అప్పన్న ఆలయంలోనూ అదే తంతు!
ABN, Publish Date - Sep 21 , 2024 | 03:32 AM
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి నాణ్యత లేని నెయ్యిని వినియోగించినట్లు తేలడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రముఖ దేవస్థానాల్లో అలజడి మొదలైంది.
ప్రసాదాల తయారీలో నాణ్యతకు తిలోదకాలు
తక్కువకు కోట్ చేసినవారికే నెయ్యి కాంట్రాక్టు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి నాణ్యత లేని నెయ్యిని వినియోగించినట్లు తేలడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రముఖ దేవస్థానాల్లో అలజడి మొదలైంది. విశాఖలోని సింహాచలం దేవస్థానంలోనూ అతి తక్కువ ఽధరకు వచ్చిన నెయ్యినే వాడుతున్నారని ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలనలో తేలింది. ఇక్కడ ఆరు నెలలకు ఒకసారి టెండర్లు పిలిచి, ఎవరు తక్కువ ధరకు సరఫరా చేస్తామంటే వారికి కాంట్రాక్టు ఇచ్చేస్తున్నారు. ఈ క్రమంలో నాణ్యత గురించి పట్టించుకోవడం లేదు. సింహాచలం దేవస్థానానికి శ్రీ విజయ విశాఖ మిల్క్ ప్రొడ్యూసర్స్ ప్రైవేటు లిమిటెడ్ (విశాఖ డెయిరీ) చాలాకాలంగా నెయ్యి సరఫరా చేస్తోంది. 2020-21 లో కిలో ధర రూ.591 లెక్కన 54వేల కిలోలు, 2021-22లో 59,250 కిలోలు అందించింది. 2022-23లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రీమియర్ ఆగ్రోటెక్ ఫుడ్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ కిలో రూ.393.30కే ఇస్తామని టెండర్ వేయడంతో వారికి కాంట్రాక్టు ఇచ్చి 54వేల కిలోల నెయ్యి కొనుగోలు చేశారు. దాని డైరెక్టర్లంతా హిందూయేతరులేనని ఆ సంస్థ వెబ్‌సైట్‌లో చూపిస్తోంది. ఇక 2023-24లో విశాఖలోనే సూర్యకుమారి ఏజెన్సీస్ కిలోకు రూ.529 కోట్ చేయగా వారికి కాంట్రాక్టు ఇచ్చారు. ఆ సంస్థ 26,430 కిలోలు సరఫరా చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) కాంట్రాక్టును గోదావరి జిల్లాలకు చెందిన రైతు డెయిరీ సంస్థ దక్కించుకుంది. ఈ సంస్థ కిలో రూ.344కే కోట్ చేసింది. వారినుంచి 47,175 కిలోల నెయ్యికి ఆర్డర్ ఇచ్చారు. వాస్తవానికి విశాఖ డెయిరీ నెయ్యి కిలో రూ.660 చొప్పున మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. టోకున తీసుకుంటున్నారనే ఉద్దేశంతో కిలో రూ.591కే దేవస్థానానికి గతంలో సరఫరా చేశారు. కాగా, సింహాచలం దేవస్థానం ప్రసాదాల్లో నాణ్యత లేదని చాలాకాలంగా భక్తులు ఆరోపిస్తున్నా అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు తక్కువ ఖరీదు నెయ్యి వినియోగిస్తున్నారని తెలియడంతో సమర్థించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. సరఫరాదారు నుంచి నాణ్యత సర్టిఫికెట్ తీసుకుంటామని, చినవాల్తేరులోని లేబొరేటరీకి పంపించి, నాణ్యతను పరీక్షించాకే తీసుకుంటామని చెబుతున్నారు. అయితే ఇక్కడి ప్రభుత్వ లేబొరేటరీలో నామమాత్రంగా పరీక్షలు చేసి నివేదిక పంపుతున్నారనే విమర్శలున్నాయి. ఆ లేబొరేటరీ నివేదికను ప్రామాణికంగా తీసుకొని సింహాచలం దేవస్థానం నెయ్యిని కొనుగోలు చేయడమేంటనే ప్రశ్న వినిపిస్తోంది.
Updated Date - Sep 21 , 2024 | 03:32 AM