టీడీపీ కార్యకర్త హత్య
ABN, Publish Date - Oct 09 , 2024 | 12:28 AM
పోలాకి మండలం వనవిష్ణుపురంలో దసరా ఉత్సవాల(వారాలు) వేళ.. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య రాజకీయ కక్షలు పడగ విప్పాయి. వైసీపీ నేత, మాజీ సర్పంచ్ పాలిన కృష్ణమూర్తి తన అనుచరులతో టీడీపీ కార్యకర్త పాలిన వీరస్వామి(47)పై మంగళవారం రాత్రి విచక్షరహితంగా కత్తులతో దాడి చేశారు.
- ఉత్సవాల్లో వైసీపీ వర్గీయుల ఘాతుకం
- టీడీపీ శ్రేణులపై మారణాయుధాలతో దాడి
- సైకిల్ గెలుపునకు కృషి చేశారన్న కక్షతో..
- ఒకరి మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు
నరసన్నపేట, అక్టోబరు 8: అప్పటివరకూ దసరా వారాలు (గ్రామదేవత ఉత్సవాలు)తో సందడిగా ఉన్న ఆ గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ఉత్సవాల్లో భాగంగా రాజకీయ కక్షలు బయటపడ్డాయి. ఈ క్రమంలో వైసీపీ వర్గీయులు ఆయుధాలతో దాడి చేయగా.. టీడీపీ కార్యకర్త ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఇరువర్గాల మధ్య ఘర్షణతో ఉద్రిక్తత నెలకొనగా.. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసుపికెట్ ఏర్పాటు చేశారు. వివరాల్లోకి వెళితే..
పోలాకి మండలం వనవిష్ణుపురంలో దసరా ఉత్సవాల(వారాలు) వేళ.. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య రాజకీయ కక్షలు పడగ విప్పాయి. వైసీపీ నేత, మాజీ సర్పంచ్ పాలిన కృష్ణమూర్తి తన అనుచరులతో టీడీపీ కార్యకర్త పాలిన వీరస్వామి(47)పై మంగళవారం రాత్రి విచక్షరహితంగా కత్తులతో దాడి చేశారు. దీంతో వీరస్వామి అక్కడిక్కడే మృతి చెందారు. దాడిని అడ్డుకున్న మరో కార్యకర్త పాలిన రామారావు తీవ్రంగా గాయపడ్డారు. రాత్రి 7.30 గంటల సమయంలో ఈ ఘటన జరగ్గా.. ఒక్కసారిగా అలజడి రేగి గ్రామస్థులు భయాందోళన చెందారు. పోలాకి పోలీసులకు సమాచారం అందజేశారు. నరసన్నపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో పోలీసు బలగాలు గ్రామానికి చేరుకున్నాయి. వీరస్వామి మృతదేహంతో పాటు, క్షతగాత్రున్ని పోలీసులు నరసన్నపేట సామాజిక ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో మృతదేహాన్ని ఎస్పీ మహేశ్వరరెడ్డి, శ్రీకాకుళం సీఐ పైడపునాయుడు పరిశీలించారు. క్షతగాత్రుడు, మృతుడి బంధువులతో మాట్లాడి ఘటనపై ఆరా తీశారు. పక్కా ప్లాన్ ప్రకారం పాలిన కృష్ణమూర్తితోపాటు ఆయన అనుచరులు పాలిన మోహనరావు, ఎస్.లచ్చయ్య, దుర్గారావు, చెల్లయ్యతో పాటు మరో వ్యక్తి మరణాయాధాలతో దాడికి పాల్పడినట్లు మృతుడి బంధువులు పోలీసులకు తెలిపారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని పోలీసులను ఎస్పీ ఆదేశించారు.
ఘర్షణకు కారణమిదీ..
గత సాధారణ ఎన్నికల్లో వీరస్వామి వర్గీయులు టీడీపీకి మద్దతు ఇచ్చారని వైసీపీ నాయకుడు, మాజీ సర్పంచ్ పాలిన కృష్ణమూర్తి మూర్తి కక్ష పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి ఉత్సవాల సందర్భంగా వీరస్వామి తన అనుచరులతో పత్రి కొమ్మలు వేసేందుకు అమ్మవారి గుడికి వెళ్తున్నారు. కాగా.. తమ వర్గమే ముందు వెళ్లాలని, ముందుగా మొక్కు చెల్లించాలని, మీరెలా వస్తారని వైసీపీ నేత కృష్ణమూర్తి అడ్డుకున్నాడు. మొక్కులు చెల్లించేందుకు ఎవరు ముందు వెళ్తే ఏంటని టీడీపీ వర్గీయులు ప్రశ్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తి.. ఘర్షణకు దారితీసింది. ఈక్రమంలో వైసీపీకి చెందిన పాలిన కృష్ణమూర్తి వర్గీయులు.. అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న కత్తులతో ఒక్కసారిగా టీడీపీ వర్గీయులపై దాడికి దిగారు. దీంతో వీరస్వామి అక్కడికక్కడే చనిపోగా.. రామారావు తలకు తీవ్ర గాయాలయ్యాయి. దాడి ఘటనపై కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, టీడీపీ నాయకులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఎస్పీ మహేశ్వరరెడ్డితో మంత్రి అచ్చెన్న ఫోన్‌లో మాట్లాడి.. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మృతుడి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
వైసీపీ నాయకులు పరారీ
దాడికి పాల్పడిన వైసీపీ నాయకులు మాజీ సర్పంచ్ పాలిన కృష్ణమూర్తి, ఆయన అనుచరులైన పాలిన మోహనారవు, ఎస్.లచ్చయ్య, దుర్గారావు, చెల్లయ్యతో పాటు మరో వ్యక్తి పరారీ అయ్యారు. గ్రామంలో ఇరువర్గాల మధ్య ఎటువంటి సంఘటన జరగకుండా పోలీసులు గ్రామంలో పహారా నిర్వహించారు. పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు.
Updated Date - Oct 09 , 2024 | 12:28 AM