ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

భూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలి

ABN, Publish Date - Dec 05 , 2024 | 11:33 PM

భూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి అధికారులను ఆదేశించారు. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడంతోపాటు బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్న నేపథ్యంలో గురువారం స్థానిక ప్రకాశం భవన్‌లో శాసనసభ్యులు, వివిధ శాఖల జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు.

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి డాక్టర్‌ స్వామి

మంత్రి స్వామి ఆదేశం

నేటి నుంచి నిర్వహించే రెవెన్యూ

సదస్సులపై అధికారులతో సమావేశం

ఒంగోలు కలెక్టరేట్‌, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి) : భూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి అధికారులను ఆదేశించారు. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడంతోపాటు బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్న నేపథ్యంలో గురువారం స్థానిక ప్రకాశం భవన్‌లో శాసనసభ్యులు, వివిధ శాఖల జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. మీకోసం అర్జీలలో 70నుంచి 90శాతం రెవెన్యూ సమస్యలకు సంబంధించినవే వస్తున్నాయన్నారు. ఈనేపథ్యంలో వీటి శాశ్వత పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఈ సదస్సులను ఆగస్టులోనే నిర్వహించాలనుకున్నా అధికారుల బదిలీలు, వరదల నేపథ్యంలో కొంత జాప్యం జరిగిందన్నారు. చుక్కలు, 22(ఎ) జాబితాలో ఉన్న భూములపైనా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రీహోల్డ్‌ భూముల రిజిస్ట్రేషన్లలో అక్రమాలను కూడా ఈ సదస్సుల ద్వారా గుర్తించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. భూ ఆక్రమణల నిరోధానికి పటిష్టమైన చట్టాన్ని కూడా ప్రభుత్వం తెచ్చిందన్నారు. రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు గ్రామాల వారీ షెడ్యూల్‌ కూడా రూపొందించినందున స్థానికులకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు.

మండలానికి ఒక నోడల్‌ అధికారి నియామకం : కలెక్టర్‌

కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా మాట్లాడుతూ జిల్లాలో 826 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయన్నారు. వీటిల్లో రెవెన్యూ సదస్సుల కోసం తహసీల్దార్‌ ఆధ్వర్యంలో ఒకటి, డిప్యూటీ తహసీల్దార్‌ ఆధ్వర్యంలో మరో బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాస్థాయి అధికారులను కూడా మండలాలకు ప్రత్యేక నోడల్‌ అధికారులుగా నియమించినట్లు పేర్కొన్నారు. ఈ రెవెన్యూ సదస్సులలో అర్జీలు ఇచ్చిన ప్రజలకు అప్పటికప్పుడే రసీదు ఇవ్వడంతోపాటు అదేరోజు ఆ వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరిచే విధంగా శిక్షణ కూడా ఇచ్చినట్లు తెలిపారు. మార్కాపురం శాసనసభ్యుడు కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ వాస్తవ అసైన్డ్‌దారులకు న్యాయం చేసేందుకు ఇది మంచి అవకాశమన్నారు. సత్వర నిర్ణయం తీసుకొని బాధితుల తరఫున నిలబడాలన్నారు. మార్కాపురంలోని చెన్నకేశవస్వామి ఆలయ భూములు దేవదాయశాఖ అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల అక్రమంగా రిజిస్ట్రేషన్‌ అయ్యాయని సమావేశం దృష్టికి తెచ్చారు. వీటిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.

అక్రమాలకు పాల్పడిన అధికారులను సదస్సులకు దూరంగా ఉంచాలి : ఎమ్మెల్యే ఉగ్ర

సమావేశంలో కనిగిరి శాసనసభ్యుడు డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ గతంలో అవకతవకలకు పాల్పడిన అధికారులను ఈ రెవెన్యూ సదస్సులకు దూరంగా ఉంచాలన్నారు. వీటిపై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు స్థానికంగా సదస్సులు జరిగే రోజు ఉపాధి హామీ పథకం పనులు నిర్వహించకుండా ప్రజలంతా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ మాట్లాడుతూ వాస్తవ భూయజమానులకు, వాస్తవ అసైన్డ్‌దారులకు న్యాయం చేసేలా అఽధికారులు పనిచేయాలని కోరారు. టీడీపీ ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్‌చార్జి గుడూరి ఎరిక్షన్‌బాబు మాట్లాడుతూ పుల్లలచెరువు మండలం మానేపల్లిలో కొండపోరంబోకు భూముల ఆక్రమణపై పూర్తిస్థాయిలో విచారణ చేసి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.గోపాలకృష్ణ, డీఆర్వో చినఓబులేషు, ఒంగోలు ఆర్డీవో లక్ష్మీప్రసన్న, మేయర్‌ గంగాడ సుజాత, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఆర్‌.స్వరూప్‌ (టీడీపీ), డీఎస్‌ క్రాంతికుమార్‌ (వైసీపీ), బి.రాజశేఖర్‌ (బీజేపి), రసూల్‌ (కాంగ్రెస్‌), సుదర్శనరావు (ఆప్‌), టి.వెంకటస్వామి (బీఎస్పీ)తో పాటు పలుశాఖల అధికారులు, రైతు సంఘాల నాయకులు, ఎన్‌జీవోల ప్రతినిధులు పాల్గొన్నారు.


నోడల్‌ అధికారులు వీరే..

జిల్లాలో శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్న గ్రామ రెవెన్యూ సదస్సులను పర్యవేక్షించేందుకు మండలానికి ఒక్కో నోడల్‌ అధికారిని నియమిస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు ఇచ్చారు. బీసీ కార్పొరేషన్‌ ఈడీ ఎం.వెంకటేశ్వరరావు (అర్ధవీడు), గిద్దలూరు మునిసిపల్‌ కమిషనర్‌ డి.వెంకటదాసు (బేస్తవారపేట), డీఎస్‌వో పద్మశ్రీ (కంభం), సర్వే శాఖ ఏడీ గౌస్‌బాషా (దోర్నాల), జడ్పీ సీఈవో బి.చిరంజీవి (గిద్దలూరు), జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఎస్‌.శ్రీనివాసరావు (కొమరోలు), మార్కాపురం మునిసిపల్‌ కమిషనర్‌ నారాయణరావు (మార్కాపురం), మార్కెటింగ్‌శాఖ ఏడీ ఉపేంద్ర (పెద్దారవీడు), వెలిగొండ ప్రాజెక్టు ఎస్‌డీసీ శివరామిరెడ్డి (పుల్లలచెరువు), జిల్లా ఉద్యానవన శాఖ అధికారి గోపీచంద్‌ (రాచర్ల), విజిలెన్స్‌ ఎస్‌డీసీ ఎ.కుమార్‌ (తర్లుబాడు), ఏపీఎంఐపీ పీడీ రమణ (త్రిపురాంతకం)ను ప్రత్యేకాధికారులుగా నియమించారు. వీరితోపాటు మార్కాపురం ఎస్‌డీసీ సత్యనారాయణ (వైపాలెం), కేవోఆర్‌జీపీ ఎస్‌డీసీ సునీల్‌కుమార్‌ (సీఎస్‌ పురం), హౌసింగ్‌ పీడీ పి.శ్రీనివాసప్రసాద్‌ (దర్శి), ఏపీఐఐసీ జీఎం మదన్‌మోహన్‌ (దొనకొండ), ఒంగోలు డీఆర్సీ ఏడీఏ వెంకటరావు (హెచ్‌ఎంపాడు), కనిగిరి ఏడీఏ రమణ (కనిగిరి), జిల్లా రిజిస్ట్రార్‌ ఎ.బాలాంజనేయులు (కొనకనమిట్ల), జిల్లా ఆడిట్‌ అధికారి ఎల్‌.శంకరనారాయణరెడ్డి (కురిచేడు), పశుసంవర్థకశాఖ డీడీ డాక్టర్‌ రవి (మర్రిపూడి), కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్‌ గాయత్రీదేవి (పీసీపల్లి), దేవదాయశాఖ ఏసీ పానకాలరావు (పామూరు), జిల్లా మైన్స్‌ అధికారి రాజశేఖర్‌ (పొదిలి), కనిగిరి డీఐవోఎస్‌ రాజేంద్రప్రసాద్‌ (పొన్నలూరు), బీపీసీఎల్‌ ఎస్‌డీసీ శ్రీదేవి (వెలిగండ్ల) ప్రత్యేకాధిరులుగా వ్యవహరిస్తారు. డ్వామా పీడీ జి.జోసఫ్‌కుమార్‌ (చీమకుర్తి), ఒంగోలు డీఐవోఎస్‌లు ఎన్‌.శ్రీనివాసరావు (కొండపి), పరిశుద్ధరావు (కొత్తపట్నం), డీఆర్‌డీఏ పీడీ వసుంధర (మద్దిపాడు), మత్స్యశాఖ అదికారి ఎ.చంద్రశేఖర్‌రెడ్డి (ముండ్లమూరు), జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి డాక్టర్‌ కె.బేబిరాణి (నాగులుప్పలపాడు), ఒంగోలు కార్పొరేషన్‌ కమిషనర్‌ వెంకటేశ్వరరావు (ఒంగోలు), కేఆర్‌సీసీ ఎస్‌డీసీ ఎస్‌.వరకుమార్‌ (సంతనూతలపాడు), డీపీవో గొట్టిపాటి వెంకటనాయుడు (సింగరాయకొండ), సాంఘిక సంక్షేమశాఖ అధికారి ఎన్‌.లక్ష్మానాయక్‌ (టంగుటూరు), ఐసీడీఎస్‌ పీడీ ఎం.మాధురి (తాళ్లూరు), ఒంగోలు డీఐవోఎస్‌ యు.భాస్కర్‌(జరుగుమల్లి) ప్రత్యేక అధికారులుగా నియమితులయ్యారు.

Updated Date - Dec 06 , 2024 | 12:16 AM