ఆర్థిక సంఘం నిధులొచ్చాయ్!
ABN, Publish Date - Dec 08 , 2024 | 01:11 AM
నిధులు లేక కునారిల్లుతున్న గ్రామ పంచాయతీలను ఆర్థికంగా ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగా ఆర్థిక సంఘం నిధులను ఠంచన్‌గా విడుదల చేస్తోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లపాటు నిధులు ఇచ్చినట్లే ఇచ్చి లాగేసుకోవడంతో పంచాయతీల్లో డబ్బుల్లేక ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. వైసీపీ ప్రభుత్వంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగడంతో 80శాతం మంది ఆపార్టీ సానుభూతి పరులే సర్పంచ్‌లుగా గెలుపొందారు.
జిల్లాకు రూ.40.84 కోట్లు కేటాయింపు
కునారిల్లుతున్న పంచాయతీలకు ఊరట
గ్రామాల్లో వివిధ పనులకు వినియోగించుకునే అవకాశం
వైసీపీ ప్రభుత్వ హయాంలో పంచాయతీలు నిర్వీర్యం
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితి మెరుగు
ఒంగోలు కలెక్టరేట్, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): నిధులు లేక కునారిల్లుతున్న గ్రామ పంచాయతీలను ఆర్థికంగా ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగా ఆర్థిక సంఘం నిధులను ఠంచన్‌గా విడుదల చేస్తోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లపాటు నిధులు ఇచ్చినట్లే ఇచ్చి లాగేసుకోవడంతో పంచాయతీల్లో డబ్బుల్లేక ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. వైసీపీ ప్రభుత్వంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగడంతో 80శాతం మంది ఆపార్టీ సానుభూతి పరులే సర్పంచ్‌లుగా గెలుపొందారు. అప్పటికే పంచాయతీల్లో ఉన్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం లాగేసుకోవడంతో పాలకవర్గాలు దిష్టిబొమ్మల్లా మారాయి. ఇంకో వైపు కేంద్రప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సంఘం నిధులను కూడా విద్యుత్ చార్జీలు, పారిశుధ్య కార్మికుల జీతాల పేరుతో వాడేసుకుంది. ఇంకోవైపు గ్రామాల్లో తమ పట్టును నిలుపుకొనేందుకు సర్పంచ్‌లు పలురకాల అభివృద్ధి పనులు చేసి డబ్బులు రాక అప్పులపాలయ్యారు. ఈనేపథ్యంలో ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పంచాయతీలను బలోపేతం చేసేందుకు శ్రీకారం చుట్టింది.
నేరుగా పంచాయతీలకే నిధులు
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సంఘం నిధులను కూటమి ప్రభుత్వం నేరుగా పంచాయతీ బ్యాంకు అకౌంట్లకు జమ చేస్తోంది. అందులోభాగంగా జిల్లాలోని 729 గ్రామపంచాయతీలకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి త్రైమాసికం కింద రూ.40.84కోట్లు మంజూరు చేసింది. వాటిని జనాభా ప్రతిపా దికన పంచాయతీలకు కేటాయించారు. ఒక్కో గ్రామ పంచాయతీ అకౌంట్‌లో రూ.50వేల నుంచి రూ.5లక్షల వరకు పడ్డాయి. దీంతో ఇప్పటి వరకు ఎలాంటి నిధులు లేక కునారి ల్లుతున్న గ్రామ పంచాయతీలకు ఊరట లభించింది. ఈ నిధులతో గ్రామాల్లో పారిశుధ్యంతోపాటు అత్యవసర పనులు చేసుకునే అవకాశం ఏర్పడింది. జిల్లాకు బేసిక్ గ్రాంటు రూ.16.33 కోట్లు, టైడ్ గ్రాంటు కింద రూ.24.50 కోట్లు మంజూరయ్యాయి.
కూటమి ప్రభుత్వం వచ్చాక రెండోసారి..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలలకు గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మూడో త్రైమాసిక ఆర్థిక సంఘం నిధులు మంజూరయ్యాయి. ఇప్పుడు 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడత నిధులు మంజూరు చేశారు. టైడ్ నిధులను ఓడీఎఫ్ నిర్వహణ, ఇంటింటి నుంచి చెత్త సేకరణ, తాగునీటి సరఫరా, రహదారులు వంటి పనులకు ఖర్చుచేసే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. అయితే ఈ నిధులను నిబంధనలకు అనుగుణంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే అన్‌టైడ్ నిధుల నుంచి పదిశాతం విద్యుత్ బకాయిలను కచ్ఛితంగా చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఎల్‌ఈడీ వీధి దీపాల నిర్వహణ, కాంట్రాక్టు సిబ్బంది వేతనాలు, ఇతర సామగ్రి కొనుగోలు, ప్రభుత్వ పాఠశాలల భవనాల మరమ్మతులు, ఆట స్థలాల అభివృద్ధి పనులను చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.
Updated Date - Dec 08 , 2024 | 01:12 AM