TDP Third List: నేడు టీడీపీ మూడో జాబితా.. కీలక మార్పులు
ABN, Publish Date - Mar 22 , 2024 | 03:51 AM
ఏలూరు లోక్‌సభ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పుట్టా మహేశ్ యాదవ్ ఖరారయ్యారు. ఆ పార్టీ వర్గాలు గురువారం ఇక్కడ ఈ విషయం తెలిపాయి.
ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో ప్రకటన
ఏలూరు లోక్‌సభ బరిలో పుట్టా మహేశ్!
హిందూపురంలో పార్థసారథి.. కర్నూలుకు నాగరాజు
బాపట్ల బరిలో మాజీ ఐపీఎస్ కృష్ణప్రసాద్
బాబుతో హైదరాబాద్‌లో పవన్ భేటీ
కొన్ని సీట్లు, అభ్యర్థులపై మంతనాలు
అమరావతి, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): ఏలూరు లోక్‌సభ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పుట్టా మహేశ్ యాదవ్ ఖరారయ్యారు. ఆ పార్టీ వర్గాలు గురువారం ఇక్కడ ఈ విషయం తెలిపాయి. టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడికి మహేశ్ అల్లుడు. మహేశ్ తండ్రి సుధాకర్ యాదవ్ గతంలో టీటీడీ చైర్మన్‌గా పనిచేశారు. గత ఎన్నికల్లో మైదుకూరు అసెంబ్లీ స్థానంలో పోటీచేసిన ఈయన.. ఈసారి కూడా అక్కడే బరిలోకి దిగుతున్నారు. ఏలూరు లోక్‌సభ సీటును ఈ దఫా బీసీలకు ఇవ్వాలని టీడీపీ అధినాయకత్వం భావించింది. మొదట గోపాల్ యాదవ్ అనే ప్రవాసాంధ్రుడి పేరు పరిశీలనకు వచ్చింది. తర్వాత ఆ పేరు వెనక్కి వెళ్లి తాజాగా మహేశ్ యాదవ్ పేరు ఖరారైంది. కాగా.. మాజీ ఎంపీ, సీనియర్ నేత బీకే పార్థసారథిని హిందూపురం లోక్‌సభ స్థానానికి నిలపాలని టీడీపీ నాయకత్వం నిశ్చయించింది. ఆయన గతంలోనూ ఇక్కడి నుంచి లోక్‌సభకు గెలిచారు. అనంతపురం లోక్‌సభ స్థానానికి ఇంకా అభ్యర్థి పేరు ఖరారుకాలేదు. కర్నూలులో కూడా బీసీ అభ్యర్థినే నిలపాలని నిర్ణయించినట్లు సమాచారం. బస్తిపాడు నాగరాజు అనే కురబ సామాజిక వర్గ నేతను ఆ స్థానానికి ఎంపిక చేసినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నారు. నంద్యాల సీటుకు బైరెడ్డి శబరి ఎంపికైనట్లు తెలిసింది. అమలాపురం (ఎస్సీ) ఎంపీ స్థానానికి దివంగత లోక్‌సభ స్పీకర్ బాలయోగి కుమారుడు హరీశ్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. బాపట్ల లోక్‌సభ స్థానానికి తాజాగా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్ పేరు తెరపైకి వచ్చింది. అనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి శమంతకమణికి ఈయన అల్లుడు. తెలంగాణ రాష్ట్రంలో అదనపు డీజీ హోదాలో పనిచేసి రిటైరయ్యారు. విజయనగరం లోక్‌సభ స్థానాన్ని సీట్ల సర్దుబాటులో బీజేపీకి ఇచ్చారు. దానిని వెనక్కి తీసుకుని రాజంపేట ఇవ్వాలని బీజేపీ కోరింది. దీనిపై ఇంకా స్పష్టత రాలేదు.
శ్రీకాకుళం టీడీపీకే.. ఎచ్చర్ల బీజేపీకి?
శ్రీకాకుళం అసెంబ్లీ సీటును గతంలో బీజేపీకి ఇచ్చారు. తాజా పరిణామాల్లో ఆ సీటును టీడీపీయే తీసుకుని దానికి బదులుగా ఎచ్చెర్ల సీటును బీజేపీకి ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
సీట్లపై బాబు-పవన్ చర్చలు
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గురువారం హైదరాబాద్‌లో టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారు. కొన్ని సీట్లలో అభ్యర్థులకు సంబంధించి వారి మధ్య చర్చ జరిగినట్లు చెబుతున్నారు. తిరుపతి అసెంబ్లీ అభ్యర్థి ఎంపిక వ్యవహారం జనసేనలో హాట్ టాపిక్‌గా మారింది. అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులును మార్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయన స్థానంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పేరు కూడా వినవస్తోంది. ఇక కాకినాడ ఎంపీ సీటుకు జనసేన తరఫున ఉదయ్ శ్రీనివాస్ పోటీచేస్తారని పవన్ ఇటీవల ప్రకటించారు. అయితే ఆయన అభ్యర్థిత్వంపై కొందరు టీడీపీ, జనసేన అసెంబ్లీ అభ్యర్థులు అభ్యంతరాలు లేవనెత్తినట్లు సమాచారం. చంద్రబాబు...పవన్ భేటీలో దీనిపై కూడా చర్చ జరిగిందని అంటున్నారు. ఇంకోవైపు.. టీడీపీ అభ్యర్థుల మూడో జాబితా శుక్రవారం విడుదలయ్యే అవకాశం ఉంది. ఆ పార్టీ అభ్యర్థులకు శనివారం విజయవాడలో వర్క్‌షాప్ నిర్వహించబోతున్నారు. దానికి ముందుగానే వీలైనంత మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించాలని ఆ పార్టీ భావిస్తోంది. ఎంపీ అభ్యర్థులు, కొందరు ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు మూడో జాబితాలో ఉండే అవకాశం ఉంది. పొత్తులో భాగంగా టీడీపీ 144 అసెంబ్లీ స్థానాల్లో, 17 లోక్‌సభ సీట్లలో పోటీచేయనుంది.
Updated Date - Mar 22 , 2024 | 07:27 AM