నవంబరు నుంచి నైపుణ్య గణన
ABN, Publish Date - Oct 27 , 2024 | 11:55 PM
జిల్లాలో నైపుణ్య గణనకు నవంబరు మొదటి వారం నుంచి శ్రీకారం చుడుతున్నామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
- కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం కలెక్టరేట్, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): జిల్లాలో నైపుణ్య గణనకు నవంబరు మొదటి వారం నుంచి శ్రీకారం చుడుతున్నామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘ఇందుకు సంబంధించి ఈ నెల 29న జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం ఏర్పాట్లు చేశాం. దీని కోసం మాస్టర్ ట్రైనర్ల ఎంపిక పూర్తయింది. పూర్తిస్థాయి శిక్షణ అనంతరం వారంతా ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ల ఆధ్వర్యంలో మండల స్థాయిలో ఉన్న సచివాలయ సిబ్బందికి శిక్షణ ఇస్తారు. సంబంధిత వివరాలు నైపుణ్యం అనే యాప్ ద్వారా సేకరిస్తారు. పరిశ్రమల అవసరాలు, మానవ వనరుల వివరాలు బేరీజు వేసుకుని తగిన ప్రణాళికలు రూపొందించడానికి ఉపయోగపడుతుంది. జిల్లాలో 15 నుంచి 59 ఏళ్ల మధ్య నైపుణ్యం గల వ్యక్తుల వివరాలు సేకరించి, తద్వారా జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నాం. ఈ గణన పర్యవేక్షణకు జిల్లా స్థాయిలో నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి, జిల్లా ఉపాధి అధికారులను నోడల్ అధికారులుగా నియమించాం తెలిపారు. సచివాలయ సిబ్బందిని ఇందులో భాగస్వాములు చేస్తున్నామ’ని కలెక్టర్ పేర్కొన్నారు.
Updated Date - Oct 27 , 2024 | 11:55 PM