ఒక పంచాయతీ.. ఇద్దరు కార్యదర్శులు
ABN, Publish Date - Oct 16 , 2024 | 01:56 AM
ఒక పంచాయతీకి ఒక కార్యదర్శి ఉంటారు. అది పద్ధతి. కానీ అధికారుల నిర్లక్ష్యం, అధికార పార్టీ నేతల చేతివాటంతో పెద్దారవీడు మండలంలోని ఓ పంచాయతీకి మాత్రం ప్రస్తుతం ఇద్దరు కార్యదర్శులు వచ్చారు. ఇరువురూ హాజరు పుస్తకంలో సంతకాలు చేస్తున్నారు.
ఇరువురూ విధులకు హాజరు
సిఫార్సు లేఖలు ఇచ్చిన నియోజకవర్గ నేత
పెద్దారవీడు మండలంలో విచిత్ర పరిస్థితి
మార్కాపురం, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి) : ఒక పంచాయతీకి ఒక కార్యదర్శి ఉంటారు. అది పద్ధతి. కానీ అధికారుల నిర్లక్ష్యం, అధికార పార్టీ నేతల చేతివాటంతో పెద్దారవీడు మండలంలోని ఓ పంచాయతీకి మాత్రం ప్రస్తుతం ఇద్దరు కార్యదర్శులు వచ్చారు. ఇరువురూ హాజరు పుస్తకంలో సంతకాలు చేస్తున్నారు. మొదట విధుల్లో చేరిన మహిళా ఉద్యోగినిని ప్రస్తుతం మరో చోటుకు వెళ్లాలని మండల స్థాయి అధికారి ఆదేశించడంతో ఈ విషయం మంగళవారం వెలుగులోకి వచ్చింది. కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్‌తోనే తాను విధుల్లో చేరినట్లు ఆమె చెబుతుండటం చర్చనీయాంశమైంది. పద్ధతి ప్రకారం తాను విధుల్లో చేరినా మరో ఉద్యోగిని కూడా అక్కడకే ఎలా పంపారని ఆమె మండల అధికారిని ప్రశ్నిస్తే నియోజకవర్గ నేత వద్దన్నారని సమాధానం ఇచ్చారు. మొదట విధుల్లో చేరిన మహిళా ఉద్యోగికి కూడా నియోజకవర్గ నేత సిఫార్సు లేఖ ఇవ్వడం గమనార్హం. మండలస్థాయి అఽధికార పార్టీ నేత ఒకరు చేతివాటం చూపి ఈ వివాదానికి కారణమైనట్లు చర్చ జరుగుతోంది.
7వ తేదీన ఒకరు.. 8న మరొకరు
పెద్దారవీడు మండలంలోని పుచ్చకాయలపల్లి పంచాయతీ కార్యదర్శిగా ఈ నెల 7వ తేదీన దుద్దేల రామకోటమ్మ విధుల్లో చేరారు. ఆమె పెద్దదోర్నాల మండలం గంటవానిపల్లి పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తూ పుచ్చకాయలపల్లి పంచాయతీకి బదిలీ అయ్యారు. ఆమె అధికార పార్టీ నియోజకరవ్గస్థాయి నేత వద్ద తీసుకున్న సిఫార్సు లేఖతోనే జిల్లా పంచాయతీ అధికారులు బదిలీ చేశారు. గంటవానిపల్లిలో రిలీవ్ అయిన తర్వాత కలెక్టర్ ఆదేశాల మేరకు పెద్దారవీడు ఎంపీడీవో అనుమతితో పుచ్చకాయలపల్లిలో విధుల్లో చేరారు. ఏమైందో ఏమో ఆ మరుసటి రోజునే 8వ తేదీన బి.చిన్నమంత్రునాయక్ అనే ఉద్యోగి కూడా పుచ్చకాయలపల్లి పంచాయతీ కార్యదర్శిగా విధుల్లో చేరారు. అతను కూడా నియోజకవర్గ నేత సిఫార్సుతోనే అదే పంచాయతీకి బదిలీ అయ్యారు. కొద్దిరోజులుగా ఇద్దరు గ్రామ సచివాలయానికి వెళ్లి హాజరుపట్టికలో సంతకాలు చేస్తున్నారు. దీంతో ప్రజలు ఎవరి వద్దకు వెళ్లి పనిచేయించుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.
మండలస్థాయి నాయకుని చేతివాటం
పుచ్చకాయలపల్లి గ్రామ పంచాయతీకి బదిలీపై వచ్చిన ఇద్దరికీ నియోజకవర్గ నేత ఇద్ద సిఫార్సు లేఖలు ఇప్పించింది ఓ మండలస్థాయి నాయకుడేనని చర్చ జరుగుతోంది. మొదట విధుల్లో చేరిన మహిళా ఉద్యోగికి పలు గ్రామాల నాయకులు చెప్పడంతో ఆగస్టులోనే సిఫార్సు లేఖ ఇప్పించారు. సెప్టంబర్‌లో బదిలీల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత మరో ఉద్యోగికి కూడా సిఫార్సు లేఖను అందించారు. తొలుత లేఖను తీసుకున్న రామకోటమ్మ అన్ని ఆర్డర్స్ తీసుకుని పుచ్చకాయలపల్లిలో ఉద్యోగంలో చేరారు. కానీ ఎలాంటి ఆర్డర్స్ లేకుండానే చిన్నమంత్రునాయక్‌ను మండలస్థాయి నేత చక్రం తిప్పి విధుల్లో చేర్చారని చర్చ నడుస్తోంది. అధికార పార్టీ నేతల ఒత్తిడి మేరకు అప్పట్లో ఇన్‌చార్జి ఎంపీడీవోగా పనిచేసిన శ్రీనివాసరెడ్డి ఒకే పోస్టులో ఇద్దరినీ చేర్చుకున్నారు. మండలస్థాయి అధికార పార్టీ నేతకు చేతులు తడపడంతోనే ఈ వ్యవహారం నడిపినట్లు పలువురు విమర్శిస్తున్నారు. మండలంలో కీలక నాయకుడు కావడంతో నియోజకవర్గస్థాయి నేత కిమ్మనకుండా సిఫార్సు లేఖలు ఇస్తున్నట్లు అధికార పార్టీలోనే అంతర్గత చర్చ నడుస్తోంది.
ఫ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లా
పుచ్చకాయలపల్లి పంచాయతీ కార్యదర్శిగా ఇద్దరూ విధుల్లో ఉన్న విషయాన్ని ఇప్పటికే జిల్లా పంచాయతీ అధికారికి తెలియజేశాం. ఇన్‌చార్జి ఎంపీడీవోగా ఉన్న శ్రీనివాసరెడ్డి ఇద్దరినీ చేర్చుకోవడంతోనే ఈ సమస్య తలెత్తింది. ఇద్దరు కార్యదర్శులకూ ఉన్నతాధికారులు ఇచ్చిన ఆర్డర్స్ ఉన్నాయి.
- జాన్ సుందరం, ఎంపీడీవో, పెద్దారవీడు
Updated Date - Oct 16 , 2024 | 06:54 AM