TCS : విశాఖకు టీసీఎస్
ABN, Publish Date - Oct 10 , 2024 | 04:10 AM
రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖపట్నానికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) రానుంది. పది వేల మందికి ఉపాధి కల్పించే భారీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయబోతోంది.
10 వేల మందికి ఉపాధి
‘టాటా సన్స్’ చంద్రశేఖరన్‌తో లోకేశ్
భేటీ అయిన 24 గంటల్లోనే భారీ ప్రకటన
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లక్ష్యంగా
పెట్టుబడులకు సానుకూల వాతావరణం
ఆంధ్రను నంబర్ వన్‌గా చేస్తాం: లోకేశ్
అమరావతి, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖపట్నానికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) రానుంది. పది వేల మందికి ఉపాధి కల్పించే భారీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఈ విషయాన్ని ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేశ్ ప్రకటించారు. మంగళవారం ముంబైలో టాటా సన్స్ బోర్డు చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌తో చర్చలు జరిపిన అనంతరం బుధవారం భారీ ప్రకటన రాబోతోందని ‘ఎక్స్’లో ఆయన వెల్లడించిన సంగతి తెలిసిందే. 24 గంటల్లోపే విశాఖలో టీసీఎస్ కార్యాలయం ఏర్పాటు కానుందని ప్రకటించడం విశేషం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లక్ష్యంగా కార్పొరేట్ల పెట్టుబడులకు అత్యుత్తమమైన సానుకూల వాతావరణం కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని లోకేశ్ తెలిపారు. వ్యాపారంలో రాష్ట్రాన్ని నంబర్‌వన్‌గా తీర్చిదిద్దే క్రమంలో టీసీఎస్ పెట్టుబడిని ముఖ్యమైన మైలురాయిగా అభివర్ణించారు. రాష్ట్రంలో ఐటీ రంగం పునరుజ్జీవం దిశగా ఇది కీలకమైన ముందడుగని ఐటీ వర్గాలు కూడా అంటున్నాయి. కాగా.. సీఎంవో అదనపు కార్యదర్శి కార్తికేయ మిశ్రాతో కలిసి లోకేశ్ మంగళవారం ముంబైలో చంద్రశేఖరన్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అమలు చేస్తున్న సులభతర వాణిజ్య, వ్యాపార, పారిశ్రామి విధానాలను ఈ సందర్భంగా ఆయనకు వివరించారు. దేశవ్యాప్తంగా పారిశ్రామిక ప్రోత్సాహానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినె్‌సను అమలు చేస్తుండగా.. రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తీసుకొస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో ఆ దిశగా పెట్టుబడులు రప్పించడంపై ప్రత్యేక చొరవ చూపుతున్నామని లోకేశ్ వెల్లడించారు. ఐటీ, ఎలకా్ట్రనిక్స్ రంగాలకు రాష్ట్రాన్ని కేంద్రంగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా తెలుగువాళ్లు కనిపిస్తారని. ఆంగ్లం, గణితంలో చురుగ్గా, లాజిక్‌లో దిట్టలుగా ఉంటారని చంద్రశేఖరన్‌తో అన్నారు. మరోవైపు.. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ క్రమంగా గమ్యస్థానంగా మారుతోంది. ఇప్పటికే లులూ, ఒబెరాయ్, బ్రూక్‌ఫీల్డ్, సుజలాన్ వంటి సంస్థలు ముందుకొచ్చాయి. తాజాగా టీసీఎస్ కూడా తన కార్యకలాపాలు ప్రారంభించేందుకు సంసిద్ధం కావడంతో విశాఖ ఐటీ హబ్‌గా రూపురేఖలు మార్చుకోనుందని, దానికి టీసీఎస్ మణిహారంగా మారుతుందని ఐటీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
Updated Date - Oct 10 , 2024 | 06:21 AM