గిరిజనం.. అభివృద్ధికి దూరం
ABN, Publish Date - Nov 25 , 2024 | 11:46 PM
తరాలు.. ప్రభుత్వాలు.. మారుతున్నా గిరిజన ప్రాంతాలు మాత్రం అభివృద్ధికి నోచుకోవడం లేదు. వారి ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా చట్టాలు రూపొందించినా.. నిరక్షరాస్యత, అవగాహన లోపంతో అవి సక్రమంగా అమలు కావడం లేదు.
- సక్రమంగా అమలుకాని చట్టాలు
- అవగాహన లోపంతో వెనుకబాటు
- హక్కుల కోసం ఏళ్లుగా పోరాటం
- నేడు రాజ్యాంగ దినోత్సవం
మెళియాపుట్టి, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): మెళియాపుట్టి మండలం దబ్బగూడలో 14 మంది విద్యార్థులు ఉన్నారు. కనీసం ఇక్కడ పాఠశాల భవనం లేదు. దీంతో గిరిజన సామాజిక భవనంలో ఓవైపు మండల పరిషత్ పాఠశాల తరగతులు, మరోవైపు అంగన్‌వాడీ కేంద్రం నిర్వహిస్తున్నారు. గిరిజనుల విద్యాహక్కు చట్టప్రకారం వసతులు కల్పించాల్సి ఉంది. కానీ, గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. పాఠశాలల భవనాల నిర్మాణానికి సైతం నిధులు మంజూరు చేయలేదు. దీంతో గిరిజనులకు ఇబ్బందులు తప్పడం లేదు.
...........
తరాలు.. ప్రభుత్వాలు.. మారుతున్నా గిరిజన ప్రాంతాలు మాత్రం అభివృద్ధికి నోచుకోవడం లేదు. వారి ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా చట్టాలు రూపొందించినా.. నిరక్షరాస్యత, అవగాహన లోపంతో అవి సక్రమంగా అమలు కావడం లేదు. మంగళవారం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గిరిజనుల కోసం రూపొందించిన కొన్ని చట్టాలు.. వాటి అమలు తీరును పరిశీలిద్దాం. భారత రాజ్యాంగం ప్రకారం వెనుకబడిన ప్రాంతాలతోపాటు కులాలను 342(1) కింద ఎస్టీలుగా గుర్తించి.. వారికి విద్య, రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలి. గిరిజనుల్లో మరింత వెనుకబడిన తెగలును ప్రత్యేక సమస్యాత్మక గిరిజన తెగలు(పీవీటీజీ)గా గుర్తించాలి. ఈ మేరకు జిల్లాలో సవర, పోర్జ, గదబ, చెంచు, కొండ తెగలును వెనుకబడిన కూలాలుగా గుర్తించారు. కానీ వారికి విద్య, రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు మాత్రం అంతంతమాత్రమే. హక్కుల కోసం పోరాడుతున్నా.. పట్టించుకున్నవారే లేని దుస్థితి నెలకొంది.
ఇదీ పరిస్థితి..
ఉమ్మడి జిల్లాలోని సీతంపేట ఐటీడీఏ ప్రాంతంలో 848 గ్రామాల్లో 1.60 లక్షల మంది గిరిజనులు ఉన్నారు. జిల్లా పునర్విభజన తర్వాత పార్వతీపురం మన్యం జిల్లాకు 378 గ్రామాలు, శ్రీకాకుళం జిల్లాకు 470 గ్రామాలు కేటాయించారు. ఆయా గ్రామాల గిరిజనులకు చట్ట ప్రకారం రావాల్సిన నిధులు మాత్రం కేటాయించకపోవడంతో అభివృద్ధికి దూరమవుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం సబ్‌ప్లాన్ నిధులు సైతం దారి మళ్లించింది. గ్రామాల్లో రహదారులు, తాగునీటి వసతి తదితర కనీస అభివృద్ధి పనులను విస్మరించింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇటీవల బడ్జెట్‌లో గిరిజన సంక్షేమానికి రూ.7,557కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతోనైనా అభివృద్ధి చేపడతారని గిరిజనులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
చట్టాలపై అవగాహన లేక..
- గిరిజనుల ఆర్థికాభివృద్ధి కోసం రూపొందించిన రాజ్యాంగ చట్టాలు కొంతమందికి తెలియక ఇంకా వెనుకబాటుకు గురవుతూనే ఉన్నారు. ఏజెన్సీలో న్యాయపాలన, సివిల్ కోర్టులు, సమీకృత గిరిజనాభివృద్ధి, అటవీహక్కుల గుర్తింపు చట్టం సక్రమంగా అమలుకావడం లేదు. అలాగే షెడ్యూల్డ్ ప్రాంతంలో స్థానిక సంస్థలు, పెసా చట్టం, కుల ధ్రువీకరణ పత్రాలు జారీ, రుణవడ్డీ, వ్యాపార నిబంధననలు, షెడ్యూల్డ్ కులాలు, తెగలు అత్యాచార నిరోధక చట్టం రూపొందించినా.. అవగాహన లేక అమలుకు దూరమవుతున్నాయి.
- గిరిజన ఉప ప్రణాళిక విధానం సక్రమంగా అమలు కావడం లేదు. ప్రధానంగా రెండు లక్ష్యాలతో ఈ విధానం రూపకల్పన చేశారు. గిరిజనుల ఆర్థిక, సామాజిక అభివృద్ధితోపాటు వివిధ రకాల దోపిడీ నుంచి కాపాడుకునేందుకు రాష్ట్ర బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించాలి. కానీ వారి నిధులు వారికి వినియోగించకుండా గత వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించింది.
- గిరిజనులు అప్పు తీసుకున్నా వడ్డీ కింద ఏడాదికి 24శాతం మించి తీసుకుంటే కేసులు నమోదు చేయవచ్చని 1917లో చట్టం చేశారు. కానీ వ్యాపారులు అధికంగా వడ్డీ వసూలు చేస్తున్నారు. గిరిజనుల అభివృద్ధే ధ్యేయంగా 1979లో వారి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. కానీ ఈ కార్పొరేషన్ నిధులు సక్రమంగా అందక.. గిరిజనులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.
- ఉమ్మడి జిల్లాలోని పాలకొండ నియోజకవర్గం సీతంపేటలో 1971-72లో ఐటీడీఏ నెలకొల్పారు. జిల్లా పునర్విభన సమయంలో పాలకొండ నియోజకవర్గం పార్వతీపురం మన్యం జిల్లాలో విలీనమైంది. దీంతో సీతంపేట ఐటీడీఏ కూడా ఆ జిల్లా పరిధిలోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఐటీడీఏ కొనసాగుతున్నా.. నిధులు కేటాయింపు సక్రమంగా లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో కొత్త ఐటీడీఏ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. చట్టాలపై అవగాహన కల్పించి.. అభివృద్ధికి కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
దోపిడీపై విచారణ చేయాలి
గిరిజన చట్టాలుపై అవగాహన లేక వెనుకబాటుతనం కనిపిస్తోంది. చట్టాలపై అవగాహనతోపాటు.. అధికంగా ఆర్థిక, రాజకీయ అవకాశాలు కల్పించాలి. గత వైసీపీ ప్రభుత్వం చట్టం అమలు చేయకుండా నిధులు దోపిడి చేసింది. దీనిపై విచారణ చేయాలి.
- బైరిశింగి లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీపీ, మెళియాపుట్టి
...........................
చట్టం కోసం తెలియదు:
మా గిరిజనులకు చట్టం అంటే తెలియదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా మా బతుకులు మారడం లేదు. ఇప్పుడిప్పుడే అధికారులు మా గ్రామానికి వచ్చి పథకాల కోసం చెబుతున్నారు.
- జన్ని పోలమ్మ, కేరాశింగి, మెళియాపుట్టి
...........................
చదువుకోక పోవడం వల్ల
మేము చదువుకుందామనుకున్నా.. అప్పుడు పాఠశాలలు అందుబాటులో లేవు. చదువుకోకపోవడం వల్ల మేము మోసపోతున్నాం. మా ప్రాంతాల్లో అభివృద్ధి జరగడం లేదు.
ఎస్.జయ్యమ్మ, కేరాశింగి
..........................
అవగాహన కల్పిస్తున్నాం..
గిరిజనులకు చట్టాలపై స్వచ్ఛంద సంస్థలు ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. గ్రామసభలు ఏర్పాటు చేసి వారి ఆర్థికాభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం.
-ప్రసాద్‌పండా, ఎంపీడీవో, మెళియాపుట్టి
Updated Date - Nov 25 , 2024 | 11:46 PM