అమ్మా... క్షమించు
ABN, Publish Date - Mar 15 , 2024 | 12:23 AM
నరసన్నపేటలోని ప్రశాంత్‌నగర్‌కు చెందిన పి.జశ్వంత్(18) విశాఖపట్నంలో ఒక ప్రైవేటు హాస్టల్‌లో బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు.
- విశాఖలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
- నరసన్నపేటలో విషాదఛాయలు
నరసన్నపేట/ కొమ్మాది, మార్చి 14: నరసన్నపేటలోని ప్రశాంత్‌నగర్‌కు చెందిన పి.జశ్వంత్(18) విశాఖపట్నంలో ఒక ప్రైవేటు హాస్టల్‌లో బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. పీఎం పాలెం సీఐ వై.రామకృష్ణ తెలిపిన వివరాలు ప్రకారం.. నరసన్నపేటకు చెందిన బజాజ్ రమేష్ కుమారుడు జశ్వంత్ విశాఖలోని గీతం యూనివర్సిటీలో బీటెక్ ఈసీఈ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. రుషికొండలోని స్నేహితుడితో కలిసి ఒక ప్రైవేటు హాస్టల్‌లో ఉంటున్నాడు. బుధవారం తల్లి సంధ్య ఫోన్‌కు.. తన ఐ ఫోన్ పాస్‌వర్డ్, నోట్‌బుక్ పాస్‌వర్డ్‌ను మేసేజ్ చేశాడు. అనంతరం అమ్మా... స్వారీ అంటూ మరో మేసేజ్ పంపించాడు. ఏమైందోనని కంగారు పడుతూ తల్లి సంధ్య జశ్వంత్‌కు ఫోన్ చేయగా.. లిఫ్ట్ చేయలేదు. దీంతో అనుమానంతో జశ్వంత్ స్నేహితులకు ఆమె ఫోన్ చేశారు. అప్పటికే హాస్టల్‌లో జస్వంత్ ఉరి వేసుకుని చనిపోయాడని వారు తెలిపారు. ఒక్కగానొక్క కుమారుడు బలవన్మరణానికి పాల్పడడంతో రమేష్, సంధ్యలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. జస్వంత్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలియడం లేదని రోదిస్తున్నారు.
ఏమైందో..
బుధవారం సాయంత్రం ఏడు గంటల సమయంలో హాస్టల్ వార్డెన్.. విద్యార్థి తండ్రికి ఫోన్ చేసి జశ్వంత్‌కు ఫిట్స్ రావడంతో ఆసుపత్రికి తీసుకువెళుతున్నామని చెప్పారు. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకునేసరికి జశ్వంత్ మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. మృతుడి తల్లిదండ్రులు అసలు ఏమి జరిగిందని ఆరా తీయగా.. జశ్వంత్ బుధవారం సాయంత్రం 4.30 గంటలకు గదిలోకి వెళ్లాడని, అతని స్నేహితులు రాత్రి 7 గంటల సమయంలో గదికి రాగా డోర్ లాక్ చేసి ఉండడంతో స్పేర్ కీతో తలుపు తెరిచి చూసేసరికి బెడ్ షీట్‌తో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఉండడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ రామకృష్ణ తెలిపారు. కాగా విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.
Updated Date - Mar 15 , 2024 | 12:26 AM