పాడేరు డిపోనకు 25 కొత్త బస్సులు
ABN, Publish Date - Jan 25 , 2024 | 11:01 PM
పాడేరు డిపోనకు నెల రోజుల్లో 25 కొత్త బస్సులను ఇవ్వనున్నామని ప్రజా రవాణా శాఖ(పీటీడీ) చైర్మన్ ఎ.మల్లికార్జునరెడ్డి తెలిపారు. గురువారం ఆయన పాడేరు డిపోను సందర్శించారు.
నెల రోజుల్లో ఇచ్చేందుకు చర్యలు
కాంప్లెక్స్ ఆధునికీకరణకు కృషి
పీటీడీ చైర్మన్ మల్లికార్జునరెడ్డి
పాడేరురూరల్, జనవరి 25: పాడేరు డిపోనకు నెల రోజుల్లో 25 కొత్త బస్సులను ఇవ్వనున్నామని ప్రజా రవాణా శాఖ(పీటీడీ) చైర్మన్ ఎ.మల్లికార్జునరెడ్డి తెలిపారు. గురువారం ఆయన పాడేరు డిపోను సందర్శించారు. డిపోలో మొక్కను నాటిన అనంతరం అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాడేరు పీటీడీ కాంప్లెక్స్ ఆధునికీకరణకు చర్యలు చేపడతామన్నారు. డిపో కార్మికుల క్వార్టర్స్ మరమ్మతులు చేయించడంతో పాటు అదనపు భవన నిర్మాణానికి రూ.20 లక్షలు, సిబ్బంది విశాంత్రి గది నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు చేశామన్నారు. డిపోలోని 187 మంది ఉద్యోగులు, కార్మికులకు ఉన్ని స్వెట్టర్లు, మంకీ క్యాప్‌లు, గ్లౌజులు అందజేశారు. ఉత్తమ ఉద్యోగులకు ధ్రువపత్రాలను పంపిణీ చేశారు. సమస్యలపై ఎన్‌ఎంయూ నాయకులు, డిపో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇచ్చిన వినతులు స్వీకరించి పరిష్కారానికి చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. అనంతరం చైర్మన్‌ను డిపో ఉద్యోగులు, యూనియన్ నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఈడీ సి.రవికుమార్, డిప్యూటీ సీటీఎం బి.అప్పలనాయుడు, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ దుర్గాప్రసాద్, డీపీటీవో వి.శ్రీనివాస్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అధికారి కేవీఎస్‌ఎన్.రాజు, సిస్టం సూపర్‌వైజర్ బీఆర్‌వీ ప్రసాద్, ఎస్‌డీఐ ఇన్‌స్పెక్టర్ ఎస్‌కే వల్లీ, డిపో యూనియన్ నాయకులు టి.గంగాధరరావు, కేఎస్ చలం, డ్రైవర్లు, మహిళా కండక్టర్లు, గ్యారేజ్ సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Jan 25 , 2024 | 11:01 PM