మద్యం మత్తులో దాడి చేసిన వ్యక్తిపై కేసు
ABN, Publish Date - Nov 25 , 2024 | 11:26 PM
రోడ్డుపై కారు అడ్డంగా పెట్టిన విషయమై ప్రశ్నించడం తో మద్యం మత్తులో ఓ వ్యక్తిపై దాడికి పాల్పడిన ఘటన శ్రీకాకుళం నగరంలో కలకలం రేపింది.
శ్రీకాకుళం క్రైం, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): రోడ్డుపై కారు అడ్డంగా పెట్టిన విషయమై ప్రశ్నించడం తో మద్యం మత్తులో ఓ వ్యక్తిపై దాడికి పాల్పడిన ఘటన శ్రీకాకుళం నగరంలో కలకలం రేపింది. పోలీసులు, బాధితుడి కథనం మేరకు.. శ్రీకా కుళంలోని గొల్కొండ రేవు వీధిలో ఆదివారం రాత్రి ఒప్పంగికి చెందిన సరస్వతుల పవన్ మణికంఠ మద్యం తాగి కారులో అక్కడికి వచ్చాడు. కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న దమ్మల వీధికి చెందిన సూరాడ సత్యం విధులు ముగించుకుని రాత్రి 8.45 గంటలకు ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్నాడు. ఆ సమయంలో గోల్కొం డ రేవు వీధిలో పవన్ తన కారును రోడ్డుకు అడ్డంగా పెట్టాడు. దీంతో కారు పక్కన పెట్టాలని, రాకపోకలకు ఇబ్బంది కలుగుతోందని సత్యం అన్నాడు. దీంతో కోపోద్రి క్తుడైన పవన్.. సత్యం బైక్ ఆపి తాళం తీసుకుని దాడి చేశాడు. దీంతో చుట్టు పక్కల వారు అక్కడకు చేరుకుని వారిని నిలువరించారు. ఇంతలోనే పోలీసులు అక్కడకు చేరుకోవడంతో పంచాయితీ వన్‌టౌన్‌కు చేరింది. ఘర్షణకు దిగిన సత్యం, పవన్‌కు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయాలని సీఐ పైడపునాయుడు చెప్పడంతో పవన్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సత్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ ఎస్‌ఐ ఎం.హరికృష్ణ.. పవన్‌పై కేసు నమోదుచేశారు. కాగా తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని, సత్యం తనపై దాడిచేశాడని సోమవారం పవన్ మణికంఠ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Updated Date - Nov 25 , 2024 | 11:26 PM