను భారీసంఖ్యలో తగ్గించేస్తూ సెయిల్‌మాదిరిగా లాభాలు తేవడానికి కృషిచేయాలని సూక్తులు చెబుతున్నారు.

గోరంత సాయం...కొండంత ప్రచారం

ఉత్పత్తికి అవసరమైన మేర

ముడి పదార్థాలు సమకూర్చకుండా

లాభాల్లోకి తేవాలంటూ ఆదేశాలు

జీతాలు, పెన్షన్లు ఇవ్వకుండా వేధింపులు

అదేమని ప్రశ్నిస్తే చర్యలు తీసుకుంటామంటూ బెదిరింపులు

ఇన్‌చార్జి సీఎండీని మార్చాలంటున్న ఉద్యోగులు, కార్మికులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటు కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. కేంద్రంలోని పాలకులు ప్లాంటును ప్రైవేటీకరణ చేయబోమని చెబుతున్నారే తప్ప ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. పూర్తిస్థాయి ఉత్పత్తికి అవసరమైన సహకారం అందించడం లేదు. ఉద్యోగులను భారీసంఖ్యలో తగ్గించేస్తూ సెయిల్‌మాదిరిగా లాభాలు తేవడానికి కృషిచేయాలని సూక్తులు చెబుతున్నారు.

ఉక్కు ఉద్యోగులకు గత రెండు నెలల నుంచి సగం జీతమే ఇస్తున్నారు. మిగిలిన 50 శాతం జీతం గురించి మాట్లాడడం లేదు. 850 కుటుంబాలకు నాలుగు నెలలుగా పెన్షన్లు ఇవ్వడం లేదు. పండుగ సమయంలో కూడా జీతాలు ఇవ్వరా?...అని ఉద్యోగులు ధర్నా చేస్తే వారికి నోటీసులు ఇస్తున్నారు. విధి నిర్వహణలో ఉన్న సమయంలో ధర్నాలు చేయడానికి వీల్లేదని, ఇంకోసారి అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఉద్యమాలు నడుపుతున్న నాయకులను కట్టడి చేయడానికి బదిలీ అస్త్రం చూపించి బెదిరిస్తున్నారు. గతంలో మూడో బ్లాస్ట్‌ ఫర్నేస్‌ మూతపడడానికి కారణమైన అధికారికి ఇన్‌చార్జి సీఎండీ బాధ్యతలు అప్పగించారని, ఆయన వచ్చిన తరువాత సమస్యలు మరింత పెరిగాయని ఉద్యోగులు, కార్మికులు ఆరోపిస్తున్నారు.

రూ.1,650 కోట్ల సాయంతో సరా?

ఏడాదికి 7.3 మిలియన్‌ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేయగల స్టీల్‌ ప్లాంటుకు ముడి పదార్థాల కొరత తీవ్రంగా ఉంది. రెండు బ్లాస్ట్‌ ఫర్నేస్‌లు మూతపడి, మిగిలిన ఒకటి అరకొరగా నడుస్తుండగా సెప్టెంబరు నెలలో కేంద్రం రూ.1,650 కోట్లు రెండు విడతలుగా సాయం చేసింది. మొదట రూ.500 కోట్లు వచ్చి, ఆ మొత్తాన్ని జీఎస్‌టీ, తదితర పన్నులు కట్టడానికి ఉపయోగించాలని షరతు పెట్టింది. అంటే ఈ చేత్తో ఇచ్చి ఆ చేతితో తీసేసుకుంది. రెండో విడత ఇచ్చిన రూ.1,150 కోట్లలో కూడా చట్టబద్ధమైన చెల్లింపులు పూర్తిచేసి, మిగిలిన మొత్తం బ్యాంకులకు జమ చేసి, బొగ్గుకు అవసరమైన క్రెడిట్‌ లెటర్లు ఇప్పించారు. దీని వల్ల రెండో బ్లాస్ట్‌ ఫర్నేస్‌ మాత్రమే అదనంగా వినియోగంలోకి వచ్చింది. మూడో బ్లాస్ట్‌ ఫర్నేస్‌ గురించి, దానికి అవసరమైన ముడి పదార్థాల గురించి ఎవరూ మాట్లాడడం లేదు. ఉత్పత్తి 100 శాతం జరిగినప్పుడే లాభాలు వస్తాయి. మూడింటిలో రెండు బ్లాస్ట్‌ ఫర్నేసులు నడుపుతూ సెయిల్‌కు దీటుగా లాభాలు తేవాలని చెబుతున్నారు. సెయిల్‌లో ఉత్పత్తి సామర్థ్యం-ఉద్యోగుల సంఖ్య ఆధారంగా ఇక్కడ కూడా సిబ్బందిని సమకూర్చాలని కోరితే...అదనపు నియామకాలు చేపట్టకపోగా ఉన్న వారినే డిప్యుటేషన్‌పై పంపించేస్తున్నారు. ఉద్యోగుల కారణంగానే నష్టాలు వస్తున్నాయని ముద్ర వేయడానికి పెద్ద స్థాయిలో కుట్ర చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్లాంటు డైరెక్టర్లను ఉత్సవ విగ్రహాల్లా మార్చేసి, అన్ని నిర్ణయాలు ఏకపక్షంగా తీసుకుంటున్న ఇన్‌చార్జి సీఎండీని తక్షణమే ఇక్కడి నుంచి పంపించి, ఆ స్థానంలోకి గతంలో పనిచేసి ప్లాంటును లాభాల్లోకి తెచ్చిన బీఎన్‌ సింగ్‌ను స్పెషల్‌ ఆఫీసర్‌గా తేవాలని ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఉక్కు కాంట్రాక్టు

కార్మికుల అవస్థలు

కొంతమందికి ఆరేడు నెలలుగా

అందని జీతాలు

యాజమాన్యం ఇచ్చినప్పుడు ఇస్తాం...

నచ్చితే చెయ్యండి లేదా

మానేయండంటున్న కాంట్రాక్టర్లు

ఉక్కుటౌన్‌షిప్‌, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి):

స్టీల్‌ప్లాంటులో కాంట్రాక్టు కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. ‘యాజమాన్యం బిల్లులు ఇస్తేనే జీతాలు ఇస్తాం. నచ్చితే పనిచేయండి లేదంటే మానేయండి’ అని కాంట్రాక్టర్లు తెగేసి చెబుతున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. స్టీల్‌ప్లాంటులో కాంట్రాక్టు కార్మికులకు జీతాలు సకాలంలో అందడం లేదు. కొన్ని విభాగాల్లో అయితే ఆరేడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. సంబంధిత కాంట్రక్టర్లు పని ప్రదేశానికి రావడం లేదని, ఫోన్‌ చేసినా లిఫ్ట్‌ చేయడం లేదని కార్మికులు చెబుతున్నారు. జీతాల విషయం అధికారులను అడిగినప్పటికీ సరైన సమాధానం చెప్పడం లేదని, బిల్లులు పెట్టామని, యాజమాన్యం ఇస్తే చెల్లింపులు జరుగుతాయని చెబుతున్నారన్నారు. డబ్బుల్లేక పండుగలు కూడా జరుపుకోలేని పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు. ప్రస్తుతం ప్లాంటులో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ సమయంలో పనులకు వెళ్లకపోతే తరువాత పని ఉంటుందో లేదోనన్న ఆందోళనలో కార్మికులు ఉన్నారు. జీతం అందకపోయినా ఉన్న పని మానలేక, ఇతర పనులకు వెళ్లలేక ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు.

Updated Date - Nov 07 , 2024 | 01:24 AM