శైవక్షేత్రాల్లో పున్నమి కాంతులు
ABN, Publish Date - Nov 16 , 2024 | 12:43 AM
కార్తీక పౌర్ణమి సందర్భంగా పట్టణంలోని పలు ఆలయా లు భక్తులతో కిటకిటలాడాయి.
మార్కాపురం వన్‌టౌన్, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): కార్తీక పౌర్ణమి సందర్భంగా పట్టణంలోని పలు ఆలయా లు భక్తులతో కిటకిటలాడాయి. స్థానిక జగదాంబ సమేత మార్కండేశ్వరస్వామి ఆలయంలో తెల్లవారు జాము నుంచే భక్తులు స్వామి దర్శనానికి బారులు తీరారు. మార్కండేశ్వరస్వామి, జగదాంబ మాతలకు అర్చకులు వేలూరి ఆంజనేయశర్మ, రెంటచింతల వరుణ్‌తేజ శర్మలు ప్రత్యేక అభిషేకాలు, అలంకరణ, అర్చనలు నిర్వహించారు. మహిళలు కార్తీక దీపాలు వెలిగించి నోములు నోచారు. నాగదేవతలకు పాలుపోసి పూజలు చేశారు. రాత్రి జ్వాలాతోరణం నిర్వహించారు. ఈవో ఈదుల చెన్నకేశవరెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాలు పర్యవేక్షించారు.
త్రిపురాంతకం : కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం త్రిపురాంతకేశ్వర స్వామి, బాలాత్రిపుర సుందరీదేవి అమ్మవార్ల ఆలయాల్లో ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి త్రిపురాంతకేశ్వరస్వామికి ప్రత్యేక పూజ లు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని ఉసిరిచెట్టు కింద, బెకసోమేస్వర స్వామి, అపరాదేశ్వరస్వామి, రససిద్ది గణపతి వద్ద కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేసి త్రిపురాంతకేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు విశ్వనారాయణ శాస్ర్తి స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా నాయకుడు మాగుంట రాఘవరెడ్డి స్వామి, అమ్మవార్లను దర్శించుకుని, పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తుల కోసం ఆలయ సమీపంలోని అన్ని సామాజిక వర్గాల సత్రాలలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పూజా కార్యక్రమాలలో ఆలయ ఈవో చెన్నకేశవరెడ్డి, సిబ్బంది సాల్గొన్నారు.
త్రిపురాంతకం : కార్తీక పౌర్ణమి సందర్భంగా త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి జ్వాలా తోరణాన్ని వైభవంగా నిర్వహించారు. ఆవు నెయ్యితో తయారు చేసిన ఒత్తులను తోరణంగా కట్టి వెలిగించారు. ఆకాశదీపం వెలిగించారు. పార్వతి త్రిపురాంబ సమేత త్రిపురాంతకేశ్వర స్వామిని జ్వాలా తోరణం కిందఊరేగింపు నిర్వహించారు. బాలాత్రిపుర సుందరీదేవికి లక్షదీపార్చన నిర్వహించారు.
కంభం : కంభం, అర్థవీడు మండలాల్లోని శివాలయాలు భక్తుల శివనామస్మరణతో మారు మోగాయి. మండలంలో చిన్నకంభం, తురిమెళ్ళలోని కనకసురభేశ్వరాలయం, రావిపాడులోని కోటేశ్వరస్వామి ఆలయం, వీరభద్రస్వామి దేవాలయాల్లో, పట్టణంలోని శివాలయాలలో భక్తులు పోటెత్తారు.
గిద్దలూరు : దేవాలయాలలో కార్తీక పౌర్ణమి శోభ కనిపించింది. పట్టణంలోని పాతాళ నాగేశ్వరస్వామి దేవాలయానికి శుక్రవారం తెల్లవారుజాము నుంచే అభి షేకాలు ప్రారంభం కాగా స్వామి వారిని దర్శించుకు నేందుకు భక్తులు పోటెత్తారు. కార్తీక దీపాలు వెలిగించి పూజలు చేశారు. టీడీపీ నాయకులు బిల్లా రమేష్, వేములపాటి చంటి, చెన్నయ్య, సురేష్, తదితరుల ఆధ్వర్యంలో దాతల సహకారంతో దేవస్థానా నికి వచ్చిన భక్తులందరికీ అల్పాహారం, భోజన సౌకర్యం కల్పించారు. కుసుమ హరనాథ మందిరం ఆవరణలో 100 మంది ఆర్యవైశ్య దంపతులు కార్తీక పౌర్ణమి రుద్రాభిషేక కార్యక్రమంలో సామూహికంగా పాల్గొన్నారు. మందిరం అధ్యక్షులు నటుకుల శ్రీనివాసులు ఆధ్వర్యంలో చంద్రశేఖర పూజారి సామూహికంగా రుద్రాభిషేకాలు నిర్వహించారు. అభయాంజనేయస్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. అమ్మవారిశాల, నవవస్త్ర గణపతి కమిటీ ఆధ్వర్యంలో నాగమయ్య గుడివద్ద శుక్రవారం సాయంత్రం జ్వాలా తోరణం నిర్వహించారు. అమ్మవారిశాలలో ఆకాశ దీపాన్ని ఎగురవేశారు. కెఎస్‌పల్లి, పాపులవీడు దేవస్థానాలలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
తర్లుపాడు : మండలంలోని శివాలయాలలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక నీలకంఠేశ్వస్వామి ఆలయంలో, వీరభద్రస్వామి ఆలయంలో, వేణుగోపాలస్వామి ఆలయంలో నాగెళ్ల ముడుపు పార్వతివర్థని ఆఽలయంలో, కేతగుడిపి శివాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. భక్తులకు ఆలయ ధర్మకర్త నేరెళ్ల శివకుమార్, దేవులపల్లి పవన్‌కుమార్ జవ్వాజి విజయభాస్కర్‌రావు, ఉభయదాతలు గాదంశెట్టి శేషగిరి రావులు ప్రసాదాలు పంపిణీ చేశారు.
పొదిలి : మండలంలోని పలు శివాలయాలతోపాటు పట్టణంలోని పార్వతీసమేత నిర్మమహేశ్వర దేవాలయం లో కార్తీకశోభతో కళకళలాడింది. శివాలయాలకు ఉద యం నుంచే భక్తులు పోటెత్తారు. ఉపవాసాలు ఉండి సాయంత్రం వేళల్లో దేవాలయ ప్రాంగణంలో మహిళలు పెద్దఎత్తున చేరుకొని కార్తీక దీపాలను వెలిగించారు. ఈ సందర్భంగా ఆయా దేవాలయాల్లో అర్చకులు ఏకాదశి రుద్రాభిషేకాలు నిర్వహించారు. వర్షం వచ్చినప్పటికీ భక్తులు లెక్కచేయకుండా స్వామి దర్శనానికి బారులు తీరారు. ఈగలపాడు శివాలయం భక్తుల తాకిడితో కిటకిటలాడింది. నిర్మమహేశ్వరస్వామి దేవాలయంలో సాయంత్రం జ్వాలాతోరణ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తుల అన్నదాన కార్య క్రమానికి టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వరికుంట్ల అనీల్ 13 క్వింటాళ్ళు బియ్యాన్ని అందజేశారు. అదే విధంగా దేవాలయం గోపురం దాత మాకినేని రమణ య్య, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గునుపూడి భాస్కర్‌ల ఆధ్వర్యంలో అన్నదానం, జ్వాలాతోరణం కార్యక్రమ ఏర్పాట్లు చేశారు.
ఎర్రగొండపాలెం రూరల్ : కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఎర్రగొండపాలెంలోని శ్రీకాశీవిశ్వేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారు జాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ నిర్వాహకులు తగు ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగ ణంలో మహిళ భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు. రాత్రికి ఆలయంలో కర్పూర హారతి వెలిగించారు.
పెద్ద దోర్నాల : కార్తీక పౌర్ణమి సందర్భంగా స్థానిక శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం, శ్రీలక్ష్మీ నరసింహా స్వామి దేవాలయం,సీతా రామాలయం, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవాలయం, నటరాజ్ కూడిలిలో,మోట్ల మల్లికార్జున స్వామి దేవాలయంలో మహిళలు, అయ్యప్ప మాలధారులు విశేషంగా పాల్గొని కార్తీక పౌర్ణమి క్రతువుల్లో పాల్గొన్నారు.
Updated Date - Nov 16 , 2024 | 12:43 AM