ఓ డాక్టర్‌గారి నకిలీలలు
ABN, Publish Date - Oct 27 , 2024 | 12:01 AM
అనగనగనగా ఓ ప్రభుత్వ వైద్యుడు. వైసీపీ హయాంలో చెలరేగిపోయాడు. నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చి జేబులు నింపుకున్నాడు. డబ్బులిస్తే సకలాంగులనూ దివ్యాంగులను చేసేశాడు. ఎట్టకేలకు ఆయనగారి యవ్వారం బయటపడింది. దీంతో ఉన్నతాధికారులు నకిలీ సర్టిఫికెట్లను రద్దు చేశారు. ఇప్పుడు ఆయనే రిమ్స్ ‘సదరం’లో కీలక విధులు నిర్వహిస్తున్నారు. ఆయనగారి తరపున దళారులు రంగంలోకి దిగారు.
- వైసీపీ హయాంలో గంపగుత్తుగా ధ్రువపత్రాలు
- అధికశాతం సకలాంగులే దివ్యాంగులుగా..
- కూటమి ప్రభుత్వం వచ్చాక బయటపడిన బాగోతం
- అదే వైద్యుడు.. ఇప్పుడు రిమ్స్‌లో ‘సదరం’ వైద్యపరీక్షలు
- అర్హులు పడిగాపులు.. అనర్హులకు అండదండలు
- తొలిగా ఆమదాలవలసలో వెలుగులోకి వ్యవహారం
- ఆ తర్వాత నరసన్నపేట, ఎచ్చెర్లలో బయటకు..
- ఆ వైద్యుడు ఇప్పుడూ అదేతంతు.. దళారులతో కుమ్మక్కు
- ఏడాది పింఛన్ మొత్తం ఒకేసారి ఇస్తే సర్టిఫికెట్ రెడీ
శ్రీకాకుళం, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి):
అనగనగనగా ఓ ప్రభుత్వ వైద్యుడు. వైసీపీ హయాంలో చెలరేగిపోయాడు. నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చి జేబులు నింపుకున్నాడు. డబ్బులిస్తే సకలాంగులనూ దివ్యాంగులను చేసేశాడు. ఎట్టకేలకు ఆయనగారి యవ్వారం బయటపడింది. దీంతో ఉన్నతాధికారులు నకిలీ సర్టిఫికెట్లను రద్దు చేశారు. ఇప్పుడు ఆయనే రిమ్స్ ‘సదరం’లో కీలక విధులు నిర్వహిస్తున్నారు. ఆయనగారి తరపున దళారులు రంగంలోకి దిగారు. మీకు ఏ వైకల్యం లేకున్నా.. ఏడాది పింఛన్ మొత్తం ఇస్తే చాలు.. సర్టిఫికెట్ ఇప్పిస్తామంటూ బేరాలు పెడుతున్నారు. ఇంతజరుగుతున్నా కూటమి ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు నోరుమెదపక పోవడం గమనార్హం.
...............
కూటమి ప్రభుత్వం.. వృద్ధులకు, దివ్యాంగులకు సామాజిక పింఛన్‌ను పెంచింది. దీనిపై కన్నేసిన కొంతమంది.. దివ్యాంగం ఉన్నట్టు నిర్ధారించే వైద్యుల ‘సదరం’లో ధ్రువీకరణ పత్రాలు పొంది.. అక్రమంగా పింఛన్లు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇలా తప్పుడు ధ్రువపత్రాలతో చాలామంది అనర్హులు దివ్యాంగ పింఛన్లు పొందారు. అప్పట్లో ఓ అవినీతి వైదుడి ఆశీస్సులతో సదరంలో దివ్యాంగులుగా ధ్రువపత్రాలు జారీచేయించుకుని.. లబ్ధి పొందారు. నిన్న మొన్నటి వరకు నరసన్నపేట, రణస్థలం ఆస్పత్రుల్లో విధులు చేపట్టి.. పెద్దఎత్తున అవినీతి ఆరోపణలు మూటకట్టుకున్న ఆ వైద్యుడిప్పుడు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్ - జీజీహెచ్)లో ఏకంగా సదరంలో కీలక విధులు నిర్వహిస్తుండటం చర్చనీయాంశమైంది. అర్హులకు ఇబ్బంది పెడుతూ.. దళారీలు తెచ్చిన అభ్యర్థుల జాబితాకు ఎంచెక్కా అనుమతిస్తూ... తాను అప్పుడూ ఇప్పుడూ అవినీతికే పాల్పడుతూనే ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి.
- వైసీపీ హయాంలో గంపగుత్తుగా...
ప్రస్తుతం శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో పని చేస్తున్న ఆర్థోపెడీషియన్... వైసీపీ హయాంలో నరసన్నపేట, రణస్థలం ఆస్పత్రుల్లో విధులు నిర్వహించారు. అడ్డగోలుగా సకలాంగులకు సైతం దివ్యాంగత్వం ఉన్నట్టు ‘సదరం’లో గంపగుత్తుగా ధ్రువపత్రాలు జారీచేసే విషయంలో కీలకంగా వ్యవహరించారు. ఆయన నరసన్నపేట నియోజకవర్గంలో భారీగా నకిలీ దివ్యాంగులు పింఛన్ పొందేలా అక్రమాలకు పాల్పడ్డారు. దళారీలను ఏర్పాటు చేసుకుని.. వారి ద్వారా తనకు వచ్చిన జాబితాను పరిశీలించేవారు. పింఛన్ మంజూరుకు అవసరమైన వికలాంగత్వం శాతాన్ని వేసి.. సర్టిపికెట్‌లను సిఫార్సు చేసేవారు. ఇటువంటివి ఆమదాలవలస నియోజకవర్గంలోనూ చోటుచేసుకున్నాయి. ఇప్పుడు ఆమదాలవలస నియోజకవర్గం సరుబుజ్జిలి, ఆమదాలవలస, పొందూరు మండలాల్లో నకిలీల బాగోతం బట్టబయలైంది. అప్పట్లో ఆర్థోపిడీషియన్ మంజూరు చేసిన నకిలీ దివ్యాంగులకు సర్టిఫికెట్‌లపై ఉన్నతాధికారులకు గుట్టుగా ఫిర్యాదు అందింది. దీంతో అసలు బండారం బయటపడింది.
- సరుబుజ్జిలి మండలం విజయరామపురం పంచాయతీ కూనజమ్మన్నపేటలో ఇటీవల ఎలాంటి అంగవైకల్యం లేకున్నా.. 13 మంది దివ్యాంగ పింఛన్లు పొందారు. వారు గతంలోనూ.. ప్రస్తుతం రిమ్స్‌లో... సదరంలో పరీక్షలు నిర్వహించే ఆర్థోపెడీషియన్ ద్వారా సర్టిఫికెట్‌లు పొందారు. ఇందుకు ఒక్కొక్కరి నుంచి రూ.30వేలు వసూలు చేసి ఇటు దళారీలు.. అటు వైద్యుడు పంచుకున్నారని కీలక ప్రజాప్రతినిధికి ఫిర్యాదు అందింది. దీనిపై విచారణకు ఆదేశించారు. రిమ్స్‌లో గురువారం 13 మందికి వైద్యపరీక్షలు జరిగాయి. అందులో 13 మంది అనర్హులని తేలింది. ఆ సర్టిఫికేట్‌లను రద్దు చేశారు. అయితే అందులో ఒక మహిళను అర్హులుగా గుర్తించాలని.. మరో ప్రజాప్రతినిధి సిఫార్సు చేశారు. దీంతో చేసేది లేక ఆమెను మాత్రమే అర్హురాలని తేల్చి.. మిగిలిన 12మంది అనర్హులేనని ఉన్నతాధికారులు తేల్చారు. ప్రస్తుతం సరబుజ్జిలి మండలంలోని ఒక్క పంచాయతీలోనే ఈ తంతు బయటపడింది.
- నరసన్నపేట, ఎచ్చెర్ల నియోజకవర్గాల్లో నకిలీ పింఛన్‌దారుల జాబితా ఉన్నతాధికారులకు చేరింది. దీనిపైనా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో సర్టిఫికేట్‌ల విచారణ జరుగుతోంది. ఇంతలా అనర్హులు పుట్టుకురావడానికి కారణమైన... ఆర్థోపిడీషియన్‌కు ఇప్పుడు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోనే కీలక విధులు అప్పగించడం.. ఆపై సదరంలోనూ ఆయనే కొనసాగడం పలు అనుమానాలకు తావిస్తోంది.
- సర్టిఫికెట్ కోసం.. ఏడాది పింఛన్ ఇవ్వాలంట..
అక్రమాలకు అండగా వైద్యుడు కలిసి రావడంతో పలుచోట్ల దళారీలు రంగంలోకి దిగారు. అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యేలు.. ఇప్పుడు కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేల పేర్లుతో చెలామణి అవుతూనే ఉన్నారు. దివ్యాంగులకు పింఛన్ ఎక్కువగా వస్తుందని.. తమకు డబ్బులిస్తే సదరంలో అనర్హులకు సైతం సర్టిఫికెట్ చేయించేస్తామని చెబుతున్నారు. పింఛన్ మంజూరు కోసం సిఫార్సు చేసే బాధ్యత తమదేనని స్పష్టం చేస్తున్నారు. ఇందుకోసం ఏడాదికి అందుకునే పింఛన్ మొత్తాన్ని ఒకేసారి మామూళ్ల రూపంలో ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చక్రం తిప్పుతూనే ఉన్నారు. చాలామంది పింఛన్ కోసం ఆశపడి.. దళారీలు అడిగినంత డబ్బు అందజేస్తున్నారు. అందులో సగభాగం వైద్యుడికి అందించి.. అడ్డూ అదుపు లేకుండా సదరంలో ధ్రువపత్రాలను క్లియరెన్స్ చేయించుకుంటున్నారు.
- పట్టించుకోని ప్రజాప్రతినిధులు..
రాజకీయాల కారణంగా.. తన వర్గానికి దూరమవుతారనే ఉద్దేశంతో ప్రజాప్రతినిధులు నకిలీ వికలాంగులు పింఛన్ పొందడాన్ని చిన్నవిషయంగా తీసుకుంటున్నారు. ఓ ఎమ్మెల్యే మాత్రం.. రాజకీయాలతో సంబంధం లేకుండా అనర్హుల ఏరివేతతోపాటు.. అందుకు సహకరించిన వైద్యాధికారిపై చర్యలు ఉండేలా ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఇతర నియోజకవర్గాల్లో సైతం నకిలీ దివ్యాంగులు కుప్పలుగా ఉన్నారు. ఇందులో దళారీలకు వంతపాడుతూ.. వారిచ్చే డబ్బులకు ఆశపడుతూ.. అర్హులకు మాత్రం చుక్కలు చూపిస్తున్న వైద్యుల పనిపట్టేందుకు కొంతమంది ఎమ్మెల్యేలు మౌనంగానే ఉంటున్నారు. గత వైసీపీలో జరిగిన అక్రమాలను ఇప్పటికీ కొనసాగించేందుకు పరోక్షంగా సహకరిస్తున్నారు. అయితే అర్హులు మాత్రం.. అవినీతి వైద్యుడి బాగోతాన్ని.. జిల్లాలో అనర్హుల జాబితాను పింఛన్ ఐడీల నెంబర్‌తో సైతం ముఖ్యమంత్రి పేషీకి... రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపైనే విచారణ జరుగుతోంది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి.. అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. పింఛన్ జాబితాలో అనర్హులను ఏరివేసి.. అర్హులకు న్యాయం చేయాల్సి ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Updated Date - Oct 27 , 2024 | 12:01 AM