కూటమి గెలుపును ఆపలేరు
ABN, Publish Date - Mar 20 , 2024 | 11:31 PM
మరో 53 రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిదే విజయమని, దీన్ని ఎవరూ ఆపలేరని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.
-160 స్థానాలు పక్కా
- వైసీపీ పాలనలో రాష్ట్రం నాశనం
- టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు
టెక్కలి, మార్చి 20: మరో 53 రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిదే విజయమని, దీన్ని ఎవరూ ఆపలేరని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడుతో కలిసి బుధవారం కోటబొమ్మాళి మండలం పట్టుపురం పంచాయతీ కిష్టంపేట, సోమనాథపురం, మణినాగేశ్వరపురం, కొండపేటల్లో పర్యటించారు. వారికి గ్రామస్థులు హారతులిచ్చి తిలకాలు దిద్ది నీరాజనం పలికారు. ఈ సందర్భంగా పట్టుపురం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. కేంద్రంలో ఎన్డీఏకు 400 సీట్లు, రాష్ట్రంలో కూటమికి 160కు పైగా స్థానాలు పక్కాగా వస్తాయని తెలిపారు. కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు ఓటర్లు కృషి చేయాలని కోరారు. ‘టీడీపీ, జనసేన పార్టీ, బీజేపీ పొత్తు పెట్టుకుంటే వైసీపీ కుక్కలు ఇష్టమొచ్చినట్లు మొరుగుతున్నాయి. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని మూడు పార్టీల కూటమి అనివార్యమైంది. ఐదేళ్లలో రాష్ట్రాన్ని జగన్మోహన్‌రెడ్డి సరనాశనం చేశారు. రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కు వెళ్లింది. తిరిగి రాష్ట్రాన్ని గాడీలో పెట్టాలంటే కూటమి గెలుపు తప్పనిసరి. వైసీపీ ఐదేళ్ల పాలనలో గ్రామస్థాయి నుంచే రౌడీలు, గూండాలు దౌర్జన్యాలు చేస్తూ దాడులకు పాల్పడుతూ హత్యలు చేస్తూ రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చారు. రాష్ట్రంలో ఈ భూమి నాదంటే కొడతారు. ఎవరైనా ఏ సమావేశానికి వెళ్లినా కర్రలతో కొట్టి చంపుతారు. ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రితో ఐదుకోట్ల మంది ప్రజానీకం నిద్రలేని రాత్రులు గడిపారు. ఎక్కడ ప్రభుత్వ స్థలం ఉన్నా తాకట్టు పెడుతున్నారు. చివరికి అమరావతి సచివాలయాన్ని కూడా తాకట్టుపెట్టి పన్నెండున్నర లక్షల కోట్లు అప్పుతెచ్చారు. ఈ డబ్బును ఏమిచేశారో జగన్ చెప్పాలి. ఈ ఐదేళ్ల కాలంలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు తప్పు చేయకపోయినా కేసులు పెట్టి జైలులో నిర్బంధించి హింసించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు 50 ఏళ్లకు పింఛన్ మంజూరు చేసి నెలకు రూ.4వేలు ఇస్తాం. పింఛన్‌ను మూడు నెలలకు ఒకసారి తీసుకునే సౌలభ్యం కూడా కల్పిస్తాం’ అని తెలిపారు.
జగన్ అవినీతి బకాసురుడు: ఎంపీ రామ్మోహన్
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అవినీతి బకాసురుడిగా పేరుగాంచారని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఆరోపించారు. ఈ సభలో ఎంపీ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కొండలు, భూములు, నదుల్లో ఇసుక తినేశాడని ధ్వజమెత్తారు. ‘పొలాల్లో వేసే సర్వే రాళ్లపై, రైతులకు ఇచ్చే పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ తన ఫొటో వేసుకుంటున్నారు. రేపు ప్రజల ఆస్తిలో కూడా వాటా లాగేస్తారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రన్న కానుక, చంద్రన్న బీమా ఎత్తేశారు. మద్యపాన నిషేధం హామీ అమలు చేయలేదు. నాడు క్వార్టర్ రూ.100 ఉంటే నేడు రూ.200కు పెంచేసి నాన్న బుడ్డీ పథకం పెట్టి ప్రతి కుటుంబాన్ని దోచుకుంటున్నారు. చెత్త మీద, ఇంటి మీద, నీటి మీద ఇలా అన్నింటిపై పన్నులు వేసి ఈ ముఖ్యమంత్రి పన్నులు ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందారు.’ అని విమర్శించారు. ఈ సమావేశంలో నాలుగు మండలాల టీడీపీ అధ్యక్షులు బోయిన రమేష్, పినకాన అజయ్‌కుమార్, బగాది శేషగిరి, జీరు భీమారావు, నాయకులు కింజరాపు హరివరప్రసాద్, మెండ దాసునాయుడు, వెలమల విజయలక్ష్మి, తర్ర రామకృష్ణ, కామేశ్వరరావు, నంభాళ్ల శ్రీనివాస్, కర్రి అప్పారావు, నంభాళ్ల రాజశేఖర్, రోణంకి లీలామోహన్, పూజారి శైలజ, అన్నపూర్ణ, వాన లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ ప్రచార రథాలు ప్రారంభం
ఎన్నికల కోసం టీడీపీ ప్రచార రథాలను అచ్చెన్నాయుడు, రామ్మోహన్‌నాయుడు ప్రారంభించారు. టెక్కలి, నందిగాం, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి మండలాలకు సంబంధించి ఒక్కో మండలంలో రెండేసి ప్రచార రథాలు తిరిగేటట్లు సిద్ధం చేశారు.
టీడీపీలో చేరిక
కిష్టుపురం పంచాయతీ సోమనాథపురం, కన్నేవలస పంచాయతీ చుట్టుగుండంకు చెందిన పలువురు యువకులు, పలు కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలో చేరాయి. సోమనాథపురానికి చెందిన జి.శంకరరావు, బారికివాడు, బి.అప్పలరాజు, దాసరి రుద్రయ్య, రామారావు, మన్మథరావు, శివ, చిన్నవాడు, గోవిందరావు, ఆనంద్, సింహాచలం, అప్పలస్వామి తదితర 25 కుటుంబాలు టీడీపీ తీర్థం తీసుకున్నాయి. వీరందరికీ అచ్చెనాయుడు, రామ్మోహన్‌నాయుడు టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అచ్చెన్నపై నిఘా
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అచ్చెన్నపై వీడియో సర్వేలైన్స్ బృందం, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం, ఇంటలిజెన్స్ విభాగాలు నిఘా పెట్టాయి. ఎన్ని వాహనాల ద్వారా ప్రచారం చేస్తున్నారు, బ్యానర్లు, జెండాలు ఏ మేరకు వినియోగిస్తున్నారు, గిఫ్ట్‌లు ఏమైనా పంపిణీ చేస్తున్నారా?, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్నారా? ఇలా పలు అంశాలపై ఆయా విభాగాల అధికారులు ఆరా తీశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి నూరుల్ కమర్ తన వాహనంలో పట్టుపురం వైపు వచ్చారు.
Updated Date - Mar 20 , 2024 | 11:31 PM