ఆరేళ్లయినా..
ABN, Publish Date - Oct 11 , 2024 | 12:27 AM
ఉద్దానం ప్రజలు.. ప్రళయం అంటే ఏమిటో 1999లో వచ్చిన తుఫాన్ రూపంలో చూశారు. 2014లో హుద్‌హుద్ తుఫాన్ బీభత్సాన్ని ఎదుర్కొన్నారు. కానీ 2018లో తితలీ తుఫాన్ సృష్టించిన విధ్వంసంతో తీవ్రంగా నష్టపోయి.. ఇప్పటికీ కోలుకోలేకపోతున్నారు.
- తితలీ విలయం నుంచి కోలుకోని ఉద్దానం
- పరిహారం కోసం బాధితుల ఎదురుచూపు
(పలాస)
ఉద్దానం ప్రజలు.. ప్రళయం అంటే ఏమిటో 1999లో వచ్చిన తుఫాన్ రూపంలో చూశారు. 2014లో హుద్‌హుద్ తుఫాన్ బీభత్సాన్ని ఎదుర్కొన్నారు. కానీ 2018లో తితలీ తుఫాన్ సృష్టించిన విధ్వంసంతో తీవ్రంగా నష్టపోయి.. ఇప్పటికీ కోలుకోలేకపోతున్నారు. తితలీ దెబ్బకు ఉద్దానం.. కన్నీటి సంద్రమైంది. వంశధార, నాగావళి నదులు ఉప్పొంగి అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గాలుల ధాటికి విద్యుత్ స్తంభాలు కూలి.. వందలాది గ్రామాలు దాదాపు వారం రోజులు చీకట్లోనే మగ్గాయి. రహదారులపై భారీ వృక్షాలు నేలకొరిగి రాకపోకలు స్తంభించిపోయాయి. వేలాది కొబ్బరి చెట్లు నేలమట్టమై.. ఉద్దాన ప్రాంతమంతా అతలాకు తలమైంది. ఆ విలయం వచ్చి నేటికి ఆరేళ్లు పూర్తయి నా.. ఉద్దానం వాసులకు తితలీ భయం వెంటాడు తూనే ఉంది.
.....................
ఉద్దానం ప్రాంతంలో 2018 అక్టోబరు 11న తితలీ తుఫాన్ విధ్వంసం సృష్టించింది. ఈ ప్రళయం వచ్చి ఆరేళ్లు పూర్తవుతున్నా.. ఇంకా తితలీ నష్టం ప్రజల కళ్లముందే కనిపిస్తోంది. ఉద్దానం ప్రాంతానికి తితలీ ప్రభావం ఎక్కువగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం సైతం ముందస్తు హెచ్చరికలు జారీచేసింది. ఆ రోజు రానే వచ్చింది. నిశిరాత్రి అంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో రాత్రి 2గంటల తరువాత తుఫాన్ ప్రళయంగా మారింది. ఒకటి కాదు, రెండుకాదు ఏడుగంటలపాటు పెనుగాలులు, భారీ వర్షంతో ఉద్దానం ప్రాంతం అంతా ధ్వంసమైంది. వజ్రపుకొత్తూరు మండలంలో పల్లిసారధి నుంచి అలా కొనసాగుతూ పలాస-కాశీబుగ్గ జంటపట్టణాల వరకూ తుఫాన్ ప్రభావం చూపింది. పలాస-కాశీబుగ్గ, వజ్రపుకొత్తూరు, మందస, సోంపేట, కవిటి, ఇచ్ఛాపురం, కంచిలి, నందిగాం మండలాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. సముద్ర తీరానికి పది కిలోమీటర్ల దూరంలో పలాస-కాశీబుగ్గ జంట పట్టణాలు దెబ్బతిన్నాయి. 70-160 కిలోమీటర్ల వాయువేగంతో ఈదురుగాలులు రావడంతో చెట్లన్నీ నేలకూలాయి. జాతీయ రహదారిపై నిలిపిన లారీలు సైతం బోల్తాపడ్డాయి. పచ్చగా కళకళలాడే పలాస రైల్వేకాలనీలోనే ఐదువేలకుపైగా చెట్లు ధ్వంసమయ్యాయి. వందలాది విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. రేకుల గృహాలు నేలమట్టమయ్యాయి. దీంతో రైల్వే ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. తితలీ ప్రభావంతో స్టేషన్ అంతా సర్వనాశనమైంది. మొత్తం 4 ప్లాట్‌ఫారాల్లో ఉన్న రూఫ్‌లన్నీ గాలికి ఎగిరిపోయాయి. స్టేషన్ మేనేజర్ రైళ్లను కంట్రోల్ చేసే ప్యానల్ సెక్షన్ మొత్తం ధ్వంసమైపోయింది. కనివినీ ఎరుగని రీతిలో అతలాకుతలం కావడంతో ఆ ప్రాంతమంతా స్మశాన వాతావరణంగా కనిపించింది.
- వజ్రపుకొత్తూరు మండలంలోని తీర ప్రాంతం అతలాకుతలమైంది. తుఫాన్ ధాటికి చెట్లన్నీ నేలమట్టం కాగా అనేక పశువులు మృత్యువాతపడ్డాయి. రోడ్డుపైన భారీ చెట్లు నేలకొరగడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
- అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హుటాహుటిన పలాస చేరుకొని తుఫాన్ బాధితులను ఆదుకునే ప్రయత్నం చేశారు. మొత్తం వారం రోజుల పాటు రాజధానిని పలాస మునిసిపల్ కార్యాలయానికి తరలించేలా మొత్తం అధికారులు, మంత్రులందర్ని ఒకేదగ్గరకు చేర్చి సహాయక చర్యలు చేపట్టారు. మొత్తం నెలరోజుల్లో ఉద్దానం ప్రాంతాన్ని పునరుద్ధరించడం విశేషం.
- తితలీ తుఫాన్ కారణంగా 16వేల ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. 45వేల హెక్టార్లల్లో జీడి, కొబ్బరి పంట నేలకొరిగింది. 7వేల విద్యుత్ స్తంభాలు కూలిపోగా, 200కుపైగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. ఒక్క విద్యుత్‌శాఖకు రూ.50కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్లు అంచనా. 2వేల కోట్లకుపైగా నష్టం అంచనా వేశారు. ప్రత్యామ్నాయంగా రైతులకు ఉచితంగా జీడి, కొబ్బరి మొక్కలు అందించినా ఆశించినంత ఫలితాలు రాలేదు. ఆరేళ్లవుతున్నా ఇంకా ఉద్దానంలో అనేక గ్రామాలు కోలుకోలేని పరిస్థితి ఉంది. ఆ నీడలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి.
కొందరికి అందని పరిహారం
నాడు తక్షణ సహాయంగా అప్పటి టీడీపీ ప్రభుత్వం రూ.550కోట్లు విడుదల చేసింది. కాగా.. బినామీల జోక్యంతో ఇంకా ఏడువేల మంది బాధితులకు నష్టపరిహారం అందని దుస్థితి నెలకొంది. వారంతా ఇప్పటికీ పరిహారం కోసం ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని.. ప్రస్తుత కూటమి ప్రభుత్వమైనా న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.
- అలాగే తితలీ దెబ్బకు పలాస-కాశీబుగ్గలోని జీడిపరిశ్రమలకు రూ.150కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. అధికారులు పరిశ్రమలను పరిశీలించి.. ప్రాథమికంగా నష్టం అంచనా వేశారు. అప్పట్లో రాయితీలు, కొత్తరుణాలు, బీమా మొత్తం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. కానీ ఇంతవరకూ ఎటువంటి పరిహారం అందజేయలేదని జీడి వ్యాపారులు వాపోతున్నారు.
బాధితులకు న్యాయం చేయాలి
తితలీ తుఫాన్ కోలుకోలేని నష్టం మిగిల్చింది. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ప్రభుత్వం స్పందించాలి. కాని ఇంకా 7వేల మందికి నష్టపరిహారం అందలేదు. దీనిపై గత వైసీపీ ప్రభుత్వంతోపాటు ప్రస్తుత కూటమి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాం. వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వమైనా స్పందించి బాధిత రైతులకు న్యాయం చేయాలి.
- మద్దిల రామారావు, రైతుసంఘ నాయకుడు, బొడ్డపాడు
........................
ఇంకా కళ్లెదుటే..
తితలీ తుఫాన్.. ఇంకా కళ్లెదుట కనిపిస్తూనే ఉంది. తుఫాన్ అనంతరం గ్రామాల్లో నేరుగా తిరిగి ప్రజలు ఎదుర్కొన్న కష్టాలు చూశాను. భవిష్యత్తులో కూడా ఇటువంటి విపత్తులు రాకూడని కోరుకుంటున్నాను. జీడి, కొబ్బరి చెట్లు మొత్తం నాశనం కాగా ఉద్దానం గ్రామాల్లో ఇప్పటికీ వాటి జాడలు కనిపిస్తునే ఉన్నాయి. ప్రభుత్వ సహాయం కొంతమందికే అందింది. వివరాలు ఇప్పటికే జిల్లా అధికారుల వద్ద ఉన్నాయి. మిగిలిన వారికి కూడా పరిహారం అందించాలి.
- మద్దిల వినోద్‌కుమార్, విద్యార్థి సంఘ నాయకుడు
Updated Date - Oct 11 , 2024 | 12:27 AM