అంగన్వాడీలకు మద్దతుగా రేపు రాష్ట్ర బంద్
ABN, Publish Date - Jan 23 , 2024 | 02:53 AM
రాష్ట్రంలో 42 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు సంఘీభావంగా ఈ నెల 24వ తేదీన రాష్ట్ర బంద్‌కు అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు పిలుపునిచ్చాయి.
నిరవధిక దీక్షా శిబిరంపై పోలీసుల పాశవిక దాడి గర్హనీయం
రాజకీయ పార్టీలు బంద్‌కు సంఘీభావం ప్రకటించాలి
అఖిలపక్ష కార్మిక సంఘాల పిలుపు
అమరావతి, జనవరి 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 42 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు సంఘీభావంగా ఈ నెల 24వ తేదీన రాష్ట్ర బంద్‌కు అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌ను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింగరావు, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రవీంధ్రనాథ్, ఐఎఫ్టీయు రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్, టీఎన్టీయుసీ రాష్ట్ర అధ్యక్షులు రఘురామరాజు, ఐఎన్‌టీయుసీ రాష్ట్ర నాయకులు క్రాంతి కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. లక్షా ఐదు వేల మంది అంగన్వాడీ మహిళా శ్రామికుల జీతభత్యాలు, పనిభారం తదితర సమస్యలపై సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయు అనుబంధ అంగన్వాడీ సంఘాల ఆధ్వర్యంలో గత 42 రోజులుగా సమ్మె చేస్తున్నారని వారు తెలిపారు. వారి డిమాండ్లకు మద్దతుగా ప్రజల నుంచి సేకరించిన కోటి సంతకాలను జగన్‌కు సమర్పించడానికి విజయవాడ వస్తున్న అంగన్వాడీలపై పాశవికంగా పోలీసులతో దాడి చేయించారని పేర్కొన్నారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడానికి బదులు ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం అత్యంత నిరంకుశమని స్పష్టం చేశారు. పైగా సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు విజయవాడలో నిరవధిక నిరాహార దీక్షలు చేస్తున్న శిబిరంపై పోలీసులు పాశవికంగా దాడులు చేశారని, దీక్షల్లో ఉన్న నాయకులను దూరప్రాంతాలకు తరలించి నిర్బంధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీక్షలో ఉన్న వారి ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా... కరెంటు తీసివేసి ఆడవాళ్లను కూడా మగ పోలీసులే లాగిపారేసి అదుపులోకి తీసుకుని దీక్షా శిబిరం వద్ద అరగంటపాటు యుద్ధభూమిని తలపించారని ధ్వజమెత్తారు. దీక్షలకు మద్దతుగా పాల్గొన్న సుమారు 2 వేల మందిని అరెస్టు చేసి మచిలీపట్నం, నూజివీడు తదితర సుదూర ప్రాంతాలకు తరలించారన్నారు.
Updated Date - Jan 23 , 2024 | 02:53 AM