ఊరు మారలేదు!
ABN, Publish Date - Jan 18 , 2024 | 03:45 AM
ఊరు మారలేదు! దాని తీరూ మారలేదు! ఐదేళ్ల క్రితం వేసిన సిమెంట్ రహదారులే తప్ప జగన్ హయాంలో వేసిన రోడ్లే లేవు. అభివృద్ధి లేదు. అయినా సరే..
ప్రకటనల్లో ఉన్నంత విషయం పల్లెల్లో ఎక్కడబ్బా!
జగన్ రోత పత్రిక ప్రకటనపై ఇప్పుడు ఇదే చర్చ
ఐదేళ్ల క్రితం వేసిన రోడ్లే ఇప్పటికీ పల్లెల్లో దిక్కు
పంచాయతీలకు నిధులివ్వకుండా ఎండబెట్టిన వైనం
పొంగిపొర్లుతున్న డ్రైనేజీ.. అడుగడుగునా మురుగు
సచివాలయాలు, ఆర్‌బీకేలు, డిజిటల్ లైబ్రరీల కోసం
చేపట్టిన భవనాలు చాలావరకు శ్లాబు దశలోనే..
అయినా ‘పల్లెకు పండగ’ అంటూ కోట్లు వెచ్చించి ప్రకటన
‘ఊరు మారిందోచ్..’ అంటూ ఊరూవాడా బాకా
ఊరు మారలేదు! దాని తీరూ మారలేదు! ఐదేళ్ల క్రితం వేసిన సిమెంట్ రహదారులే తప్ప జగన్ హయాంలో వేసిన రోడ్లే లేవు. అభివృద్ధి లేదు. అయినా సరే... ‘ఊరు మారింది’ అంటూ జగన్ సర్కారు ఊదరగొడుతోంది. సచివాలయాలు, ఆర్‌బీకేలు, వెల్‌నెస్ సెంటర్లు, డిజిటల్ గ్రంథాలయాలు, ఇతర భవనాలతో గ్రామాల రూపు రేఖలు మారిపోయాయని సంక్రాంతి సందర్భంగా జగన్ రోత పత్రికలో జనం సొమ్ముతో ప్రకటన ఇచ్చారు. పల్లెలు పండగ చేసుకుంటున్నాయని ప్రచారం హోరెత్తించారు. కానీ, ఆ ‘ప్రకటనల్లో ఉన్నంత విషయం పల్లెల్లో ఎక్కడుందబ్బా’ అంటూ ఎక్కడికక్కడ జనం చర్చించుకుంటున్నారు. గ్రామాల్లో వైసీపీ నేతలు కూడా జగన్ ‘అభివృద్ధి’ బాకాపై కారాలు మిరియాలు నూరుతున్నారు. ‘‘శ్మశానాల్లో కాపురంలా ఉంది జగనన్న అభివృద్ధి’ అంటూ వైసీపీ గ్రామ స్థాయి నేత రాజన్న ‘ఐ ప్యాక్’ సభ్యుడితో కుండబద్ధలు కొట్టిన సంగతి తెలిసిందే. మచ్చుకు కొన్ని గ్రామాలను
‘ఆంధ్రజ్యోతి’ పరిశీలించగా
జగన్ పాలనలో ఊళ్లు ఎంత
దయనీయంగా ఉన్నాయో తేలిపోయింది.
తుప్పల్లో నిర్మాణాలు తుప్పు పట్టి..
కృష్ణాజిల్లా నాగాయలంక మండలం భావదేవరపల్లి పంచాయతీలో సచివాలయం పనులు మొదలై ఏళ్లు గడిచిపోయాయి. కానీ, ఇంకా ఆ భవన నిర్మాణం ప్రాథమిక దశలోనే ఉంది. బేస్‌మెంట్ పూర్తయి, పిల్లర్లు లేశాక పనులు ఆగిపోయాయి. ఇప్పుడు చూస్తే.. పిల్లర్ల ఇనుపచువ్వలు తుప్పు పడుతున్నాయి. లోపల, బయట పిచ్చిచెట్లు మొలిచి పాత భవనంలా దర్శనిమిస్తోంది. రైతు భరోసా కేంద్ర భవనానికి స్థలం చూపించినా, ఆ ప్రాంతంలో నిర్మాణపనులు ప్రారంభం కాలేదు. గ్రామంలోని సామాజిక భవనంలో ఆర్‌బీకేను నిర్వహిస్తున్నారు. వెల్‌నెస్ సెంటర్ భవనాన్ని నిర్మించారు కానీ, ఇంకా తుదిమెరుగులు దిద్దలేదు. తుఫాను రక్షిత భవనంలో విధులను నిర్వర్తిస్తున్నారు. మండల కేంద్రంలో నిర్మించాల్సిన డిజిటల్ గ్రంథాలయానికి స్థ్థలం దొరకక, భావదేవరపల్లిలో నిర్మిస్తున్నారు. స్లాబ్ పూర్తయింది. గ్రామంలో పలు అభివృద్ధి పనులు నత్తనడకన నడుస్తుంటే...పల్లెలో సమగ్రాభివృద్ధి జరిగిపోయిందని పాలకులు తమ పత్రికలో ప్రకటనలు ఇవ్వటం హాస్యాస్పదంగా ఉందని సర్పంచ్ ఉదయభాస్కర్ విమర్శించారు.
సిద్ధమైన భవనాలూ చెరలోనే!
కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పూడిచెర్ల గ్రామానికి అభివృద్ధి అంటే.. ఐదేళ్ల క్రితం వేసిన ‘చంద్రన్న బాట’ రహదారులే కనిపిస్తున్నాయి. జగన్ పాలనలో 350 మందికి ఇంటి స్థలాలు ఇచ్చారు. కానీ వాటికి నేటికీ లేఅవుట్ వేయలేదని, కనీసం స్థలాలు కూడా చూపలేదని ప్రజలు తెలిపారు. మంత్రి గుమ్మనూరు జయరాం ప్రాతినిథ్యం వహిస్తున్న ఆలూరు నియోజకవర్గం మూసానహళ్లి గ్రామ జనాభా 2,340 మంది. రూ.14 లక్షలతో ఆర్‌బీకే కేంద్రం నిర్మించినా, ఫైనల్ బిల్లు రాకపోవడంతో భవనాన్ని కాంట్రాక్టర్ స్వాధీనం చేయలేదు. రూ.40 లక్షలతో నిర్మించిన సచివాలయం నూతన భవనం తుదిదశలో బిల్లు రాక ప్రారంభానికి నోచుకోలేదు. రూ.14లక్షలతో మంజూరైన విలేజ్ క్లినిక్ అర్ధంతరంగా నిలిచిపోయింది. గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైయిన్ల నిర్మాణం కోసం ఎన్‌ఆర్‌ఈజీఎ్‌స నిధులు రూ.60 లక్షలు ఖర్చు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అయినా, ఏ వీధికి వెళ్లినా, రోడ్లపై మురుగు ప్రవహిస్తోంది. గ్రామంలో మొత్తం 28 జగనన్న ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో చాలా ఇళ్లు మొండి గోడలు, బేస్‌మెంట్ లెవెల్‌లోనే నిలిచిపోయాయి. ప్రాథమిక పాఠశాలకు రెండు అదనపు గదులు, వంట గది, నిర్మాణం కోసం రూ.16 లక్షలు మంజూరు కాగా, బిల్లులు మంజూరుకాక నిర్మాణ పనులు ఆగిపోయాయి.
పట్టా ఇచ్చారు.. ఇల్లు మరిచారు..
శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం పరిధిలోని రొళ్ల మండలం మల్లినమడుగు గ్రామానికి చెందిన రామాంజినమ్మకు జగన్ ప్రభుత్వం ఇంటిపట్టా ఇచ్చింది. కానీ ఇల్లు మంజూరు చేయలేదు. దీంతో ఆమె నేటికీ పూరిగుడిసెలోనే జీవనం సాగిస్తోంది. ఈ గ్రామంలో ఇప్పటికీ మట్టి రోడ్లే దర్శనమిస్తున్నాయి. గుక్కెడు రక్షిత మంచినీటికి నోచుకోలేని దయనీయ స్థితిలో గ్రామ ప్రజలున్నారు. మల్లిమడుగు గ్రామంలో దాదాపు 800 కుటుంబాలు ఉన్నాయి. ఇళ్లులేనివారికి స్థలాల పట్టాలిచ్చారేగాని, ఇళ్ల నిర్మాణాలు చేపట్టలేదు. సచివాలయం, బల్క్‌కూలింగ్ సెంటర్, రైతుభరోసా కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్ తదితర భవనాల నిర్మాణాలను ప్రారంభించారేగాని.. ఇప్పటికీ పూర్తి చేయలేదు. భవనాలన్నీ మొండిగోడలకే పరిమితమయ్యాయి. కొన్ని భవనాలు పునాదుల వద్దే నిలిచిపోయాయి. నిధులలేమితో రెండేళ్లుగా వాటి గురించి పట్టించుకోవడం లేదు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో లక్షలాది రూపాయల ఖర్చులతో చేపట్టిన ఓహెచ్‌ఆర్ నిర్మాణం, శుద్ధజల నీటి పథకం పనులను వైసీపీ ప్రభుత్వం వచ్చాక విస్మరించారు.
జగనన్నా మా ఊరు మారలేదు
వైసీపీ పాలనలో పల్లెలు మారిపోయాయని ప్రభుత్వం సొంత పత్రికలో వస్తున్న ప్రకటనలు చూసి ప్రజాప్రతినిధులు, ప్రజలు నవ్వుకుంటున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికిచ్చే నిధులను పంచాయతీలకు ఇవ్వకుండా ఎలా దొంగిలించిందో అందరికీ తెలుసు. ఉపాధి నిధులు కూడా పక్కదారి మళ్లించటంతో అభివృద్ధి పథకాలు మధ్యలోనే ఆగిపోయాయి. మా ఊరు మారలేదు...మా పల్లెల్లో అభివృద్ధి జరగలేదు.
- మండలి ఉదయ భాస్కర్, సర్పంచ్,
భావదేవరపల్లి, నాగాయలంక, కృష్ణాజిల్లా..
పిల్లలు బడికి వెళ్లేదెలా?
శ్రీకాకుళం జిల్లాలో బహుదా నదిపై టీడీపీ ప్రభుత్వం హయాంలో రూ.7.5 కోట్ల వ్యయంతో వంతెన పనులను ప్రారంభించారు. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. ఇప్పటివరకు బహుదా వద్ద సగం పనులు కూడా చేయలేకపోయారు. వంతెన పూర్తికాకపోవడంతో పక్కగ్రామంలో ఉన్న కొలిగాం ఉన్నత పాఠశాలకు వెళ్లేందుకు విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం మండలం వెంకటాపురం పంచాయతీని, కొత్తూరు పంచాయతీని కలిపి ఒక సచివాలయాన్ని ఏర్పాటుచేశారు. కానీ, సచివాలయ భవన నిర్మాణం చేపట్టలేదు. వెంటకటాపురం గ్రామంలో ప్రజలు తాగునీరు లేక ఇబ్బందిపడుతున్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఏర్పాటుచేసిన సోలార్ పథకం ద్వారా తాగునీరు సరఫరా అవుతోందని.. ఎండ ఉంటేనే మోటార్ పనిచేస్తుందని.. లేకుంటే పాఠశాలకు చెందిన బోరు నుంచి నీటిని తెచ్చి వినియోగిస్తున్నామని ప్రజలు వాపోతున్నారు. కొత్తూరు గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేదు. ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కోసం వచ్చిన స్థానిక ఎమ్మెల్యే రెడ్డిశాంతికి రోడ్డు మంజూరుచేయాలని గ్రామస్థులు కోరినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. మర్రివలస పంచాయతీలో మాకివలస, జమ్మినివలస, గార్నివలస గ్రామాలున్నాయి. గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య ఉపకేంద్రం భవనాలు నిర్మాణాలకు నిధులు మంజూరు చేశారు కానీ.. పనులు పూర్తిస్థాయిలో ప్రారంభించలేదు. సకాలంలో బిల్లులు చెల్లింపులు జరగకపోవడమే కారణం. గిరిజన గ్రామమైన మాకివలసకు వెళ్లేందుకు సరైన మార్గం లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వంశధార ఎడమ ప్రధానకాలువలపై అప్పట్లో కాలిబాట నిర్మించారు. దీనిపై నాలుగు చక్రాల వాహనాలు వెళ్లడానికి వీలు లేక పోవడంతో అత్యవసర సమయాల్లో ఆస్పత్రులకు వెళ్లడానికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. కాలిబాట స్థానంలో వంతెన నిర్మాణానికి ప్రజాప్రతినిధులు చర్యలు చేపట్టకపోవడం పట్ల గిరిజనులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - Jan 18 , 2024 | 03:45 AM