హైకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తులు
ABN, Publish Date - Oct 16 , 2024 | 05:20 AM
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు మరో ముగ్గురు కొత్త న్యాయమూర్తులు రానున్నారు. ప్రస్తుతం ఏపీ హైకోర్టులో సేవలందిస్తున్న ముగ్గురు న్యాయవాదులు కుంచెం మహేశ్వరరావు,
హైకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తులు
న్యాయవాదులు మహేశ్వరరావు,
ధనశేఖర్, గుణరంజన్‌కు అవకాశం
కేంద్రానికి సిఫారసు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం
అమరావతి, న్యూఢిల్లీ, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు మరో ముగ్గురు కొత్త న్యాయమూర్తులు రానున్నారు. ప్రస్తుతం ఏపీ హైకోర్టులో సేవలందిస్తున్న ముగ్గురు న్యాయవాదులు కుంచెం మహేశ్వరరావు, టీసీ ధనశేఖర్, చల్లా గుణరంజన్ పేర్లను ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలో మంగళవారం జరిగిన సమావేశంలో కోలీజియం ఈ నిర్ణయం తీసుకుంది. వీరి నియామకానికి సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 26గా ఉంది. తాజాగా సిఫారసు చేసిన ముగ్గురి నియామకంతో న్యాయమూర్తుల సంఖ్య 29కి చేరనుంది. కాగా, వారిలో జస్టిస్ జి.నరేందర్‌ను ఉత్తరాఖండ్ హైకోర్టు సీజేగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఏపీ హైకోర్టులో 37 మంది జడ్జీల నియామకానికి ఆమోదం ఉంది.
కుంచం మహేశ్వరరావు
కుంచం మహేశ్వరరావు 1973 ఆగస్టు 12న తిరుపతిలో కె.సుశీలమ్మ, కోటేశ్వరరావు దంపతులకు జన్మించారు. తండ్రి కోటేశ్వరరావు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్‌గా పదవీ విరమణ చేశారు. తిరుపతిలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ లా కళాశాలలో న్యాయశాస్త్రం అభ్యసించిన మహేశ్వరరావు.. 1998 ఫిబ్రవరి 2న న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. అనంతపురం జిల్లా కోర్టులో ప్రాక్టీస్ అనంతరం హైకోర్టుకు వచ్చి సీనియర్ న్యాయవాది వేదుల శ్రీనివాస్ వద్ద జూనియర్‌గా చేరారు. ఆ తర్వాత స్వతంత్రంగా ప్రాక్టీస్ ప్రారంభించి.. సివిల్, క్రిమినల్, రాజ్యాంగ సంబంధిత కేసులను వాదించడంలో ప్రావీణ్యం సంపాదించారు. ప్రస్తుతం హైకోర్టు ప్యానల్ అడ్వకేట్‌గా, భారత బార్ కౌన్సిల్, ఎఫ్‌సీఐ, పలు బీమా సంస్థలకు న్యాయవాదిగా సేవలందిస్తున్నారు.
చంద్ర ధనశేఖర్
తూట చంద్ర ధనశేఖర్ 1975 జూన్ 10న శైలజ, చంద్రశేఖరన్ దంపతులకు జన్మించారు. ఆయన స్వగ్రామం తిరుపతి జిల్లా, సత్యవేడు. తండ్రి జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేశారు. నెల్లూరు వీఆర్ న్యాయ కళాశాలలో న్యాయశాస్త్రం అభ్యసించిన ధనశేఖర్ 1999లో న్యాయవాదిగా బార్ కౌన్సిల్‌లో ఎన్‌రోల్ అయ్యారు. మాజీ అడ్వకేట్ జనరల్, సీనియర్ న్యాయవాది పరాంకుశం వేణుగోపాల్ వద్ద జూనియర్‌గా ప్రాక్టీస్ చేశారు. 2019లో ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులై వాణిజ్య పన్నులశాఖ తరఫున వాదనలు వినిపిస్తున్నారు. సివిల్, క్రిమినల్, రెవెన్యూ, ట్యాక్స్, భూసేకరణ చట్టాలకు సంబంధించిన కేసులు వాదించడంలో ఆయనకు మంచి అనుభవం ఉంది.
చల్లా గుణరంజన్
చల్లా గుణరంజన్ 1976 జులై 12న చల్లా చంద్రమ్మ, నారాయణ దంపతులకు జన్మించారు. ఆయన స్వగ్రామం ఉమ్మడి అనంతపురం జిల్లా, తాడిపత్రి. గుణరంజన్ తండ్రి నారాయణ కూడా న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. గుణరంజన్ 2001 మార్చి 21న న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. తన సోదరుడు విశ్రాంత న్యాయమూర్తి చల్లా కోదండరామ్ వద్ద జూనియర్‌గా ప్రాక్టీస్ ప్రారంభించారు. సుప్రీం కోర్టు, ఏపీ, తెలంగాణ హైకోర్టులు, వివిధ ట్రైబ్యునళ్లలో రెండు దశాబ్దాలుగా న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. విద్యుత్, పర్యావరణ, సివిల్, క్రిమినల్, ట్యాక్స్ సంబంధిత కేసులు వాదించడంలో అపార అనుభవం గడించారు.
Updated Date - Oct 16 , 2024 | 05:20 AM