ఆనంద నిలయం బంగారు దాతలకు వీఐపీ బ్రేక్
ABN, Publish Date - Dec 04 , 2024 | 05:38 AM
తిరుమలలో అర్ధంతరంగా ఆగిపోయిన ‘ఆనందనిలయం అనంతస్వర్ణమయం’ పథకానికి గతంలో విరాళాలిచ్చిన దాతలకు ఇకపై వీఐపీ బ్రేక్ దర్శన సౌకర్యం కల్పించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది.
25 ఏళ్ల పాటు ఈ సౌకర్యం.. టీటీడీ తాజా నిర్ణయం
తిరుమల, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): తిరుమలలో అర్ధంతరంగా ఆగిపోయిన ‘ఆనందనిలయం అనంతస్వర్ణమయం’ పథకానికి గతంలో విరాళాలిచ్చిన దాతలకు ఇకపై వీఐపీ బ్రేక్ దర్శన సౌకర్యం కల్పించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. నవంబరు 18న జరిగిన బోర్డు సమావేశంలో ఈమేరకు తీర్మానం చేశారు. 2008లో రూ.100 కోట్ల వ్యయం అంచనాతో అనంతస్వర్ణమయం ప్రాజెక్టును టీటీడీ ప్రారంభించింది. ఇందుకోసం దాదాపు 95 కేజీల బంగారం, రూ.13 కోట్ల నగదును దాతలు అందజేశారు. అయితే ఆలయ ప్రాకారంపై ఉన్న అత్యంత విలువైన శాసనాలు కనుమరుగైపోతాయంటూ కొంతమంది కోర్టుకు వెళ్లడంతో 2011లో ఈ ప్రాజెక్టుకు బ్రేక్ పడింది. ఈ క్రమంలో మూడు కేజీల బంగారం, రూ.కోటి నగదును దాతలు వెనక్కి తీసుకున్నారు. దాతల కోరిక మేరకు 27 కేజీల బంగారం, రూ.7.25 కోట్ల నగదును ఇతర ప్రాజెక్టులకు మళ్లించారు. ప్రస్తుతం అనంతస్వర్ణమయం ప్రాజెక్టు ఖాతాలో దాదాపు 60 కేజీల బంగారం, రూ.4.61 కోట్ల నగదు ఉంది. 4 కేజీల బంగారాన్ని అనంత స్వర్ణమయం పనుల్లో భాగంగా తొలుత వినియోగించారు. గతంలో ధర్మకర్తల మండలి చైర్మన్‌గా ఉన్న ఆదికేశవుల నాయుడు ఈ ప్రాజెక్టును తెరపైకి తీసుకొచ్చారు.
ఈ పథకానికి విరాళాలిచ్చిన దాతలకు అర్చనానంతర దర్శనం కల్పించాలని 2008 అక్టోబరు 25న టీటీడీ పాలకమండలిలో తీర్మానించారు. కొద్ది కాలం వీరికి దర్శనం కల్పించారు. ఆ తర్వాత వారిని టీటీడీ పట్టించుకోలేదు. ఆదికేశవుల నాయుడు మరణం తర్వాత 2020లో ఆయన కుమారుడు డీకే శ్రీనివాస్ ఈ పథకాన్ని తిరిగి ప్రారంభించాలంటూ జగన్ ప్రభుత్వంలోని టీటీడీ బోర్డు చైర్మన్‌ను, సభ్యులను కలిసి కోరారు. అయితే ఆ ప్రాజెక్టును తిరిగి ప్రారంభించే ఆలోచన లేదని టీటీడీ ప్రకటించింది. దాతలకు దర్శనం వంటి సౌకర్యాలనూ పట్టించుకోలేదు. బీఆర్ నాయుడు అధ్యక్షతన ఏర్పడిన టీటీడీ కొత్త పాలకమండలి ఈ అంశాన్ని మళ్లీ తెరమీదకు తెచ్చింది. ఈ పథక దాతలకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించాలని నిర్ణయించింది. దాత కుటుంబానికి సంబంఽఽధించి ఏడాదికి ఐదుగురికి మూడురోజుల పాటు వీఐపీ బ్రేక్, మూడురోజులు రూ.2,500 విలువ చేసే వసతి, ఏడాదికి 20 చిన్న లడ్డూలు, బహుమానంగా ఓ సారి వస్త్రం, దుపట్టా, బ్లౌజ్, మొదటి దర్శన సమయంలో 5 గ్రాముల బంగారు డాలర్, 50 గ్రాముల వెండి నాణెం ప్రివిలేజ్‌గా ఇవ్వాలని నిర్ణయించారు. విరాళం పాస్‌బుక్ జారీ చేసిన తేదీ నుంచి 25 ఏళ్ల పాటు ఈ సౌకర్యం దాతలకు చెల్లుబాటులో ఉండేలా తీర్మానం చేశారు.
Updated Date - Dec 04 , 2024 | 05:38 AM