చెక్ ‘ఢామ్’లు!
ABN, Publish Date - Jan 18 , 2024 | 11:34 PM
గిరిజన రైతులకు మేలు చేయాలని... పంటలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో నిర్మించిన చెక్ డ్యామ్‌లు ఎందుకూ కొరగాకుండా ఉన్నాయి. ఏళ్ల తరబడి నిర్వహణ కరువై...ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి.
గుమ్మలక్ష్మీపురం: గిరిజన రైతులకు మేలు చేయాలని... పంటలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో నిర్మించిన చెక్ డ్యామ్‌లు ఎందుకూ కొరగాకుండా ఉన్నాయి. ఏళ్ల తరబడి నిర్వహణ కరువై...ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి. పార్వతీపురం ఐటీడీఏ పరిధి లోని గుమ్మలక్ష్మీపురం, కురుపాం, జియ్యమ్మవలస, కొమరాడ, మక్కువ, పాచిపెంట, సాలూరు మండ లాల్లో సుమారు 165 చెక్‌డ్యామ్‌లు ఉన్నాయి. వీటికి గత ఐదేళ్లుగా మరమ్మతులు లేవని గిరిజన రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట కాలువల్లో పూడిక తీత కూడా లేదని... దీనివల్ల నీరు సరిగా ప్రవహించడం లేదని వాపోతున్నారు. ఈ ఏడాది తగిన వర్షపాతం లేకపోవడం... చెక్‌డ్యామ్‌ల నుంచి నీరు రాని కారణంగా ఎంతో నష్టపోయామని గిరిజన రైతు మండంగి రమణ ఆందోళన వ్యక్తం చేశారు. ఐటీడీఏ, గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్ మైనర్ ఇరిగేషన్ విభాగాల ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో ఈ 165 చెక్‌డ్యామ్‌లను నిర్మించారు. వీటితో సుమారు ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. గత ప్రభుత్వంలో ఈ చెక్‌డ్యామ్‌ల నిర్వహణకు ఏటా నిధులు మంజూరు చేసేవారు. ఆయకట్టు రైతు కమిటీల ద్వారా వీటి నిర్వహణ పనులు జరిగాయి. ప్రస్తుత ప్రభుత్వం నుంచి ఒక్కపైసా మంజూరు కాలేదని రమణ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి వారంతా పేద రైతులు కావడంతో... చందాలు పోగుచేసి చెక్‌డ్యామ్‌లకు మరమ్మతులు చేయలేకపోతున్నామన్నారు. గుమ్మలక్ష్మీపురం మండలంలో గండ్రవంజరాపు గూడ, రేగిడి, బుద్ధుడి, డుమ్మంగి, చీమలగూడ, జేకేపాడు ప్రాంతాల్లో పెద్ద చెక్‌డ్యామ్‌లు ఉన్నాయి. ప్రతి చెక్‌డ్యామ్ కింద సుమారు వంద ఎకరాల చొప్పున సాగునీరు అందుతుంది. ఇంత ముఖ్యమైన చెక్‌డ్యామ్‌లకు మరమ్మతులు చేయడానికి కూడా గత ఐదేళ్లుగా నిధులు మంజూరు కాలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సాగునీటి కాలువల నిర్వహణకు నిధులు మంజూరు చేయాలని గిరిజన రైతులు కోరుతున్నారు.
ఉద్యమాలు తప్పవు
చెక్‌డ్యామ్‌లకు మరమ్మతులు చేయకపోతే గిరిజన సంఘం ద్వారా ఉద్యమించక తప్పదు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలి.
-ఎం.రమణ, గిరిజన సంఘ నాయకులు
ప్రతిపాదనలు పంపించాం
చెక్‌డ్యామ్‌ల నిర్వహణకు నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. నిధులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభిస్తాం.
-సింహాచలం, డీఈ, గిరిజన సంక్షేమశాఖ, భద్రగిరి
Updated Date - Jan 18 , 2024 | 11:34 PM