లక్కీ లాటరీ
ABN, Publish Date - Oct 14 , 2024 | 12:15 AM
మద్యం దుకాణాల కేటాయింపునకు లాటరీ ప్రక్రియను సోమవారం నిర్వహించనున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లను ఎక్సైజ్ అధికారులు పూర్తి చేశారు. ఒంగోలులోని అంబేడ్కర్ భవన్‌లో ఉదయం 8 గంటలకు ప్రక్రియను ప్రారంభించనున్నారు.
నేడు మద్యం దుకాణాల కేటాయింపు
ఒంగోలు అంబేడ్కర్ భవన్‌లో రెండు కౌంటర్లు ఏర్పాటు
నమూనా విధానాన్ని పరిశీలించిన కలెక్టర్ అన్సారియా, అధికారులు
ఒంగోలు (క్రైం), అక్టోబరు 13 : మద్యం దుకాణాల కేటాయింపునకు లాటరీ ప్రక్రియను సోమవారం నిర్వహించనున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లను ఎక్సైజ్ అధికారులు పూర్తి చేశారు. ఒంగోలులోని అంబేడ్కర్ భవన్‌లో ఉదయం 8 గంటలకు ప్రక్రియను ప్రారంభించనున్నారు. లక్కీ లాటరీ తగిలిన వారికి షాపులను కేటాయించనున్నారు. తొలుత ఎన్‌జీవో హోంలో ఏర్పాట్లు చేశారు. అక్కడ ప్రైవేటు కార్యక్రమాలు ఉండటంతో వేదికను అంబేడ్కర్ భవన్‌కు మార్చారు. లాటరీ నిర్వహణకు రెండు టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఆదివారం కలెక్టర్, ఎక్సైజ్ అధికారులు డమ్మీ లాటరీ తీసి పరిశీలించారు.
ఠ171 దుకాణాలకు 3,466 దరఖాస్తులు
జిల్లాలో మొత్తం 171 దుకాణాలకు నోటిఫికేషన్ ఇవ్వగా 3,466 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు ఫీజు ద్వారా రూ 69.32 కోట్ల మేర ఆదాయం లభించింది. లాటరీకి రెండు కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఒంగోలు, చీమకుర్తి, సింగరాయకొండ, పొదిలి, దర్శి సర్కిళ్లకు ఒకటో నంబర్ టేబుల్, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, కంభం, యర్రగొండపాలెం రెండో నంబర్ టేబుల్‌పై లాటరీ తీయనున్నారు. అదృష్టం వరించిన వారికి అక్కడికక్కడే దుకాణాన్ని కేటాయించనున్నారు. వీరు ఈనెల 14 నుంచి షాపును తెరిచి వ్యాపారం చేసుకోవచ్చు. మద్యం దుకాణం కోసం దరఖాస్తు చేసుకున్న వారి అంగీకారంతో ఎవరినైనా లాటరీకి అనుమతిస్తారు. వారికి టోకెన్లు ఇస్తారు. కలెక్టర్‌తో కలిసి ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కె.హేమంత్‌నాగరాజు, అసిస్టెంట్ కమిషనర్ కె.విజయ, ఒంగోలు ఆర్డీవో లక్ష్మీప్రసన్న, ఏఈఎ్‌సలు డి.బాలయ్య, వై.వెంకట్, ఎ.జనార్దన్‌రావు సిబ్బంది అబేద్కర్ భవన్‌లో ఏర్పాట్లను ఆదివారం పరిశీలించారు.
ఠ సింగరాయకొండ సర్కిల్‌లో ఎక్కువ దరఖాస్తులు
జిల్లాలో మొత్తం 171 మద్యం దుకాణాలకు 3,466 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో షాపునకు సగటున 27.57 అందాయి. సింగరాయకొండ సర్కిల్‌లో 14 దుకాణాలకు ఒక్కోదానికి సగటున 27.57 చొప్పున అత్యధికంగా 386 వచ్చాయి. అతి తక్కువగా దర్శి సర్కిల్‌లో 23 దుకాణాలకు 382 (సగటున 16.60) దాఖలయ్యాయి. ఒంగోలులో 34 దుకాణాలకు 607, గిద్దలూరులో 13 షాపులకు 232 దరఖాస్తులు అందాయి. ఈ రెండు సర్కిళ్లలోనూ ఒక్కో షాపునకు సగటున 17.85 దాఖలయ్యాయి. మార్కాపురంలో 13 దుకాణాలకు 327 (25.15), కంభంలో 10 షాపులకు 240 (సగటున 24) దరఖాస్తులు వచ్చాయి. కనిగిరి సర్కిల్ పరిధిలో 19 దుకాణాలకు 391 (20.57), చీమకుర్తి సర్కిల్‌లో 16 మద్యం దుకాణాలకు 353 (22.06) దరఖాస్తులు సమర్పించారు. పొదిలి సర్కిల్ పరిధిలో 16 దుకాణాలకు 297 (18.56), యర్రగొండపాలెంలో 13 షాపులకు 255(20.27) దాఖలు చేశారు.
అన్ని ఏర్పాట్లు చేశాం
ఖాజామోహిద్దీన్, ఎక్సైజ్ ఈఎస్
మద్యం దుకాణాల కేటాయింపునకు లాటరీ ప్రక్రియ సోమవారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతుందని ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఖాజామొహిద్దీన్ తెలిపారు. నగరంలోని అంబేడ్కర్ భవన్‌లో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. ప్రాంగణమంతా వాటర్ ప్రూఫ్ టెంట్లు వేయించడంతోపాటు దరఖాస్తుదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని లాటరీ ప్రక్రియను తిలకించేందుకు ఎల్‌ఈడీ స్ర్కీన్‌లను కూడా ఏర్పాటు చేశామన్నారు.
Updated Date - Oct 14 , 2024 | 12:15 AM