ఇలానే వదిలేస్తారా?
ABN, Publish Date - Jan 18 , 2024 | 11:29 PM
పార్వతీపురం పట్టణానికి తాగునీరు సరఫరా చేసేందుకు కొనుగోలు చేసిన పైపులు గత కొద్ది నెలలుగా ఇలా వృథాగానే దర్శనమిస్తున్నాయి.
గరుగుబిల్లి, జనవరి 16: పార్వతీపురం పట్టణానికి తాగునీరు సరఫరా చేసేందుకు కొనుగోలు చేసిన పైపులు గత కొద్ది నెలలుగా ఇలా వృథాగానే దర్శనమిస్తున్నాయి. దీంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణానికి సంబంధించి తోటపల్లి ప్రాజెక్టు దిగువ భాగంలో ఉన్న ప్రధాన పైపులైన్ నుంచి తాగునీటి సరఫరాకు కొన్నాళ్లుగా పనులు చేపడుతున్నారు. దీనిలో భాగంగా సుమారు రూ. 3.25 కోట్లతో ఈ పైపులును కొనుగోలు చేశారు. గరుగుబిల్లి మండలం సుంకి నుంచి అడ్డాపుశీల మీదుగా పార్వతీ పురం పట్టణానికి ఆ పైపులు ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో ఉన్న పురాతన పైప్‌ల వల్ల తరచూ లీకేజీ సమస్య ఎదురవుతోంది. ఎప్పటికప్పుడు మర్మమతులు తప్పడం లేదు. దీంతో పట్టణ శివారు ప్రాంతాలకు తాగునీరు అందడం లేదు. ఈ నేపథ్యంలో యుద్ధప్రాతిదికన తాగునీటి పైపులైన్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా.. ఆ దిశగా చర్యల్లేవు. వాస్తవంగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరయ్యాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకానికి శంకస్థాపన చేసినప్పటికీ.. నిధుల కొరతతో ఎక్కడి పనులు అక్కడే నిలిచాయి గతంలో చేసిన పనులకు చెల్లింపులు కాకపోవ డంతో కాంట్రాక్టర్లు కూడా దృష్టి సారించడం లేదు. దీంతో పైపులు ఇలా నిరుపయోగంగా మారాయి. దీనిపై పార్వతీపురం కమిషనర్ రామప్పలనాయుడును వివరణ కోరగా.. మున్సిపాలిటీలో తాగునీటి సరఫరాకు ఆటంకం లేకుండా చర్యలు చేపడతామని తెలిపారు. సంబంధిత ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు (ఏవీవీబీ) ప్రాజెక్టు పనులను సకాలంలో పూర్తి చేస్తామన్నారు. నిధుల సమస్య కారణంగానే కొంతమేర పనుల్లో జాప్యం నెలకొందని చెప్పారు.
Updated Date - Jan 18 , 2024 | 11:29 PM