రాష్ట్రంలో 54 కరువు మండలాలు
ABN, Publish Date - Oct 30 , 2024 | 05:11 AM
నిరుడు రాష్ట్రవ్యాప్తంగా సాధారణ స్థాయిలో కూడా వర్షాలు కురవకపోయినా.. గత ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించడానికి మీనమేషాలు లెక్కించింది.
తక్కువ వర్షపాతం నమోదైన మండలాలను ప్రకటించిన ప్రభుత్వం
కలెక్టర్ల ప్రతిపాదనలతో నోటిఫికేషన్ జారీ
అమరావతి, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): నిరుడు రాష్ట్రవ్యాప్తంగా సాధారణ స్థాయిలో కూడా వర్షాలు కురవకపోయినా.. గత ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించడానికి మీనమేషాలు లెక్కించింది. తీవ్ర దుర్భిక్షం నెలకొన్న జిల్లాల్లోనూ మొక్కుబడిగా కరువు మండలాలను ప్రకటించింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం.. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా అధిక వర్షపాతం నమోదైనా.. సగటు వర్షపాతాన్ని పరిగణలోకి తీసుకుని, సాధారణం కన్నా అతి తక్కువ వానలు పడ్డ మండలాలను కరువు మండలాలుగా గుర్తించింది. ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రంలోని 5 జిల్లాల్లో తక్కువ వర్షపాతం నమోదైన 54 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది. ఆయా జిల్లాల కలెక్టర్ల ప్రతిపాదనల మేరకు 27 తీవ్ర కరువు మండలాలుగా, 27 మధ్యస్థ కరువు మండలాలుగా ప్రకటించింది. దీనిపై మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది.
కరువు మండలాలు ఇవే...
అనంతపురం జిల్లా నార్పల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి, ముదిగుబ్బ, తలుపుల, అన్నమయ్య జిల్లా గాలివీడు, చిన్నమండెం, సంబేపల్లి, టి.సుండుపల్లె, రాయచోటి, లక్కిరెడ్డిపల్లి, రామాపురం, వీరబల్లె, తంబళ్లపల్లె, గుర్రంకొండ, కలకడ, పీలేరు, కలికిరి, వాల్మీకిపురం, కురబలకోట, పెద్ద తిప్పసముద్రం, బి.కొత్తకోట, మదనపల్లె, నిమ్మనపల్లె, చిత్తూరు జిల్లా పెనుమూర్, యాదమర్రి, గుడిపాలను తీవ్ర కరువు మండలాలుగా ప్రకటించారు. కర్నూలు జిల్లా కౌతాళం, పెద్ద కడుబూరు, అనంతపురం జిల్లా విడపనకల్, యాడికి, గార్లదిన్నె, బుక్కరాయసముద్రం, రాప్తాడు, శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి, ధర్మవరం, నంబులపులకుంట, గాండ్లపెంట, బుక్కపట్నం, రామగిరి, పరిగి, చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం, చిత్తూరు, శాంతిపురం, రొంపిచర్ల, పూతలపట్టు, సోమల, పుంగనూరు, పలమనేరు, బైరెడ్డిపల్లె, వెంకటగిరికోట, గుడుపల్లె, కుప్పం, రామకుప్పం మధ్యస్థ కరువు మండలాలుగా ప్రకటించారు.
Updated Date - Oct 30 , 2024 | 05:11 AM