బీసీ వసతిగృహాల్లో డిజిటల్ బోధన
ABN, Publish Date - Oct 27 , 2024 | 11:59 PM
బీసీ సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందించడంతోపాటు సాంకేతిక విద్య అందించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
- విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాల పెంపునకు కృషి
- జిల్లాలో తొలివిడత ఐదుచోట్ల ఏర్పాటు
నరసన్నపేట, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): బీసీ సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందించడంతోపాటు సాంకేతిక విద్య అందించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. వివిధ సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థుల కోసం డిజిటల్ రిసోర్సు కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. దివంగత ఐఏఎస్ అధికారి ఎస్‌ఆర్ శంకరన్ పేరుతో ఈ కేంద్రాలను నెలకొల్పనుంది. ఈ కేంద్రాల్లో తొలివిడతగా 8 నుంచి పదో తరగతి విద్యార్థులకు బోధన చేపట్టనున్నారు. అందుకోసం సొంత భవనాలు, విశాలమైన గదులు ఉన్న వసతిగృహాలను ఎంపిక చేయాలని ప్రభుత్వం బీసీ సంక్షేమశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
- జిల్లాలో 79 బీసీ వసతి గృహాలు ఉన్నాయి. వీటిలో 7వేల మందికిపైగా విద్యార్థులు ఉన్నారు. 61 వసతిగృహాల్లో పాఠశాల విద్యార్థులు ఉంటున్నారు. 18 వసతిగృహాల్లో పోస్టుమెట్రిక్ విద్యార్థులు చదువుతున్నారు. తొలివిడతగా ఐదు వసతిగృహాల్లో డిజిటల్ రిసోర్సు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. లావేరు, సింగుపురం, కోటబొమ్మాళి, నందిగాం, కంచిలి బాలుర వసతిగృహాలను అధికారులు ఎంపిక చేశారు. వీటిలో 8, 9, 10 తరగతి చదువుతున్న విద్యార్థులు 570 మంది ఉన్నారు. వీటి పరిధిలో మరో 15 వసతిగృహాలు ఉండగా.. ఆయా విద్యార్థులు కూడా ఈ కేంద్రాలను వినియోగించుకోనున్నట్టు బీసీ వెల్ఫేర్ అధికారిణి అనూరాధ తెలిపారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని నవంబరు 14న వీటిని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో రెండో విడతలో మరికొన్ని వసతిగృహాల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
- ట్యూటర్ల ద్వారా సందేహాల నివృత్తి
ఎంపిక చేసిన వసతిగృహాల్లో ఒక గదిని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దనున్నారు. అందులో డిజటల్ ఇంటిరాక్టివ్ బోర్డు, సమాచారాన్ని పెన్‌డ్రైవ్ ద్వారా అందిస్తారు. పాఠశాల ముగిసిన తర్వాత వసతిగృహాలకు చేరుకున్నవిద్యార్థులకు సబ్జెక్టులో బోధనతోపాటు సందేహాల నివృత్తికి ట్యూటర్లను నియమించనున్నారు. ఈ కేంద్రాల్లో లాంగ్వేజ్‌లతో పాటు సాంఘీక శాస్త్రంలో మ్యాప్‌లను గుర్తించేందుకు బోధన ఎంతో దోహదపడుతుంది. అలాగే సైన్సులో సులువుగా బొమ్మలను గీయడం.. ప్రయోగాల ద్వారా సందేహాలను నివృత్తి చేయనున్నారు. ఆన్‌లైన్‌లో కూడా అదనపు సమాచారం పొందేందుకు ఈ కేంద్రాలు దోహదపడతాయి. తద్వారా పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తారని అధికారులు చెబుతున్నారు.
ప్రతిపాదన పంపించాం
జిల్లాలో మొదటి విడతలో ఐదు వసతిగృహాలను ఎంపిక చేసి.. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ప్రీమెట్రిక్ హాస్టల్‌లో సొంత భవనాలు ఉన్న ఐదుచోట్ల డిజిటల్ రీసోర్సు సెంటర్లు ఏర్పాటు చేస్తాం.
- ఈ. అనురాధ, బీసీ సంక్షేమ అధికారిణి
Updated Date - Oct 27 , 2024 | 11:59 PM